అలనాటి అందాల నటి!

గానం... నటన... అందం... చలాకీతనం. ఇవి చాలవూ ఓ ఆడపిల్ల ప్రపంచాన్ని శాసించడానికి? ఇవన్నీ ఉన్నాయి కాబట్టే క్లాడటే కోల్‌బర్ట్‌ హాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకున్న అందాల నటిగా పేరు పొందింది. ఆస్కార్‌ సహా ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. నాటక, టీవీ, ఫ్యాషన్, సినీ రంగాలు ఆమె కోసం ఎర్రతివాచీలు పరిచాయి. రెండు దశాబ్దాల కాలం ఆమెకు ఎదురులేకపోయింది. ‘ఇట్‌ హ్యాపెన్డ్‌ వన్‌ నైట్‌’ (1934) సినిమా ఆమెకు ఆస్కార్‌ను అందించింది. ‘క్లియోపాత్రా’ (1934), ‘ద పామ్‌ బీచ్‌ స్టోరీ’ (1942) లాంటి సినిమాలు ఆమెకు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చాయి. హాలీవుడ్‌ క్లాసిక్‌ సినిమాల్లో గొప్ప నటీమణిగా అమెరికన్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆమెను మరణాంతరం తరువాత 1999లో గుర్తించి గౌరవించింది. క్లాడటే ఫ్రాన్సులోని సెయింట్‌-మాండేలో సెప్టెంబర్‌ 13, 1903లో జన్మించింది. నటుడు దర్శకుడైన నార్మన్‌ ఫాస్టర్‌ను 1928వ సంవత్సరంలో పెళ్లిచేసుకుంది. కొన్నాళ్ల పాటు సజావుగా సాగిన వీరి కాపురం 1935లో కలతలు వచ్చి విడిపోయారు. అటు పిమ్మట 1935లోనే డాక్టర్‌ జోయల్‌ ప్రెస్‌మెన్‌ను రెండో పెళ్లి చేసుకొంది. అతను 1968లో చనిపోయారు. ఆ తరువాత చనిపోయేంత (జులై 30, 1996) వరకు ఒంటరిగానే జీవించారు క్లాడటే.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.