భయానక సినిమాల పితామహుడు!

ఆయన సినిమాలు చూసి ప్రేక్షకులు ఝడుసుకున్నారు... ఉలిక్కిపడ్డారు... వణికిపోయారు... అయినా సరే, వాటినే మళ్లీ మళ్లీ చూశారు. ఆఖరికి ఆయనకి ‘ఫాదర్‌ ఆఫ్‌ ద జాంబీ ఫిల్మ్‌’ అనే బిరుదు ఇచ్చేశారు. జాంబీ ఫిల్మ్‌ అంటే చనిపోయిన వాళ్లు తిరిగి రావడం, లేదా బతికున్న వాళ్లపై ఆవహించి హత్యలు చేయించడం, నరమాంస భక్షకుల్లాగా మారడం... ఇలాంటి పాత్రలతో తీసిన సినిమా అన్నమాట. అలా భయానక సినిమాలకి ఆద్యుడుగా పేరు తెచ్చుకున్న వాడే జార్జి ఎ. రోమెరో. నిర్మాతగా, దర్శకుడిగా, ఎడిటర్‌గా, స్క్రీన్‌ రచయితగా ఈయన చేసిన కృషంతా... ‘భయంకరమైనదే’! ఈయన సినిమాల పేర్లన్నీ దాదాపుగా ‘డెడ్‌’ అనే పదంతో ఉంటాయి. అందుకే ఈయనకు ‘గాడ్‌ఫాదర్‌ ఆఫ్‌ ద డెడ్‌’ అనే ప్రాచుర్యం కూడా వచ్చింది. ఇలాంటి సినిమాöకు ప్రపంచ వ్యాప్తంగా నాంది పలికినదిగా ‘నైట్‌ ఆఫ్‌ ద లివిండ్‌ డెడ్‌’ను చెబుతారు. ఇది ఆయన తీసిందే. ఆ తర్వాత ‘డాన్‌ ఆఫ్‌ ద డెడ్‌’, ‘డే ఆఫ్‌ ద డెడ్‌’, ‘ల్యాండ్‌ ఆఫ్‌ ద డెడ్‌’, ‘సిటీ ఆఫ్‌ ద డెడ్‌’, ‘సర్వైవల్‌ ఆఫ్‌ ద డెడ్‌’, ‘ఎంపైర్‌ ఆఫ్‌ ద డెడ్‌’, ‘డైరీ ఆఫ్‌ ద డెడ్‌’, ‘రోడ్‌ ఆఫ్‌ ద డెడ్‌’లాంటి సినిమాలు, టీవీ సీరియల్స్‌ ఎన్నో ఈయన రూపొందించాడు. ఇతరేతర సినిమాలు కూడా తీసినా ఈయన్ని మాత్రం ‘భయంకర’ దర్శకుడుగానే ప్రేక్షకులు గుర్తుంచుకున్నారు. న్యూయార్క్‌లో 1940 ఫిబ్రవరి 4న పుట్టిన ఈయన కొన్ని దశాబ్దాల పాటు ప్రేక్షకులను భయపెట్టి, 2017 జులై 16న తన 77వ ఏట మరణించారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.