అయిదు దశాబ్దాల ముద్ర

ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం ప్రయత్నించే హాలీవుడ్‌లో అయిదు దశాబ్దాల పాటు నటుడిగా కొనసాగడం అసాధారణమే. అదే సాధించాడు హెన్రీ ఫాండా. నాటకాలతో మొదలు పెట్టి వెండితెరకి ఎదిగి విలక్షణ పాత్రల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ద గ్రేప్స్‌ ఆప్‌ రాత్‌’, ‘ద ఆక్స్‌బౌ ఇన్సిడెంట్‌’, ‘మిస్టర్‌ రాబర్ట్స్‌’, ‘12 యాంగ్రీమెన్‌’, ‘వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ ద వెస్ట్‌’, ‘యువర్స్‌ మైన్‌ అండ్‌ అవర్స్‌’ లాంటి సినిమాల ద్వారా మెప్పించాడు. ‘ఆన్‌ గోల్డెన్‌ పాండ్‌’ సినిమా ద్వారా ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అందుకున్నాడు. ఇతడి కుటుంబం అంతా నటులుగా పేరు తెచ్చుకోవడం విశేషం. కూతురు జానే ఫాండా, కొడుకు పీటర్‌ ఫాండా, మనవరాలు బ్రిడ్జెట్‌ ఫాండా, మనవడు ట్రోయ్‌ గ్యారిటీ నటులుగా రాణించారు. హాలీవుడ్‌లో గ్రేటెస్ట్‌ మేల్‌ స్టార్‌గా ఇతడిని అమెరికన్‌ ఫిలిం ఇనిస్టిట్యూట్‌ గుర్తించడం విశేషం. నెబ్రాస్కాలో 1905 మే 16న పుట్టిన ఇతడు ఇరవై ఏళ్ల వయసులో నటన పట్ల ఆకర్షితుడయ్యాడు. నాటకాల ద్వారా పేరు తెచ్చుకుని వెండితెరపై మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఇతడు, కాలిఫోర్నియాలో 1982 ఆగస్టు 12న తన 77వ ఏట మరణించాడు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.