అవార్డుల తార

మూడు ఆస్కార్‌ అవార్డులు... రెండు ప్రైమ్‌టైమ్‌ ఎమ్మీ అవార్డులు... టోనీ అవార్డు... నాలుగు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులు... బాఫ్టా అవార్డు సహా ఎన్నో పురస్కారాలు ఆమె సొంతం. నాటక రంగం, సినీ రంగం, టెలివిజన్‌ రంగంలో అందాల తారగా, మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఆమే స్వీడన్‌ నటి ఇన్‌గ్రిడ్‌ బెర్గ్‌మన్‌. ‘కసబ్లాంకా’ (1942), ‘నొటోరియస్‌’ (1946) సినిమాలతో అంతర్జాతీయ గుర్తింపు పొందింది. స్వీడన్‌లో 1915 ఆగస్టు 29న పుట్టిన బెర్గ్‌మన్, రెండేళ్లకే తల్లిని పదమూడేళ్లకి తండ్రిని కోల్పోయింది. తర్వాత అత్తయ్య పంచన చేరినా ఆమె ఆరు నెలలకే చనిపోవడంతో బెర్గ్‌మన్‌ ఈసారి మామయ్య ఇంటికి చేరింది. స్కాలర్‌షిప్స్‌తో చదువుకుంటూనే నాటకాల మీద ఆసక్తి పెంచుకుంది. ‘మంక్‌బ్రొగ్రీవెన్‌’ (1935) సినిమాతో వెండితెర ప్రవేశం చేసిన బెర్గ్‌మన్, స్వీడన్‌ సినిమాల్లో రాణించింది. దాంతో హాలీవుడ్‌ ఆమెకు ఎర్రతివాచీ పరిచింది. ‘ఇంటర్‌మెజో: ఎ లవ్‌స్టోరీ’ (1939) సినిమాతో స్టార్‌డమ్‌ అందుకుంది. ఆపై ‘ఫర్‌ హూమ్‌ ద బెల్‌ టోల్స్‌’, ‘గ్యాస్‌లైట్‌’, ‘ద బెల్స్‌ ఆఫ్‌ సెయింట్‌ మేరీస్‌’, ‘జోన్‌ ఆఫ్‌ ఆర్క్‌’, ప్రముఖ దర్శకుడు ‘స్పెల్‌బౌండ్‌’, ‘నొటోరియస్‌’, ‘స్ట్రామ్‌బొలి’, ‘జర్నీ టు ఇటలీ’, ‘అనస్టాసియా’, ‘మర్డర్‌ ఆన్‌ ద ఓరియంట్‌ ఎక్స్‌ప్రెస్‌’, ‘ఎ ఉమన్‌ కాల్డ్‌ గోల్డా’లాంటి సినిమాలతో మంచి నటిగా ప్రాచుర్యం పొందింది. ‘ద ఐడియల్‌ ఆఫ్‌ అమెరికన్‌ ఉమన్‌హుడ్‌’గా, హాలీవుడ్‌ మేటి నటిగా గుర్తింపు పొందిన బెర్గ్‌మన్, తన 67వ ఏట 1982 ఆగస్టు 29న లండన్‌లో మరణించింది.




Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.