ఆ రికార్డు ఆ దర్శకుడిదే

ఒక దర్శకుడు నాలుగు సార్లు ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్‌ అవార్డులు అందుకోవడం ఓ రికార్డు. ఆ రికార్డును జాన్‌ఫోర్డ్‌ సాధించాడు. ఈయన 1935, 1940, 1941, 1952 సంవత్సరాలలో ఈ పురస్కారాలు అందుకున్నాడు. యాభై ఏళ్ల సుదీర్ఘమైన సినీ ప్రస్థానంలో 140 సినిమాలను అందించాడు. ‘ద స్టేజ్‌కోచ్‌’, ‘ద సెర్చెర్స్‌’, ‘ద మ్యాన్‌ హూ షాట్‌ లిబర్టీ వాలాన్స్‌’, ‘ద గ్రేప్స్‌ ఆఫ్‌ రాత్‌’, ‘ద ఇన్ఫార్మర్‌’, ‘హౌ గ్రీన్‌ వజ్‌ మై వ్యాలీ’, ‘ద క్వయిట్‌ మేన్‌’ లాంటి ఎన్నో సినిమాలు అతడి దర్శకత్వ ప్రతిభకు గీటురాళ్లు. అమెరికాలో 1894 ఫిబ్రవరి 1న 11 మంది సంతానంలో ఒకడిగా పుట్టిన జాన్‌ మార్టిన్‌ ఫీనీ ఫుట్‌బాల్‌ ఆటగాడుగా రాణించినా, ఆపై సినిమా రంగం వైపు ఆకర్షితుడై జాక్‌ఫోర్డ్‌గా మారాడు. చిన్నప్పుడే ఇల్లు వదిలిపెట్టి సినిమాల్లో చేరిన అన్నయ్య స్ఫూర్తితో ఆ రంగంలోకి ప్రవేశించి అసిస్టెంటుగా, స్టంట్‌మేన్‌గా, నటుడిగా, కెమేరామేన్‌గా పనిచేస్తూ దర్శకుడిగా ఎదిగాడు. ఆరు ఆస్కార్‌ అవార్డులు, జార్జి ఈస్ట్‌మన్‌ అవార్డు, అమెరికన్‌ ఫిలిం ఇనిస్టిట్యూట్‌ జీవత సాఫల్య అవార్డు, ప్రెసిడెన్షియల్‌ మెడల్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌లాంటి ఎన్నో పురస్కారాలు పొందారు. రాజకీయ నేతగా కూడా సేవలందించిన జాన్‌ఫోర్డ్, కాలిఫోర్నియాలో 1973 ఆగస్టు 31, తన 79వ ఏట మరణించాడు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.