అగచాట్లు దాటిన అందాల తార!

‘అటు చూస్తే నార్మాషేరర్‌... ఇటు చూస్తే కాంచన మాల...’ అంటూ ఓ కవితలో రాశారు మహాకవి శ్రీశ్రీ. రెండు సినిమా హాల్స్‌లో రెండు అందాల తారల సినిమాలు ఆడుతుంటే, ఎటు పోవాలో తెలియని ఓ మధ్యతరగతి మనిషి సందిగ్ధానికి అద్దం పట్టారా కవితలో. అలా శ్రీశ్రీ ప్రస్తావించిన నార్మాషేరర్, హాలీవుడ్‌ అందాల తారగా, ఆస్కార్‌ అవార్డు అందుకున్న నటిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఉత్తమ నటిగా అయిదు సార్లు ఆస్కార్‌ నామినేషన్లు అందుకున్న తొలి వ్యక్తి ఆమె. ‘ద డైవోర్సీ’ (1930) సినిమాతో ఆస్కార్‌ను అందుకుంది. ప్రభుత్వం ఆమె గౌరవార్థం ఓ పోస్టల్‌ స్టాంపును వెలువరించింది. కానీ ఆమె ఆ స్థాయిని అందుకోడానికి నడిచింది మాత్రం అగచాట్ల ముళ్లబాటలోనే. మాంట్రియల్‌లో 1902 ఆగస్టు 10న పుట్టిన నార్మాషేరర్‌ తొమ్మిదేళ్లకే గాయనిగా వేదికలపై ప్రదర్శనలు ఇచ్దేది. అప్పుడే నటి కావాలని కలలు కంది. కానీ ఎదుగుతున్న కొద్దీ ఆమె ఆకృతి బొద్దుగా, ఎగుభుజాలు, మొద్దు చేతులతో మారింది. దీనికి సాయం కొంచెం మెల్లకన్ను. తండ్రి వ్యాపారంలో నష్టపోవడంతో అకస్మాత్తుగా పేదరికం చుట్టుముట్టింది. అమ్మ ఇద్దరు కూతుళ్లను తీసుకుని భవిష్యత్తు వెతుక్కుంటూ న్యూయార్క్‌ చేరింది. అక్కడ తొలి ప్రయత్నాల్లో, ‘ఈ మెల్లకళ్ల, ఊచకాళ్ల కుక్క పిల్లనా నటిగా తీసుకునేది?’ అనే వ్యాఖ్యానాలు ఎదురయ్యాయి. అయినా ఏదో మొండి ధైర్యం నార్మాది. యూవివర్శల్‌ పిక్చర్‌ సినిమాలో 8 మంది ఎక్స్‌ట్రాలను తీసుకుంటారని తెలిసి వెళితే 50 మంది క్యూకట్టి ఉన్నారు. అసిస్టెంటు ఒకొక్కళ్లనీ చూస్తూ ఏడుగురిని ఎంపిక చేసుకోగానే, చివర్లో ఉన్న నార్మా బొటనవేళ్లపై నిలబడి గట్టిగా దగ్గింది. అతడు చూడగానే నవ్వింది. ఆమె ఉత్సాహం చూసిన అతడు ‘నువ్వే ఎనిమిదో అమ్మాయివి’ అన్నాడు. అలా ‘వే డౌన్‌ ఈస్ట్‌’ సినిమాలో వెండితెరపై కనిపించింది. ఓ పక్క ప్రయత్నాలు చేస్తూనే ఓ వైద్యుడి సలహాపై గంటల తరబడి అద్దం ముందు నిలబడి కంటి కండరాలు బలపడ్డం కోసం వ్యాయామాలు చేసేది. క్రమంగా మోడల్‌గా అవకాశాలు వచ్చాయి. తర్వాత ‘ది స్టీలర్స్‌’ (1921) సినిమాలో కాస్త చెప్పుకోదగ్గ పాత్ర వచ్చింది. అలా 1927 కల్లా 13 నిశ్శబ్ద చిత్రాలు చేసింది. ‘ద స్టూడెంట్‌ ప్రిన్స్‌ ఇన్‌ ఓల్డ్‌ హీడెల్‌బెర్గ్‌’, ‘ద జాజ్‌ సింగర్‌’, ‘ద లాస్ట్‌ ఆప్‌ మిసెస్‌ చీనీ’, ‘దేర్‌ ఓన్‌ డిజైర్‌’, ‘స్ట్రేంజర్స్‌ మే కిస్‌’, ‘ఎ ఫ్రీ సోల్‌’, ‘రోమియో అండ్‌ జూలియట్‌’ లాంటి చిత్రాలతో అందాల తారగా ఎదిగింది. 1983 జూన్‌ 12న మరణించింది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.