వినోద మాధ్యమాల్లో విలక్షణంగా...

రేడియో, నాటకం, టీవీ, సినిమా, సాహిత్యం... ఇలా వివిధ వినోద మాధ్యమాల్లో రాణించిన వాడిగా ఆర్సన్‌ వెల్స్‌ గురించి చెప్పుకోవాలి. నటుడిగా, దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా గుర్తుండిపోయే ముద్ర వేశాడు. గొప్ప దర్శకుల్లో ఒకడుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాడు. దర్శకుడిగా అతడి తొలి సినిమా ‘సిటిజన్‌ కానే’ సినీ చరిత్రలోనే మేటి చిత్రంగా పేరొందింది. ఈ సినిమా కథకుడు, నిర్మాత, నటుడు, దర్శకుడు కూడా ఇతడే కావడం మరో విశేషం. ‘ద మ్యాగ్నిఫిసెంట్‌ అంబర్‌సన్స్‌’, ‘ద లేడీ ఫ్రమ్‌ షాంగాయ్‌’, ‘టచ్‌ ఆఫ్‌ ఈవిల్‌’, ‘ద ట్రయల్‌’, ‘కైమ్స్‌ ఎట్‌ మిడ్‌నైట్‌’, ‘ఎఫ్‌ ఫర్‌ ఫేక్‌’, ‘ద అదర్‌సైడ్‌ ఆఫ్‌ ద విండ్‌’ లాంటి సినిమాలు అతడికి అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టాయి. అమెరికాలో 1915 మే 6న పుట్టిన జార్జి ఆర్సన్‌ వెల్స్, తండ్రి తాగుడు వ్యసనం వల్ల ఆర్ధిక ఇబ్బందుల మధ్య పెరిగాడు. తల్లి పియానో నేర్పుతో కుటుంబాన్ని అరకొర ఆదాయం మధ్య నెట్టుకొచ్చేది. తొమ్మిదేళ్ల వయసులో తల్లి, పదిహేనేళ్ల వయసులో తండ్రి చనిపోవడంతో సంగీత, నాటక రంగాల కేసి దృష్టి సారించాడు. చిన్న చిన్న పాత్రలతో నటనపై పట్టు సాధించాడు. అలా నాటకం, రేడియో, టీవీల ద్వారా అంచెలంచెలుగా ఎదిగాడు. క్రమేణా సినిమా రంగంలో ప్రవేశించి విలక్షణంగా ముద్ర వేశాడు. ప్రతిష్ఠాత్మకమైన అనేక అవార్డులను అందుకున్న ఇతడు, కాలిఫోర్నియాలో 1985 అక్టోబర్‌ 10న తన 70వ ఏట మరణించాడు.





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.