మా‘మంచి’ సుబ్రహ్మణ్యం...!
అడిగితే వరాలిచ్చేవాడు దేవుడు..
అడక్కుండానే నవ్వులు పంచేవాడు హాస్యనటుడు!
ఎందుకో మరి ప్రతీ హాస్యనటుడూ మనింట్లో మనిషైపోతాడు. టీవీల్లో వినోద భరిత కార్యక్రమాలు ఎక్కువైనందునో ఏమో..? లేదంటే మన బాధల్ని మర్చిపోవడానికి నవ్వుల టానిక్కు ఫ్రీగా ఇస్తున్నందుకో ఏమో..? హాస్యనటుల్ని చూస్తే ‘మన..’ అనే భావన వచ్చేస్తుంది. ‘ఏవీఎస్‌’ని చూసినా అదే తుత్తి..! ‘మిస్టర్‌ పెళ్లాం’ నుంచీ ఈ మిస్టర్‌.. మన మనసులో ముద్రించుకుపోయాడు. ఒక్కో పాత్రతో టన్నుల లెక్కన వినోదాలు పంచిపెట్టాడు. మా మంచి సుబ్రహ్మణ్యం అని పిలుచుకొనే ఆ మంచి సుబ్రహ్మణ్యం గిలిగింతల స్మృతులు ఎన్నో మిగిల్చాడు.

                                            
ఏవీఎస్‌లో కామెడీ టైమింగ్‌ చిన్నప్పటి నుంచీ ఉంది. బహుశా తెనాలి గాలి అలాంటిదేమో..? మాంఛి మిమిక్రీ ఆర్టిస్టు. ఏం చేస్తే, ఏం చెబితే జనం నవ్వుతారో అతనికి బాగా తెలుసు. ఆ నాడి తెనాలిలో ఉన్నప్పుడే పట్టేశాడు. రాతలో, మాటలో, అతని కదిలికలోనే నవ్వు నిక్షిప్తమై ఉంది. అందుకే తెరపై పనిగట్టుకొని నవ్వించే పని పెట్టుకోలేదు. చిన్నపాటి డైలాగ్‌ అయినా తన సొంతం చేసుకొని విసిరాడు. నవ్వులు పండాయి. తెలుగులో హాస్యనటులు ఎక్కువ. కొత్తవాడికి తేలిగ్గా స్థానం దొరకదు. పైగా ఏవీఎస్‌ అడుగుపెట్టే సమయానికి కోట, బ్రహ్మానందం, బాబుమోహన్‌ల హవా ఉధృతంగా ఉంది. వాళ్లకు తోడుగా మరో సెపరేటు బ్యాచ్‌ ఉంది. జంధ్యాల, రేలంగిలాంటి వాళ్ల సినిమాల్లో కనీసం ఇరవై మంది హాస్య నటులు కనిపించేవారు. ‘కొత్తోడొసున్నాడంటే’ వీరికి దీటుగా నవ్వించే సత్తా కావాలి. బాపు, రమణల దయవల్ల సుబ్రహ్మణ్యంకి మంచి ప్లాట్‌ఫామ్‌ దొరికింది ‘మిస్టర్‌ పెళ్లాం’తో. ‘చివంగీ’ (శివంగి) అంటూ ఆమనిని ఆట పట్టించే గోపాలంగా అతని పాత్ర తొలిచూపులోనే మనసులో ప్రింటు పడిపోయింది. పైగా ‘అదో తుత్తి’ అనే ఊతపదం ఒకటి. దానికి తోడు రమణగారి మాటలు భలే తోడ్పాటునిచ్చాయి. కొత్తవాడిలో ఉండాల్సిన ప్రత్యేకత ఏవీఎస్‌లో ‘మిస్టర్‌ పెళ్లాం’నాడే కనిపించేసింది. ఆ సినిమాకి ఉత్తమ హాస్యనటుడిగా నంది రావడంతో ఏవీఎస్‌కి ఘనమైన ఆరంభమే దక్కింది. తొలి సినిమా మురిపాలు చూసుకొంటూ కాలం గడపలేదు. అవకాశం వచ్చిన ప్రతీసారీ నిరూపించుకొనే విషయంలో ఏ మాత్రం వెనుకంజ వేయలేదు. ‘ఘటోత్కచుడు’, ‘శుభలగ్నం’ సినిమాల్లో పాత్రలు సరికొత్త ఏవీఎస్‌ని చూపించాయి. ‘రంగుపడుద్ది’ అంటూ కామెడీ విలనిజంతో ప్రేక్షకుల్ని గిలిగింతలు పెట్టాడు ఏవీఎస్‌. నిజానికి ఆ గెటప్‌ పుట్టించింది ఏవీఎస్సేనట. ‘‘ఓసారి తిరుపతి వెళ్లి గుండు గీయించుకొని వచ్చా, నన్ను ఆ అవతారంలో చూసి ఎస్వీ కృష్ణారెడ్డి. ‘ఘటోత్కచుడు’లో ‘రంగుపడుద్ది’ మేనరిజంతో ఓ పాత్ర సృష్టించారు. అది కూడా మంచి పేరు తీసుకొచ్చింది’’ అంటుండేవారు. యక్ష ప్రశ్నలు వేసే ఏవీఎస్‌ ‘శుభలగ్నం’లో మరింత నవ్వించాడు. ఆ సినిమాతో టాప్‌ కమెడీయన్ల ఏవీఎస్‌కి చోటు ఖాయమైంది.

నిర్మాత
ప్రతీ హాస్యనటుడికీ ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించే పాత్ర ఒక్కటైనా చేయాలనిపిస్తుంది. ఏవీఎస్‌కి అలా అనిపించింది. ‘అంకుల్‌’ సినిమా తీశారు, చేశారు. ఆ సినిమాలో దాదాపు సగం సన్నివేశాలు ఏవీఎస్‌లోని ఉత్తమ ప్రతిభకు అద్దం పట్టాయి. ‘ఇన్నాళ్లూ మనల్ని నవ్వించింది ఈ ఏవీఎస్సేనా..?’ అనిపించేలా చేసింది. నటుడిగా ఆ సినిమా చాలా సంతృప్తినిచ్చింది. నంది అవార్డు దక్కింది. కానీ.. నిర్మాతగా మాత్రం నిజంగానే కన్నీళ్లు మిగిల్చింది. అప్పటి వరకూ నటుడిగా సంపాదించుకొన్న డబ్బులన్నీ ఈ సినిమాలో పెట్టారాయన. ‘‘ఇక్కడ సంపాదించిన డబ్బుతో రాజకీయాల్లోకి తరువాత వెళ్లలేను. రొయ్యల వ్యాపారం చేయలేను. నాకు తెలిసింది సినిమా ఒక్కటే. అందుకే సినిమా తీశా’’ అని ఆ రోజుల్లో చెప్పుకొన్నారు. ‘టాప్‌హీరో’ సినిమాలోనూ సెంటిమెంట్‌ కలబోసిన పాత్రలో కనిపించారు ఏవీఎస్‌. భావోద్వేగాలు పండించిన ప్రతీసారీ ‘ఓ..యస్‌..’ అనిపించాడు ఏవీఎస్‌.
దర్శకత్వం
కెప్టెన్‌ కుర్చీపై ముందు నుంచీ ఏవీఎస్‌కి మోజు లేదు గానీ, ఇక్కడికి వచ్చిన తరువాత అందులో ఒక్కసారి కూర్చోవాలనిపించింది. దాని ఫలితమే ‘సూపర్‌ హీరోస్‌’. రామానాయుడుతో ఏవీఎస్‌కి మంచి అనుబంధం ఉంది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ నిర్మించే ప్రతీ సినిమాలోనూ ఏవీఎస్‌కి ఓ పాత్ర దక్కేది. ఏవీఎస్‌ ప్రతిభను గమనించిన రామానాయుడు.. ఏవీఎస్‌పై నమ్మకంతో దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ‘సూపర్‌ హీరోస్‌’ సోసోగా ఆడింది. కానీ ఏవీఎస్‌కి తృప్తినివవలేదు. ‘దర్శకుడిగానూ ఓ విజయం నా ఖాతాలో ఉండాలి’ అనే తాపత్రయంతో ‘రూమ్‌మేట్స్‌’, ‘ఓని నీ ప్రేమ బంగారం కానూ’, ‘కోతి మూక’ సినిమాలు తీశారు. అయితే ఇందులో ఏవీఎస్‌ నుంచి ఆశించే కామెడీ లేకోపోవడంతో సరిగా ఆడలేదు. ‘‘దర్శకుడిగా నేను అనుకొన్నది తీశానంతే. కాకపోతే నా నుంచి వినోదాత్మక చిత్రాలు ఆశిస్తారనే విషయం ఆలస్యంగా తెలిసింది. ఈసారి 100 శాతం వినోదాలతో ఓ సినిమా తీయాలి..’’ అనేవారు ఏవీఎస్‌. హాస్యనటులందరితోనూ ఓ థ్రిల్లర్‌ సినిమా తీయాలి అనుకొన్నారు. దానికి సంబంధించి ఓ కథ కూడా సిద్ధం చేసుకొన్నారు. ‘‘హాస్యనటులంటే కామెడీనే చేయాలా? ఒక్కసారైనా భయపెడితే బాగుంటుంది కదా..? అందుకే పరిశ్రమలో ఉన్న హాస్యనటులందరినీ కలిపి ఓ థ్రిల్లర్‌ సినిమా చేస్తా’’ అనేవారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.