నాటకరంగ ప్రభాకరుడు... రాఘవ
తెలుగు నాటకరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన రంగస్థల, సినీ నటుడు బళ్ళారి రాఘవాచార్యులు. నాటకరంగం మహోజ్వలంగా వెలిగిపోతున్న రోజుల్లో రాఘవ బరంపురం నుంచి నెల్లూరు దాకా అనేక ప్రాంతాలు పర్యటించి ఆరోజుల్లో రంగస్థలంమీద పాతుకుపోయిన ప్రాచీన పద్ధతులకు స్వస్తి చెప్పి నాటక గతిని మార్చిన ప్రతిభాశాలి. రచయితలకు, నటులకు కొత్త పద్ధతులలో నాటకాల ప్రదర్శన ఆవశ్యకతను చెప్పి తదనుగుణంగా నాటకాలను రాయించి ప్రదర్శనలు నిర్వహింపజేసిన కళాకారుడు. ఆరోజుల్లో స్త్రీపాత్రలను మగవారే ధరించేవారు. స్త్రీ పాత్రలను మహిళలే పోషించాలని ఎలుగెత్తి చాటి చైతన్యవంతులను చేసిన ఘనత కూడా రాఘవదే. ప్రతి పట్టణంలో విశాలమైన రంగస్థల వేదికలను ఏర్పాటు చేయించి, ఒక పధ్ధతి ప్రకారం నాటకాలను ప్రదర్శించే అలవాటును ప్రవేశపెట్టిన ఘనుడాయన. రాఘవ కలలు సాకారమై ఎన్నో నాటక సమాజాలు వెలసిల్లి, నాటకమే జీవనోపాథిగా మసలిన సంఘటనలు కోకొల్లలు. ఈ నాటక ప్రదర్శనల ద్వారా ప్రజల మానసికోల్లాసానికి, చైతన్యానికి పాటుపడుతూ సమాజ శ్రేయస్సుకు దోహదకారిగా రాఘవ నిలిచారు. తన నటనా వైదుష్యంతో మహాత్మా గాంధి, విశ్వకవి రవీంద్రుడు, ప్రముఖ ఆంగ్ల రచయిత బెర్నార్డ్ షా వంటి మహనీయుల ప్రశంసలు చూరగొన్న మహానటుడు రాఘవ. ఆగస్టు 2న బళ్ళారి రాఘవ జయంతి సందర్భంగా కొన్ని విశేషాలు...

చదువుల్లో మేటి...
బళ్ళారి రాఘవ అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆగస్టు 2, 1880న జన్మించారు. రాఘవ అసలు పేరు తాడిపత్రి రాఘవాచార్యులు. తల్లిదండ్రులు శేషమ్మ, నరసింహాచార్యుల దంపతులకు లేకలేక కలిగిన సంతానం రాఘవ. రాఘవ తల్లిదండ్రులకు చాలాకాలం సంతు కలగక పోవడంతో బళ్ళారిలోని బసప్ప అనే ఆధ్యాత్మిక గురువు ఆశీస్సులు స్వీకరించారు. తదనంతర కాలంలో రాఘవ జన్మించడంతో అతనికి మొదట బసప్ప అనే నామకరణం చేశారు. అయితే వైష్ణవ సంప్రదాయానుసారం అతనికి రాఘవాచార్యులు అనే పేరును స్థిరపరచారు. రాఘవ తండ్రి పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేసేవారు. ఆంధ్ర నాటక పితామహుడుగా కీర్తినార్జించిన ధర్మవరం రామ కృష్ణమాచార్యులు రాఘవకు మేనమామ. రాఘవ విద్యాభ్యాసం తాడిపత్రిలో జరిగింది. తరవాత బళ్ళారి వార్డలా కళాశాలలో ఇంటర్మీడియట్, మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో రాఘవ బి.ఎ పూర్తిచేశారు. బళ్లారిలో కొంతకాలం పాఠశాల ఉపాధ్యాయ వృత్తిని చేబట్టారు. తరవాత ఇంజనీరింగ్ శాఖలో పనిచేస్తూ మద్రాసు వెళ్లి న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. బాల్యం నుంచే రాఘవకు నాటకాలమీద ఆసక్తి మెండు. మేనమామ ప్రోత్సాహం రాఘవకు ఎక్కువగా ఉండడంతో తన పన్నెండో ఏటనే నాటకలలో పాల్గొన్నారు.

గాంధి, రవీంద్రుల ఆశీస్సులు అందుకొని...
ఆర్ట్స్ విద్యార్థి కావడంతో షేక్ స్పియర్ నాటకాలను రాఘవ బాగా అధ్యయనం చేశారు. బళ్లారిలో వుండగా షేక్ స్పియర్ పేరిట ఒక క్లబ్ ను స్థాపించారు. తద్వారా షేక్ స్పియర్ కామెడీ, ట్రాజెడీ నాటకాలను ప్రదర్శించేవారు. మద్రాసులో కాలేజి లో చదువుకుంటున్నప్పుడు షేక్ స్పియర్ నాటకాలను ఎన్నోసార్లు ప్రదర్శించారు. నాటకాల్లో చురుగ్గా పాల్గొనేవారు. బెంగుళూరులో కె. శ్రీనివాసరావు నాటక సమాజం ప్రదర్శించే నాటకాల్లో ప్రధాన పాత్రధారి రాఘవే! హావ భావ ప్రకటనల్లో, సంభాషణలను వుచ్చరించడంలో రాఘవ అసమాన ప్రతిభ కనబరిచేవారు. తెలుగు, ఇంగ్లీషు, కన్నడ, హిందీ భాషల్లో రాఘవ ప్రదర్శనలు ఇచ్చేవారు. రాఘవకు బాగా పేరుతెచ్చిన తెలుగు నాటకాల్లో హరిశ్చంద్ర, సావిత్రి, పాదుకా పట్టాభిషేకం, రామరాజు చరిత్ర, బృహన్నల, రామదాసు ముఖ్యమైనవి. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, శ్రీలంక వంటి దేశాలు పర్యటించి అక్కడ భారతీయ సంప్రదాయ నాటక ప్రదర్శనలు ఇచ్చి, నాటక కళను గురించి ఎన్నో ఉపన్యాసాలు, సెమినార్లు, చర్చా వేదికలు నిర్వహించారు. అంతేకాదు ఇంగ్లాండ్ లో స్థానిక కళాకారులు లారెన్స్ ఆలివర్, చార్లెస్ లాటన్ ప్రభ్రుతులతో కలిసి నాటక ప్రదర్శనలు ఇచ్చారు. సాంఘిక నాటకాలలో ఒక విప్లవానికి తెరతీసినవారిలో బళ్ళారి రాఘవదే ప్రధమ తాంబూలం. కాకినాడ అన్నపూర్ణ, కొమ్మూరి పద్మావతి, కొప్పరపు సరోజినీ వంటి మహిళలను రాఘవ అద్భుత రంగస్థల నటీమణులుగా తీర్చిదిద్దారు. బసవరాజు అప్పారావు, బందా కనకలింగేశ్వరరావు, వాసుదేవరావు లు బళ్ళారి రాఘవ శిష్య పరంపరే! పద్యనాటకాల పరిధిని తగ్గించి సాంఘిక నాటకాల పరిధిని విస్తృత పరచి సామాజిక బాధ్యతలను యువతరానికి గుర్తు చేసే ప్రయత్నంలో రాఘవ సఫలమయ్యారు. 1919లో రవీంద్రనాథ్ టాగూర్ సమక్షంలో ‘ఫెస్టివల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్’ సందర్భంగా బెంగుళూరులో నాటక ప్రదర్శన ఇచ్చి విశ్వకవి ఆశీస్సులు చూరగొన్నారు. 1927లో మహాత్మా గాంధి బెంగుళూరు నంది హిల్స్ కు వేంచేసినప్పుడు ‘దీనబంధు కబీర్’ హిందీ నాటకాన్ని రాఘవ ప్రదర్శించారు. నాటకం చివరిదాకా గాంధిజీ ఉండిపోయినప్పుడు చక్రవర్తుల రాజగోపాలా చారి “మీ ప్రార్థనకు వేళయింది” అని గుర్తు చేయగా “ఇప్పుడు మనం ప్రార్థనలోనే వున్నాం కదా” అంటూ నాటకానంతరం రాఘవను అభినందించి ఆశీర్వదించారు.


జార్జి బెర్నార్డ్ షా తో...
1928లో ఇంగ్లాండు పర్యటన జరిపినప్పుడు ఆంగ్ల నటులతో కలిసి అనేక నాటకాలు ప్రదర్శించారు. ప్రఖ్యాత రచయిత జార్జి బెర్నార్డ్ షా తో అనేక నాటక విషయాలమీద విశ్లేషణలు, చర్చలు జరిపారు. రాఘవ ప్రతిభను గుర్తించిన బెర్నాడ్ షా “కళల గురించి తెలుసుకునేందుకు మీరు ఇక్కడకు వచ్చారా. మేమే మీ దేశంలో పర్యటించి మీ సంస్కృతీ, కళాభివృద్ధిని గురించి తెలుసుకోవాలి” అని వ్యాఖ్యానించారు. అంతేకాదు “మీరు మా దేశంలో పుట్టి వుంటే షేక్ స్పియర్ అంతటి గొప్పవారై వుండేవారు” అని కీర్తించారు. రాఘవ నటించిన ‘సునందిని’ నాటకంలో దుష్టబుద్ధి, ‘విజయనగర పతనం’ లో పఠాన్ రుస్తుమ్, ‘భారత యుద్ధం’ లో దుర్యోధనుడు, ’హరిశ్చంద్ర’లో హరిశ్చంద్రుడు, ‘రామదాసు’లో రామదాసు, ‘సారంగధర’లో సారంగధరుడు, ‘సావిత్రి’లో యముడు, ‘విరాటపర్వం’ లో కీచకుడు, ‘చిత్రనళీయము’లో నలమహారాజు, ‘ప్రతాపరుద్రీయము’లో ప్రతాపరుద్రుడు, ‘రాణా ప్రతాపసింహ’లో రక్తసింహుడు, ‘దుర్గాదాసు’లో దుర్గాదాసు, ’తప్పెవరిది’లో భీమసేనరావు పాత్రలు బళ్ళారి రాఘవకు బాగా పేరుతెచ్చిపెట్టాయి.

సినిమారంగంలో...
సహచర మిత్రుల ఒత్తిడి మీద 1935లో రాఘవ సినిమారంగ ప్రవేశం చేశారు. విజయవాడ కు చెందిన పారుపల్లి శేషయ్య, కురుకూరు సుబ్బారావు తెలుగు టాకీ నిర్మించే ఉద్దేశ్యంతో హెచ్.ఎం. రెడ్డిని కలిసి తమకు ఒక సినిమా నిర్మించి ఇవ్వమని ఆడిగారు. అప్పుడు తన అన్న కుమారుడు హెచ్.వి. బాబు దర్శకత్వంలో ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’ చిత్రాన్ని ఆయన నిర్మింపజేశారు. అందులో యడవల్లి సూర్యనారాయణ, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, నెల్లూరు నగరాజరావు, చొప్పల్లి సూర్యనారాయణ, వేమూరు గగ్గయ్య, కన్నాంబ, రామతిలకం వంటి మేటి రంగస్థల నటీనటులతో ఆ చిత్రం నిర్మించబడింది. మల్లాది అచ్యుతరామశాస్త్రి విరచించిన నాటకానికి మునువంటి వెంకటేశ్వరరావు సంగీతం సమకూర్చారు. అయితే ఈ సినిమాకు పోటీగా లక్ష్మి ఫిలిమ్స్, మద్రాసు సంస్థ ఎం. జగన్నాథస్వామి దర్శకత్వంలో దైతా గోపాలం చేత స్క్రిప్టు రాయించి ఇదే కథను ‘ద్రౌపదీ మానసంరక్షణము’ పేరుతో సినిమా నిర్మించి 1936 లో సమాంతరంగా విడుదల చేసింది. ఇందులో బళ్ళారి రాఘవ (దుర్యోధనుడు), బందా కనకలింగేశ్వరరావు(కృష్ణుడు), పారుపల్లి సుబ్బారావు (ధర్మరాజు), మంత్రవాది వెంకట శేషయ్య(భీష్ముడు), సురభి కమలాబాయి(ద్రౌపది) ప్రధానపాత్రలు పోషించారు. రాఘవ పాత్రను ప్రేక్షకులు మెచ్చుకున్నా ఈ చిత్రం మాత్రం ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’ ముందు నిలవలేకపోయింది. ఈ సినిమాలో పనిచేస్తున్నప్పుడే రాఘవతో గూడవల్లి రామబ్రహ్మానికి పరిచయం ఏర్పడింది. జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా రామబ్రహ్మం 1939లో ‘రైతుబిడ్డ’ చిత్రాన్ని నిర్మించారు. 1925లో ఆంధ్రరాష్ట్ర రైతు సంఘం తమ హక్కుల సాధనకు నడుం బిగించి ‘దున్నేవాడిదే భూమి’ నినాదంతో ముందుకు వెళ్ళిన నేపథ్యంలో ఈ సినిమాను నిర్మించారు. త్రిపురనేని గోపీచంద్ మాటలురాయగా, జమీన్ రైతు ఉద్యమంలో ‘జమీన్ రైతు’ సంపాదకుడు నెల్లూరు వెంకట్రామానాయుడు రాసిన పాటలను ఇందులో వాడుకున్నారు. ఇందులో బళ్ళారి రాఘవ, గిడుగు సీతాపతి, టంగుటూరి సూర్యకుమారి, భీమవరపు నరసింహారావు, నెల్లూరు నగరాజరావు, వంగర వెంకటసుబ్బయ్య, వేదాంతం రాఘవయ్య నటించారు. ఈ సినిమాకు జమీందార్ల నుండి వ్యతిరేకత ఎదురైంది. వారు ఈ సినిమాను ప్రభుత్వం చేత నిషేధింపజేశారు. అయితే ఈ చిత్రానికి పెట్టుబడిదారు జమీందారైన చల్లపల్లి రాజా కావడం విశేషం. నిషేధాన్ని ఎత్తివేశాక ఈ సినిమా విజయవంతంగా ఆడింది. 1940 లో మిర్జాపురం రాజా నిర్మించిన ‘చండిక’ సినిమాలో రాఘవ వీరమల్లు పాత్రలో నటించారు. కన్నాంబ చండికగా, వేమూరి గగ్గయ్య గిరిరాజుగా నటించిన ఈ చిత్రం కూడా విజయవంత మైంది. తరవాత ‘కన్యాశుల్కం’ లో గిరీశంగా రాఘవ నటించారు. ఎందుకో సినిమారంగంలో రాఘవ ఇమడలేకపోయారు. తను నమ్మిన సిద్ధాంతాలకు అనుకూలంగా న్యాయవాద వృత్తిని చేపట్టి, న్యాయంగా వున్న కేసులనే వాదించారు. తన సంపాదనంతా నాటకరంగ అభివృద్ధికే వినియోగించారు. రాఘవను రాజకీయాల్లోకి దించాలని సన్నిహితులు ప్రయత్నించినా రాఘవ దానివైపు కన్నెత్తి చూడలేదు. తన ఆధ్యాత్మిక గురువు తారానాధ్ ఆదేశాలమేరకు తుంగభద్రానది ఒడ్డున ఒక ఆశ్రమాన్ని నిర్మించి ఇచ్చారు. కష్టంలో ఉన్నవారికి స్నేహ హస్తం చాచి ఆర్ధిక సహాయం చేశారు. 1981లో భారత తంతి తపాలా శాఖ బళ్ళారి రాఘవ స్మారక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది.


ఇతర విశేషాలు...
రాఘవ స్ఫురద్రూపి. రంగస్థలం మీద కాలు మోపగానే ఆయనను ఆకట్టుకునేది రాఘవ నిండైన, అందమైన విగ్రహం. ఆయనది లలిత స్వభావం గల స్వరం. మాటలకు జతగా నటగాంభీర్యం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య. నాటకాల్లో పద్యాలు పాడడంలో కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారు. సంగీతానికి ప్రాధాన్యం తగ్గించి, భావ వ్యక్తీకరణకు అగ్రతాంబూలమిచ్చి పద్య పఠనం చేసేవారు. అయితే ఈ పద్ధతిని కొందరు మాత్రమే హర్షించారు. సునిశితమైన పాత్రల మనస్తత్వాలను సున్నితంగా, సరళంగా, సమగ్రంగా ప్రదర్శించడంలో రాఘవ సిద్దహస్తుడు. దుర్యోధన పాత్రను రాఘవ పోషించినప్పుడు ఏ హంగామా లేకుండా, హావభావాలతో తేలికతనం కనబరచి రాజఠీవి స్పష్టీకరిస్తూ అద్భుతంగా నటించేవారు. రామదాసు పాత్రకు ఒక ఆకృతి కల్పించి పండితుల ప్రశంసలు అందుకున్నారు. రాఘవ ప్రదర్శించే నాటకాలకు సినీ నటులు హాజరై ఆయన నటించే పద్ధతులను నిశితంగా గమనిస్తూ, తమ నటనా పటిమకు మెరుగులు పెట్టుకున్న సందర్భాలు ఎన్నో. నాటితరం నటులకు రాఘవ మార్గదర్శి. రాఘవ ఏప్రిల్ 16, 1944న అస్తమించారు.

ఆచారం షణ్ముఖాచారి 


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.