వెండితెర నేలనేలిన రాజనాల
జీవితం తల్లిలా లాలిస్తుంది. తండ్రిలా ఆదరిస్తుంది. గురువులా పాఠాలు చెపుతుంది. అందలాలు ఎక్కిస్తుంది. అంతలోనే పాతాళంలో పడతోస్తుంది. ఒక్కోసారి చెంప చెళ్లుమనిపిస్తుంది. సరిగ్గా అప్పుడే... మనిషిలోని తాత్వికుడు బయటకు వస్తాడు. ఓ చీకట్లోంచి మరో చీకట్లోకి పయనమే జీవితం అంటూ వేదాంతం చెప్తాడు... అచ్చం మన రాజనాలలా. ఔను... ఈ వేదాంతం చెప్పింది రాజనాలనే. ఆయన దృష్టిలో మొదటి చీకటి, తల్లి గర్భం. రెండో చీకటి, మృత్యు కుహరం. ఈ రెండు చీకట్ల నడుమ జీవితమంతా వెలుగు కోసం వెంపర్లాట.

‘నిప్పులు చిమ్ముతూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరే... నెత్తురు కక్కుకుంటూ నెలకు రాలిపోతే నిర్దాక్షిణంగా వీరే...’ అనే మహాకవి శ్రీశ్రీ కవితలోని పంక్తులు వెండితెర నేలిన రాజనాలకి సరిగ్గా సరిపోతాయి.

రాజనాల... ‘కింగ్‌ ఆఫ్‌ విలన్స్‌’గా పేరు తెచ్చుకున్నారు. నాలుగున్నర దశాబ్దాలు నటుడిగా తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరిచారు. అవకాశాలు అందిపుచ్చుకుని ఆకాశాలు ఈదారు. వెండితెర వైభవాన్ని సంపూర్ణంగా అనుభవించారు. అంతలోనే... విధి వక్రించి పాతాళాల అంచుల్లోకి జారిపోయారు.

చెన్నైలో విలక్షణ నటుడిగా విఖ్యాతి గాంచిన రాజనాల... హైదరాబాద్‌ లోని అమీర్‌ పేట సారధి స్టూడియో వెనుక వీధిలో సింగల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్‌ లోకి మారడంలో అంతులేని విషాదం దాగుంది. రంగుల లోకం వైభవమంతా నీటిబుడగలా పేలిపోయేసరికి... కఠోర వాస్తవం కళ్ళెదుట కన్నీటిసంద్రమై సాక్షాత్కరించింది.

‘ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు...’ అంటూ ప్రపంచం నాలుగు చెరగులా తిరిగినా ఫలితం కానరాక... చరమాంకంలో అంతులేని కష్టాల కడలిలో కృంగి కృశించి చివరికి... తిరిగి ఎన్నటికీ తిరిగిరాలేని దూరతీరాల్లోకి తరలిపోయిన రాజనాల... భౌతికంగా లేకున్నా... తెరపై ఆయన పండించిన పలురకాల పాత్రల్లో ఇప్పటికీ కళాకారుడిగా జీవించే ఉన్నారు. కళాభిమానులు ఆయన జయంతి, వర్ధంతి రోజుల్ని తలచుకుంటూ స్వర్ణయుగం వెండితెర నటుడిగా ఆయనకు అశ్రు నివాళులు అర్పిస్తున్నారు.

విలక్షణ విలనిజం

తెలుగు తెరపై విలనిజానికి కొత్త భాష్యం చెప్పిన నటులలో రాజనాల పేరు ముందు వరుసలో తప్పకుండా ఉంటుంది. అతి భయానకంగా కళ్ళెర్ర చేయడం... భీభత్సంగా వికట్టాట్టహాసం చేయడం... హీరోయిన్‌ని వెంటాడి వేధించడం... హీరోని క్లయిమాక్స్‌ వరకూ మొండిగా ఎదుర్కోవడం... రాజనాల మార్క్‌ విలనిజం. రాజనాల తెరపై కనిపిస్తే చాలు మహిళా ప్రేక్షకులు శాపనార్ధాలు పెట్టేవారంటే... ఆయా పాత్రల్లో ఆయన ఎంతలా జీవించాడో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. విలన్‌ పాత్రల్లో పెట్రేగిపోయిన రాజనాలని ‘దుష్ట నట చక్రవర్తి’ అంటూ అభినందించేవారు. నెల్లూరులో 1925 జనవరి 3 వైకుంఠ ఏకాదశి పర్వదినాన పుట్టిన రాజనాల అసలు పేరు... రాజనాల కాళేశ్వరరావు. చిన్నా పెద్దా అంతా ఆయన్ని అభిమానంగా కాళయ్య అని పిలిచేవారు.


1953 నుంచి 1978 వరకు రాజనాల నట జీవితంలో స్వర్ణయుగంగా చెప్పొచ్చు. హీరో ఎన్టీఆర్‌ అయినా, కాంతారావు అయినా విలన్‌ మాత్రం రాజనాలే. జానపద చిత్రాల్లో రాజనాల విలనిజాన్ని విజృంభించేలా చేశారు. 1952లో రాజమార్గం చిత్రం ద్వారా తెరపరిచితమైన రాజనాల ... 1953లో ప్రతిజ్ఞ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో మెప్పించారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకుని తారాజువ్వలా నింగివైపు దూసుకువెళ్లారు. సాంఘికాలు, జానపదాలు, పౌరాణికాలు... ఇలా అన్ని రకాల చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు. జయసింహ, తెనాలి రామకృష్ణ, సువర్ణ సుందరి, కుటుంబ గౌరవం, వినాయక చవితి, రాజమకుటం, శ్రీ వెంకటేశ్వర మహత్యం, సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి, ఉషా పరిణయం జగదేకవీరుని కథ, సిరిసంపదలు, గులేబకావలి కథ, చిట్టి తమ్ముడు, దక్ష యజ్ఞం...ఇలా అనేకానేక చిత్రాల్లో నటించారు. గుండమ్మ కథ, పరువు ప్రతిష్ట, నర్తన శాల, రాముడు భీముడు, దేవత, బొబ్బిలి యుద్ధం, సిఐడి, శ్రీ సింహాచల క్షేత్ర మహిమ, సత్య హరిచంద్ర, శ్రీ కృష్ణ పాండవీయం, పల్నాటి యుద్ధం, శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న, శ్రీ కృష్ణావతారం...ఇలా చెప్పుకుంటూ పోతే అప్పట్లో రాజనాల లేని సినిమాలు లేవంటే అతిశయోక్తి కాదు. ఎన్టీఆర్‌, కాంతారావు చిత్రాల్లో రాజనాల తప్పనిసరిగా నటించేవారు. వాళ్ళ కాంబినేషన్‌ ప్రేక్షక జనాలకు ఎంతో ప్రీతిపాత్రం.
హాలీవుడ్‌లో మెరిసిన మొదటి తెలుగు నటుడు

హాలీవుడ్లో మెరిసిన మొదటి తెలుగు నటుడిగా రాజనాల పేరు చరిత్రకెక్కింది. 1966లో ‘మాయాది మాగ్నిఫిషన్‌’ అనే చిత్రంలో రాజనాల నడిచి అప్పట్లో సరికొత్త రికార్డు సృష్టించారు.

నట జీవితం ఆద్యంతం ఆసక్తిదాయకం


కావలిలో ప్రాధమిక విద్యనభ్యసించిన రాజనాల 5వ తరగతిలో ఉండగా జబ్బున పడ్డారు. జబ్బు నయం అయినా స్కూలుకు వెళ్లకుండా ఇంటివద్దనే చదువుకుని 8వ తరగతిలో మళ్లీ స్కూల్లో చేరారు. స్కూల్‌ ఫైనల్‌ అయినా తర్వాత ఇంటర్మీడియట్‌ చదువుతూ మధ్యలో ఆపేసిన రాజనాల సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలకు హాజరై 1944లో రెవిన్యూ శాఖలో గుమస్తాగా చేరారు. ఓ పక్క ఉద్యోగ బాధ్యతలు నెరవేరుస్తూనే... నాటకాల పట్ల ఉండే ఆసక్తితో రంగస్థలంపై తరచూ నాటకాలు వేస్తుండేవారు. అలా నాటకాలు వేస్తున్న తరుణంలో ఆయన సహచర నటుడు లక్ష్మీ కుమార్‌ రెడ్డితో మంచి స్నేహం ఏర్పడింది. నేషనల్‌ ఆర్ట్స్‌ థియేటర్‌ పేరుతో సంస్థను స్థాపించిన ఈ ఇద్దరు అప్పట్లో ఆత్రేయ రాసిన నాటకాలను రంగస్థలంపై వేయడం రివాజు. రాజనాల, లక్ష్మీ కుమార్‌ రెడ్డి కలసి అలా ఆత్రేయ నాటకం ‘ఎవరు దొంగ’ వేస్తూ ఉండేవాళ్లు. అలా ఓసారి ఈ నాటకాన్ని చూసేందుకు వచ్చిన కలెక్టర్‌ ఆ నాటకంలో రాజనాల ప్రభుత్వంపై పదునైన డైలాగులు చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ తర్వాత మరోసారి ప్రగతి అనే నాటకాన్ని కూడా చూసిన కలెక్టర్‌ రాజనాలను 3 నెలలు సస్పెండ్‌ చేసారు. ఈ లోపున రాజనాల స్నేహితుడు లక్ష్మీ కుమార్‌ రెడ్డి చెన్నయ్‌ వెళ్లి అక్కడ హెచ్‌. ఎం. రెడ్డ్డి సినిమాల ఆఫీసులో చేరారు. అంతకు ముందు నిర్దోషి సినిమాని తీసిన హెచ్‌.ఎం.రెడ్డ్డి ఈసారి కొత్తవాళ్లతో ప్రతిజ్ఞ అనే సినిమా తీయాలని సంకల్పించడం... అక్కడే ఉన్న లక్ష్మీ కుమార్‌ రెడ్డి ద్వారా సమాచారం తెలుసుకున్న రాజనాల కూడా ప్రయత్నించి ఆ సినిమాలో విలన్‌ పాత్ర వేయడం ...ఆయన జీవితంలో ఓ మలుపు. ఈ సినిమాలో తాను హీరోగా వేస్తానని రాజనాల పట్టు పట్టారు. అయితే, కాంతారావుని హీరోగా తీసుకుని రాజనాలని విలన్‌ పాత్రకి ఒప్పించారు. 1953 నుంచి 1966 వరకు 150 చిత్రాలు వరుసగా చేసి అప్పట్లో రికార్డు సృష్టించారు.

ఎన్టీఆర్‌తో సాన్నిహిత్యం
                             

‘వద్దంటే డబ్బు’ చిత్రంలో వయసుకి మించిన వృద్ధుడి పాత్రలో కూడా రాజనాల మెప్పించారు. ఆ సినిమాలో ఎన్టీఆర్‌ కథానాయకుడు. ఎన్టీఆర్‌కి మామ పాత్రలో రాజనాల వేయడంతో అప్పటి నుంచి ఎన్టీఆర్‌ ఆయన్ని మామాజీ అని పిలవడం అలవాటు చేసుకున్నారు. 1958లో ‘రామాంజనేయ యుద్ధం’ చిత్రంలో రాజనాల హనుమంతుడి పాత్ర వేసి మొప్పు పొందారు. అప్పటి నుంచి ఆయన హనుమాన్‌ భక్తుడిగా మారారు. కాంతారావుతో కలసి బెనిఫిట్‌ షోలు ప్రదర్శించేవారు. అలాగే...ఎన్టీఆర్‌ తో కలసి పోలీస్‌ సంక్షేమ నిధి, దేశ రక్షణ నిధిలాంటి కార్యక్రమాల్లో రాజనాల పాల్గొనేవారు.

వ్యక్తిగత జీవితం దుర్భరం
రాజనాల వ్యక్తిగత జీవితం దుర్భరంగా సాగింది. ప్రేమించి పెళ్లాడిన భార్య 1969లో చనిపోవడం ఆయన్ని ఎంతగానో కలచివేసింది. 1984లో పెద్ద కొడుకు కులవర్ధన్‌ చనిపోయారు. చిన్న కొడుకు అదృశ్యమైపోయాడు. చేతికి ఎముక లేకుండా దానధర్మాలు చేసిన రాజనాల చరమాంకంలో ఆర్ధిక ఇబ్బందుల్లో మునిగిపోయారు. చెన్నైలో వెండితెర వైభవాన్ని అనుభవించిన ఆయన...తన రెండో భార్య భూదేవి తోడుగా హైదరాబాద్‌ వచ్చి అమీర్‌పేటలోని సారధి స్టూడియో వెనుక రూబీ అపార్టుమెంట్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో సింగిల్‌ బెడ్‌ రూంలో తలదాచుకున్నారు. ఆనాటి వైభవ చిహ్నాలైన కార్లు, బంగళాలు అన్నిటినీ కోల్పోవడమే కాకుండా షుగర్‌ వ్యాధితో ఓ కాలును కూడా పోగొట్టుకుని జీవితంపై ఆశలు వదులుకున్నారు. హైదరాబాద్‌ వచ్చిన తర్వాత చిన్న, చితక వేషాలు వేస్తూ కాలక్షేపం చేసేవారు. షూటింగులకు రెండో భార్య భూదేవి తోడుగా వచ్చేది. రాజనాల, నాగభూషణం ఇద్దరినీ తీసుకుని దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి ‘నంబర్‌ వû’ËÂ చిత్రంలో అవకాశం ఇచ్చి గౌరవించారు. ‘తెలుగు వీర లేవరా’ చిత్రం కోసం అరకు లోయ వెళ్లన రాజనాలకి అక్కడ కాలికి గాయం అయింది. షుగర్‌ కూడా తోడవడంతో ఓ కాలు తీసి వేయాల్సి వచ్చింది. జీవితంలో ‘భీమాంజనేయం’ పేరుతో సొంతంగా ఓ సినిమా తీయాలనే కోరిక కూడా ఆయన తీర్చుకోలేకపోయారు. చివరికి అన్ని బాధల నుంచి విముక్తిగా 1998 మే 21న తనువు చాలించారు.

ఆయన మనమధ్య లేకపోయినా...
ఆయన నటించిన చిత్రాలు చిరస్థాయిగా రసజ్ఞులను అలరిషునే ఉంటాయి.

జీవిత వివరాలు
పేరు: రాజనాల కాళేశ్వరరావు నాయుడు
జననం: 3 జనవరి 1925
తల్లి: సుబ్బమ్మ, తండ్రి: వెంకట నారాయణయ్య
సోదరులు ఐదుగురు, సోదరీమణులు నలుగురు

- పీవిడీఎస్‌ ప్రకాష్‌


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.