నటనకు భాష్యం శంకర శాస్త్రీయం
శంకరాభరణం’ పూర్ణోదయా ఆర్ట్‌ క్రియేషన్స్‌ తెలుగు తెరపై అత్యద్భుతంగా ఆవిష్కరించిన కర్ణాటక సంగీత దృశ్య కావ్యం. కళాతపస్విగా కీర్తినార్జించిన కె.విశ్వనాధ్‌ దర్శకత్వ ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. అంతేనా! శాస్త్రీయ సంగీతానికి నిలువెత్తు రూపమా... మనదైన సంప్రదాయానికి, సంస్కృతికీ ప్రాణమొచ్చి మన మధ్యనే తిరుగుతోందా? అన్నట్లు లేటు వయసులో కథానాయకుడిగా అవతరించి తన నటనతో మంత్ర ముగ్ధుల్ని చేసిన మహత్తర కళాకారుడు జె.వి.సోమయాజులు ప్రతిష్ఠని దిగంతాలకు వ్యాపింపచేసిన చిత్రం కూడా ‘శంకరాభరణమే’. ఈ చిత్రం తరువాత సోమయాజులు కాస్త శంకర శాస్త్రిగా విశేష ప్రాచుర్యం పొందారు. ఎక్కడికి వెళ్లినా...ఆయన అసలు పేరుకన్నా మిన్నగా శంకరశాస్త్రిగానే పిలచి ప్రేక్షకులు పరమానందభరితులయ్యేవారు. ఈ చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. విడుదల రోజున అంతంత మాత్రంగా ఉన్న వీక్షకాదరణ రోజులు గడుస్తున్నా కొద్దీ ఇంతింతయి...అన్నట్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎనలేని ప్రభావం చూపించింది.


అలాంటి ఓ చిత్రంలో నటిస్తే చాలు...నటుడిగా పరిపూర్ణత సాధించినట్లు. ఆ పరిపూర్ణతను సాధించిన జె.వి. సోమయాజులు అక్కడితో ఆగలేదు. విశ్వనాధ్‌ ప్రతిష్టాత్మకంగా తీసిన కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూనే... సుమారు 150 చిత్రాలకు పైగా నటించారు. అలా ఎన్ని సినిమాలు చేసినా...సోమయాజులు అంటే తెలుగు ప్రేక్షకులకు మాత్రం శంకర శాస్త్రి మాత్రమే. లెక్కలేనన్ని అవార్డులు అందుకున్న ఈ సినిమా సోమయాజులు నట జీవితాన్నే మార్చింది. ఫోర్బ్స్‌ భారతీయ సినిమారంగంలో గొప్ప అభినయాన్ని ప్రదర్శించిన పాతిక మంది నటుల జాబితాలో ‘శంకరాభరణం’లో నటనకుగాను జె.వి.సోమయాజులు చోటు దక్కించుకున్నారు.

* ‘కన్యాశుల్కం’తో మొదలు
మహాకవి గురజాడ అప్పారావు రచించిన ‘కన్యాశుల్కం’ నాటకం... కన్యాశుల్కం జాడ్యం పోయిన ఇన్నేళ్లకి, ఇప్పటికీ సజీవంగానే ఉంది. రసజ్ఞులైన ప్రేక్షకులను, అభిరుచిగల నాటక సమాజాలను, నటీనటులను ఆకర్షిస్తూనే ఉంది. జె.వి. సోమయాజులు కూడా కన్యాశుల్కం నాటకాన్ని తన సోదరుడు జె.వి.రమణమూర్తితో కలసి సుమారు 500కి పైగా రంగస్థల ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు పొందారు. కన్యాశుల్కం నాటకంలో రామప్ప పంతులుగా గంభీరమైన గొంతుతో జె.వి. సోమయాజులు నటించి రక్తి కట్టిస్తుంటే... కళ్లప్పగించి అప్పటి ప్రేక్షకులు అలా చూస్తుండిపోయారట. అనేక బహుమతులు అందుకున్నారు. పురస్కారాలు స్వీకరించారు. చిన్నతనం నుంచి నాటకాలంటే మక్కువ ఎక్కువయిన సోమయాజులు ఒక్క కన్యాశుల్కం నాటకంతోనే సరిపెట్టుకోలేదు. మనిషిలో మనిషి, నాటకం, పంజరం, గాలివాన, కప్పలు లాంటి నాటకాల్లో ప్రధాన పాత్రలు పోషించి ప్రతిభ చాటుకున్నారు.


* కుటుంబ నేపథ్యం
జె.వి.సోమయాజులు ఆంధ్రప్రదేశ్‌ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం లుకాలంలో (జూన్‌ 30, 1928) జన్మించారు. తండ్రి వెంకట శివరావు, తల్లి శారదాంబ. సోదరుడు జె.వి. రమణమూర్తి కూడా నటుడిగా చిత్రపరిశ్రమకు సుపరిచితుడే. రెవెన్యూ శాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ డిప్యూటీ కలెక్టర్‌ స్థాయికి ఎదిగారు. మొదట నాటకాల్లో ప్రతిభ కనబరిచిన సోమయాజులుకి చలన చిత్ర పరిశ్రమ నుంచి ఆహ్వానం వచ్చింది. చంద్రమోహన్, మాధవి జంటగా నటించిన ‘రా రా కృష్ణయ్య’ చిత్రంలో ఓ పాత్రలో వేసిన సోమయాజులు సినీ ప్రముఖుల దృష్టిలో పడ్డారు. విశ్వనాధ్‌ చిత్రాల ద్వారా లబ్ధ ప్రతిస్థులయ్యారు. మరీ ముఖ్యంగా శంకరాభరణం చిత్రం ఆయన కెరీర్‌ లో కీర్తి కేతనం. సప్తపది, వంశ వృక్షం, త్యాగయ్య, నెలవంక, సితార, శ్రీ రాఘవేంద్ర, స్వాతిముత్యం, దేవాలయం, విజేత, తాండ్రపాపారాయుడు, శ్రీ షిరిడీ సాయిబాబా మహాత్మ్యం, కల్యాణ తాంబూలము, ఆలాపన, మగధీరుడు, కలియుగ పాండవులు, సంకీర్తన, మజ్నూ, చక్రవర్తి, స్వయంకృషి లాంటి చిత్రాల్లో ప్రతిభ కనబరిచారు. స్వరకల్పన, అన్న తమ్ముడు, అప్పుల అప్పారావు, ఆదిత్య 360, రౌడీ అల్లుడు, అల్లరి మొగుడు, సోపానం, ముఠా మేస్త్రీ, గోవిందా గోవిందా, సరిగమలు, కబీరుదాస్‌ తదితర చిత్రాల్లో నటించారు. తెలుగులోనే కాకుండా కన్నడ, హిందీ భాషా చిత్రాల్లో కూడా ఆయన నటించి మెప్పించారు. అలాంటి తెలుగుతెర మకుటం ఏప్రిల్‌ 24, 2004న ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు.


- పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.