రాళ్ళపల్లి కేరాఫ్‌ సినీ కళామతల్లి
నటన అంటే ఆయనకు ప్రాణం. అభినయం అంటే అమిత ఇష్టం. రంగస్థలమైనా... వెండితెర అయినా తనదాకా వచ్చిన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులతో వావ్‌...అనిపించుకునే సత్తాగల నటుడు ఆయన. తన ఇంటి పేరుతోనే లబ్ధ ప్రతిష్టులైన ఆయన ఎవరో కాదు... రాళ్ళపల్లి. దశాబ్దాల తరబడి తెలుగు సినీ ప్రేక్షకులను తన నటనతో మంత్రముగ్దుల్ని చేశారు. తెలుగు కళామతల్లి ఎప్పటికీ మర్చిపోలేని ఆయన జయంతి ఆగష్టు 15.


* అనంతపురం నుంచి మంత్రనగరి వరకూ
రాళ్ళపల్లి అసలు పేరు రాళ్ళపల్లి వెంకట నరసింహరావు. ఆగస్టు 15, 1945లో అనంతపురంలో జన్మించారు. సినిమాల్లోకి రాక ముందు రంగస్థలంపై నాటకాలు వేసేవారు. బీ.కామ్‌ చదివిన ఆయన ఎనిమిది వేలకు మించి నాటక ప్రదర్శనలు ఇచ్చారు. రైల్వేలో రాళ్లపల్లికి ప్యూన్‌ ఉద్యోగం వచ్చినా సినిమాలపై అమిత ప్రేమతో చెన్నయ్‌ చేరుకున్నారు..


* నాటక రచయితగా కూడా
కాలేజీలో చదువుకునేటప్పుడు రాళ్లపల్లి ‘మారని సంసారం’ అనే నాటిక రాశారు. ఆశ్చర్యంగా ఈ నాటికకు నటన, రచన... రెండు విభాగాలకూ ఈయనకు పురస్కారాలు వచ్చాయి. ఈ పురస్కారాలను అలనాటి మేటి నటి, బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి ద్వారా రాళ్ళపల్లి అందుకున్నారు. నాటకాలంటే రాళ్ళపల్లికి బోలెడంత ఉత్సాహం, ఉల్లాసం వచ్చేవి. అందుకే, రిహార్సల్స్‌ ఎప్పుడూ టైంకి కరెక్ట్‌గా మొదలుపెట్టేసేవారట. ఈ నాటకాల ఖర్చు కూడా ఈయనే భరించేవారట. ఈ ఖర్చు కోసం రాళ్లపల్లి అప్పులు కూడా చేసేవారట. చేసిన అప్పులపై ‘ముగింపు లేని కథ’ అన్న నాటకం రాసి వంద సార్లకు పైగా ఆ నాటకాన్ని ప్రదర్శించారట. ఒకసారి, ఒక సినిమా రూపుదిద్దుకోబోతున్నట్లు పేపర్లో పడిన ప్రకటన రాళ్లపల్లి భార్య చూశారట. నటనపై రాళ్లపల్లికి ఉన్న మక్కువ ఆవిడకు బాగా తెలుసు. దాంతో, ఆ సినిమాకు దరఖాస్తు చేయమని చెప్పారట. ఆ సినిమాకు దరఖాస్తుని చేసిన రాళ్లపల్లి ‘స్త్రీ’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు.


* వంటచేయడమంటే ఇష్టం
రాళ్లపల్లికి నటనంటే ఎంత ఇష్టమో వంట చేయడం కూడా అంతే ఇష్టం. సినిమా ప్రముఖులు ఈయన చేతి వంట తిన్నారు. ‘శుభసంకల్పం’ సినిమా చిత్రీకరణ సమయంలో రాళ్ళపల్లి వంట బాగా చేస్తారని తెలుసుకొని, ఆ చిత్ర దర్శకుడు కె.విశ్వనాధ్‌ ఆయన చేత వండించుకున్నారట. అప్పటికప్పుడు ములక్కాడ సాంబారు, గుత్తివంకాయ కూరని చేశారట రాళ్ళపల్లి. కమల్‌ హాసన్, విశ్వనాధ్‌ ఆ భోజనాన్ని సంతృప్తిగా తిన్నారట. రాళ్ళపల్లి చేతి వంట ఎంతో అద్భుతంగా ఉందని, అందుకే షూటింగ్‌కి గంట సేపు విరామం కావాలని విశ్వనాధ్‌ని కోరారట కమల్‌. ఆ సాయంకాలం రాళ్ళపల్లి దగ్గరికెళ్ళిన కమల్, మీరెప్పుడైనా సినిమాల నుంచి విరామం తీసుకుంటే, మద్రాస్‌కి వచ్చి నాకు వంట చేసి పెట్టండని కోరారట. కమల్‌ అన్న ఈ మాటకు మరో వంట అవకాశం దొరికిందని రాళ్లపల్లి సంతోషించారట.


* విభిన్నమైన పాత్రలు...
పాత్ర చిన్నదైన, పెద్దదైన రాళ్లపల్లి ఆ పాత్రల్లో జీవించేసేవారు. ‘నాగమల్లి’ చిత్రం హాస్యనటుడిగా రాళ్లపల్లికి గుర్తింపును తెస్తే, ‘సీతాకోకచిలుక’ సినిమా ద్వారా మంచి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నారు. వంశీ దర్శకత్వం వహించిన ‘అన్వేషణ‘, ‘సితార‘, ‘స్వర కల్పన’, ‘ఏప్రిల్‌ ఫస్ట్‌ విడుదల’, ‘శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్‌ డ్యాన్స్‌ ట్రూప్‌’, ‘లేడీస్‌ టైలర్‌’ వంటి ఎన్నో సినిమాలలో నటించారు. నిజానికి వంశీ సినిమా అంటే రాళ్లపల్లి తప్పక ఉండే నటుడు అనే అంత గుర్తింపు వచ్చింది రాళ్ళపల్లికి. జంధ్యాల దర్శకత్వం వహించిన చిత్రాల్లో కూడా ఎక్కువ నటించారు.* పురస్కారాలు...
రాళ్ళపల్లి నటనకు ప్రశంసలే కాదు, పురస్కారాలు కూడా దక్కాయి. ఉత్తమ నటుడిగా, ఉత్తమ మేల్‌ కమెడియన్‌గా నంది అవార్డులు దక్కించుకున్నారు ఈయన. బుల్లితెరపై కూడా తన నట విశ్వరూపం చూపించి నంది అవార్డులు తెచ్చేసుకున్నారు. ‘గణపతి’ ధారావాహికలో ఓ పాత్రకు ఉత్తమ సహాయనటుడిగా, ‘జననీ జన్మభూమి’ టెలీఫిలింకి అవార్డు దక్కింది.

* కూతురి మరణం....
రాళ్లపల్లికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తె చనిపోయారు. కూతురు మరణ వార్త విని తట్టుకోలేకపోయిన రాళ్లపల్లి తన బాధను ఎవరితో పంచుకోవడానికి ఇష్టపడలేదు. అందుకు కారణం, ఇతని వ్యక్తిత్వమే. బాధని దాచుకోవాలి, ఆనందాన్ని పంచిపెట్టాలన్న స్వభావం రాళ్లపల్లిది. అందుకే, ఇతరులతో వ్యక్తిగత సమస్యలను చెప్పుకోవడం రాళ్లపల్లికి నచ్చదట.


* రాళ్ళపల్లి మరణం...
న్యాచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన ‘భలే భలే మగాడివోయ్‌’ అనే సినిమా ఈ విలక్షణ నటుడి చివరి సినిమా. శ్వాసకోస సమస్యలకు హైదరాబాద్‌లో మ్యాక్స్‌ క్యూర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మే 17, 2019న తుదిశ్వాస విడిచారు రాళ్లపల్లి. ప్రస్తుతం ఆయన మనమధ్య లేకపోయినా...ఆయన మిగిల్చిన తీపి గుర్తులుగా ఆయన నటించిన సినిమాలు ఎప్పటికీ ఆహ్లాదపరుస్తుంటాయి.

- పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.