సృజనాత్మక దర్శకుడు

తొలి చిత్రంతోనే తన ప్రత్యేతకని చాటుకొన్న దర్శకుడు సుకుమార్‌. పూర్వాశ్రమంలో లెక్కల మాస్టర్‌ అయిన సుకుమార్‌ తెరకెక్కించే చిత్రాల్లో కూడా ఆ ప్రభావం కనిపిస్తూనే ఉంటుంది. పజిల్‌ని తలపిస్తూ సాగే కథ, కథనాలు ప్రేక్షకులకు తీయటి అనుభూతిని పంచుతుంటాయి. అయితే అలాంటి చిక్కుముడులేవీ లేకుండానూ తాను సినిమాలు తీయగలనని ‘రంగస్థలం’తో నిరూపించారాయన. సృజనాత్మక దర్శకుడిగా పేరు తెచ్చుకొన్నారు. తీసింది తక్కువ సినిమాలే అయినా... ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ అగ్ర దర్శకుడిగా కొనసాగుతున్నారు సుకుమార్‌. ఆయన తూర్పు గోదావరి జిల్లా, రాజోలుకి సమీపంలోని మట్టపాడులో తిరుపతిరావు నాయుడు, వీరవేణి దంపతులకి 1970 జనవరి 11న జన్మించారు. చిన్నప్పట్నుంచే పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకున్న ఆయన ఊళ్లో ఉన్న గ్రంథాలయంలోని పుస్తకాలన్నింటినీ చదివేశారు. పాఠశాలలోనే కవితలు రాయడం అలవాటు చేసుకొన్నారు. గణితంపై పట్టు పెంచుకొన్న ఆయన చదువుకొంటూనే రాజోలులో ట్యూషన్లు చెప్పేవారు. కాకినాడలో ఓ పెద్ద కళాశాలలో అధ్యాపకుడిగా ఉద్యోగం పొందిన ఆయన ఆ తర్వాత సినిమాలపై మక్కువతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మొదట్లో ఎడిటర్‌ మోహన్‌ దగ్గర శిష్యరికం చేసిన ఆయన 2004లో ‘ఆర్య’తో దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని అందుకొన్న ఆయన ఆ తర్వాత రామ్‌తో ‘జగడం’ చేశారు. ఆ చిత్రం పరాజయాన్ని చవిచూసినా సుకుమార్‌కి దర్శకుడిగా మంచి పేరే వచ్చింది. ‘ఆర్య2’తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన సుకుమార్‌ ‘100%లవ్‌’తో ఘన విజయాన్ని సొంతం చేసుకొన్నారు. మహేష్‌బాబుతో ‘1 నేనొక్కడినే’ తీసే అవకాశాన్ని అందుకొన్నారు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ చిత్రం పరాజయాన్ని చవిచూసింది. ‘నాన్నకు ప్రేమతో’, ‘రంగస్థలం’ చిత్రాలతో వరుస విజయాలు అందుకొన్న సుకుమార్, ప్రస్తుతం మహేష్‌బాబుతో సినిమా కోసం కథని సిద్ధం చేస్తున్నారు. సుకుమార్‌ నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. సుకుమార్‌ రైటింగ్స్‌ పేరుతో నిర్మాణ సంస్థని ప్రారంభించిన ఆయన అందులోనే తన స్నేహితులతో కలిసి ‘కుమారి 21 ఎఫ్‌’, ‘దర్శకుడు’ చిత్రాల్ని నిర్మించారు. సుకుమార్‌కి భార్య తబితతోపాటు, అమ్మాయి సుకృతివేణి, అబ్బాయి సుక్రాంత్‌ ఉన్నారు. ఈ రోజు సుకుమార్‌ పుట్టినరోజు.

© Sitara 2018.
Powered by WinRace Technologies.