రివ్యూ: జడ్జిమెంటల్‌ హై క్యా
నటీనటులు: కంగనా రనౌత్‌, రాజ్‌కుమార్‌ రావు, జిమ్మీ షేర్గిల్‌, అమైరా దస్తూర్‌ తదితరులు.
సంగీతం: తనిష్క్‌ బాగ్చి,
సినిమాటోగ్రాఫీ: పంకజ్‌ కుమార్‌,
కూర్పు: నితిన్‌ బైద్‌,
నిర్మాణ సంస్థ: బాలాజీ మోషన్‌ పిక్చర్స్‌, ఏఎల్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్‌,
స్క్రీన్‌ప్లే: కనికా ధిల్లన్‌,
కథ, దర్శకత్వం: ప్రకాశ్‌ కోవెలమూడి,
 విడుదల తేదీ:  జులై 26, 2019.

‘మణికర్ణిక’ చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో ఒదిగిపోయి నటించిన కంగన.. ఒక్కసారిగా ‘జడ్జిమెంటల్‌ హై క్యా’ చిత్రంతో తన వేషాన్ని మార్చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్‌ కోవెలమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజ్‌కుమార్‌ రావు కథానాయకుడిగా నటించారు. పోస్టర్లతోనే సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. మరి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.


* కథేంటంటే..
బాబీ (కంగన) సినిమా డబ్బింగ్‌ కళాకారిణి. బాల్యంలో జరిగిన ఓ ఘటన కారణంగా ఎక్యూట్‌ సైకోసిస్‌ అనే మానసిక వ్యాధితో బాధపడుతుంటుంది. దాని వల్ల తను డబ్బింగ్‌ చెప్పే పాత్రల్లో తననే ఊహించుకుంటుంది. వాటిలాగే చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటుంది. దీనికి తోడు ఆ పాత్రల్లోని నటీమణుల్లాగే దుస్తులు వేసుకుని ఫొటోలు దిగి తన ఇంట్లో అతికించుకుంటుంది. ఇలా ఉండగా ఆమె ఉన్న ఇంట్లోకి ప్రేమ జంట కేశవ్‌ (రాజ్‌కుమార్‌ రావ్‌), రీమా(అమైరా దస్తూర్‌) అద్దెకు దిగుతారు. కేశవ్‌ పట్ల బాబీ ఆకర్షితురాలవుతుంది. అయితే ఒకరోజు రీమా హత్యకు గురవుతుంది. కేశవే ఆమెను చంపాడని బాబీ బలంగా నమ్ముతుంది. పోలీస్‌ విచారణలో అదే విషయాన్ని చెబుతుంది. మరి కేశవ్‌ నిజంగానే హంతకుడా? లేక బాబీ అలా ఊహించుకుంటోందా? లేక బాబీనే కేశవ్‌ కోసం రీమాను చంపిందా? లేక తన మానసిక స్థితి వల్ల తెలీకుండానే రీమాను చంపిందా? తదితర విషయాలు తెలీయాలంటే సినిమా చూడాల్సిందే.


* ఎలా ఉందంటే..
ఇది ట్విస్ట్‌లతో కూడుకున్న డార్క్‌ కామెడీ డ్రామా. ఈ సినిమాకు కంగనా రనౌత్‌ను ఎంపికచేసుకోవడమే కరెక్ట్‌. ఎందుకంటే కంగన యాటిట్యూడ్‌కి ఇందులోని తన పాత్రకు కాస్త దగ్గరి పోలికలు ఉంటాయి. ఇక పాత్రలను ఊహించుకుంటూ ప్రవర్తించడం అనేది సినిమాలో కొత్త పాయింట్‌. దానికి మర్డర్‌ మిస్టరీని జోడించడంతో సినిమా మరింత రక్తి కట్టించింది. కంగనకు మంచి హాస్య చతురత ఉంది. దాంతో సినిమాలో ఆమె వేషధారణ, పోలీసులతో ప్రవర్తించే తీరు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ప్రతి సన్నివేశానికి ఓ నేపథ్య సంగీతాన్ని జోడించడంతో ప్రేక్షకుడు మరింత థ్రిల్‌కు గురవుతాడు. ప్రథమార్ధంలో కంగన, కేశవ్‌ల జీవితాల గురించి చూపించారు. ద్వితీయార్ధంలో అసలు కథ మొదలవుతుంది. కానీ ప్రతీ సీన్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టడానికి ద్వితీయార్ధాన్ని బాగా సాగదీశారు. ఇంతా చేసి క్లైమాక్స్‌ ట్విస్ట్‌ త్వరగా చూపించేశారు.


* ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాకు కంగన, రాజ్‌కుమార్‌ రావు పర్‌ఫెక్ట్‌ అని చెప్పొచ్చు. ఇద్దరికిద్దరూ పోటీ పడి నటించారు. వారి నటన పరంగా నూటికి నూరు మార్కులు పడతాయి. అమైరా దస్తూర్‌ ఉన్నది కొంతసేపే అయినా బాగానే నటించారు. కంగన స్నేహితుడిగా జిమ్మీ షేర్గిల్‌ ఒదిగిపోయారు. మిగతా వారంతా తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. తనిష్క్‌ బాగ్చి అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. తక్కువ లైటింగ్‌లో సన్నివేశాలను చూపించాల్సి వచ్చినా హై క్లారిటీతో తెరకెక్కించారు.

బలాలు
+ కథ, కథనం
+ కంగన, రాజ్‌కుమార్‌ రావు
+ నిర్మాణ విలువలు

బలహీనతలు
- ద్వితీయార్ధంలో మరీ సాగదీతగా అనిపించే సన్నివేశాలు

* చివరగా..
ఓ ‘జడ్జిమెంటల్‌’ రోగి హంగామా!Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.