రివ్యూ: సూపర్‌ 30
నటీనటులు: హృతిక్‌ రోషన్‌, మృణాల్‌ ఠాకూర్, వీరేంద్ర సక్సేనా, పంకజ్‌ త్రిపాఠి, జానీ లీవర్‌, ఆదిత్య శ్రీవాస్తవ తదితరులు
సంగీతం: అజయ్‌, అతుల్‌
సినిమాటోగ్రఫీ: అనయ్‌ గోస్వామి
కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌
నిర్మాణ సంస్థ: ఫాంటమ్‌ ఫిలింస్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, హెచ్‌ఆరెక్స్‌ ఫిలింస్‌
కథ: సంజీవ్‌ దత్తా
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వికాస్‌ బెహెల్‌
విడుదల తేదీ: 12-07-2019


బాలీవుడ్‌ నుంచి మరో జీవిత కథా చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హృతిక్‌ రోషన్‌ కథానాయకుడిగా నటించిన ఆ చిత్రమే ‘సూపర్‌ 30’. ప్రముఖ ఐఐటీ శిక్షకుడు ఆనంద్‌ కుమార్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ‘క్వీన్‌’ దర్శకుడు వికాస్‌ భల్‌ తెరకెక్కించారు. ఆనంద్‌ కుమార్‌, వికాస్‌ బెహెల్‌పై ఎన్నో ఆరోపణలు వచ్చినప్పటికీ సినిమా అందరికీ నచ్చుతుందని చిత్రబృందం చెప్తూనే ఉంది. మరి ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సూపర్‌ 30’ ప్రేక్షకులు ఎన్ని మార్కులు వేస్తారో చూద్దాం.

* కథేంటంటే..
బిహార్‌లోని ఓ పేద కుటుంబంలో పుట్టిన ఆనంద్‌ కుమార్ (హృతిక్‌ రోషన్‌) ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో సీటు దక్కించుకునే స్థాయికి ఎదుగుతాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల అక్కడ చేరలేకపోతాడు. ఓ కాలేజ్‌లో గణిత ప్రొఫెసర్‌గా చేరతాడు. అయితే ఆ కాలేజ్‌లో పేద విద్యార్థుల పట్ల అన్యాయం జరుగుతుంటుంది. అది చూసి ఆనంద్‌ చలించిపోతాడు. పేద విద్యార్థులు చేసుకున్న పాపం ఏంటి? అని ఆలోచించి వారి కోసం ఓ నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం ఆ పేద విద్యార్థుల జీవితాన్నే మార్చేస్తుంది? ఇంతకీ ఆ పేద పిల్లలకు జరిగిన అన్యాయం ఏంటి? వారి కోసం ఆనంద్‌ తీసుకున్న నిర్ణయం ఏంటి? తదితర విషయాలను తెరపై చూడాలి.


* ఎలా ఉందంటే..
ఇది ఆనంద్‌ కుమార్‌ బయోపిక్‌ అయినప్పటికీ తెరపై మాత్రం అలా కనిపించదు. దర్శకుడే ఓ సొంత కథను రాసుకుని సహజంగా తెరకెక్కించినట్లు అనిపిస్తుంది. సినిమా మొత్తాన్ని హృతిక్‌ తన భుజాలపై మోశారు. అయితే ఆయన్ను బిహారీ వ్యక్తిలా చూపించడానికి ముఖానికి ముదురు గోధుమ రంగు మేకప్‌ వేయడం ప్రేక్షకులకు అంతగా రుచించదనే చెప్పాలి. ఎందుకంటే హృతిక్‌ కళ్లు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆనంద్ కుమార్‌లా చూపించడానికి కేవలం శరీరపు రంగు విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న చిత్రబృందం ఆయన కళ్ల విషయంలో మాత్రం ఎలాంటి శ్రద్ధ పెట్టలేదు. సినిమాలో హృతిక్‌ ప్రేయసిగా బుల్లితెర నటి మృణాల్‌ ఠాకూర్‌ నటించారు. అయితే ఆనంద్‌ కుమార్‌ బయోపిక్‌ కాబట్టి అసలు కథానాయిక పాత్ర అవసరం లేదు.

* ఎవరెలా చేశారంటే..
ఇది బయోపిక్‌ కాబట్టి హృతిక్‌ వన్‌ మ్యాన్‌ షోగా చెప్పాలి. ఆయన బిహారీ యాసలో మాట్లాడటం ఆకట్టుకుంటుంది. ఆయనకు వేసిన మేకప్‌ విషయాన్ని పక్కనబెడితే ఆనంద్‌ కుమార్‌ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి నటించారు. మృణాల్‌ ఠాకూర్‌ పాత్ర అవసరం లేకపోయినప్పటికీ ఆమె అందంగా కనిపించారు. ఐఐటీ ఇన్‌స్టిట్యూట్‌ హెడ్‌గా వీరేంద్ర సక్సేనా, విద్యా శాఖ మంత్రిగా పంకజ్‌ త్రిపాఠి సినిమాకు హైలైట్‌గా నిలిచారు. మిగతా వారంతా తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు. నిర్మాణ విలువల విషయంలో మాత్రం నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు. అనయ్‌ గోస్వామి కెమెరా టేకింగ్‌ ఆకట్టుకుంటుంది. అజయ్‌, అతుల్‌ అందించిన సంగీతం మెప్పిస్తుంది.

బలాలు
+ హృతిక్‌ నటన
+ నిర్మాణ విలువలు

బలహీనతలు
- అక్కడక్కడా ఓవరైన హృతిక్‌ మేకప్

* చివరగా..
‘సూపర్‌ 30’.. హృతిక్‌ వినూత్న ప్రయత్నం!


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.