రివ్యూ: ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌
రివ్యూ: ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌
చిత్రం: ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌
నటీనటులు: అనుపమ్‌ ఖేర్‌, అక్షయ్‌ ఖన్నా, సుజానే బెర్నెట్‌, అర్జున్‌ మాథుర్‌‌, అహానా కుమ్రా
సంగీతం: సుదీప్‌ రాయ్‌, సాధూ తివారీ
సినిమాటోగ్రఫీ: సచిన్‌ కృష్ణ
ఎడిటింగ్‌: కే.ఆల్‌. ప్రవీణ్‌
దర్శకుడు: విజయ్‌ రత్నాకర్‌
నిర్మాణ సంస్థ: పెన్‌ ఇండియా లిమిడెట్‌
విడుదల తేదీ: 11-01-2019


భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. మన్మోహన్‌ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన వద్ద జాతీయ భద్రతా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్‌ బారూ రాసిన ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ అనే బయోగ్రఫీ ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు విజయ్‌ రత్నాకర్‌ తెరకెక్కించారు. ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైనప్పటి నుంచీ వివాదాలు ఎదుర్కొంటోంది. ఇందులో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలను గురించి తప్పుగా చూపించారని, వాస్తవాలను వక్రీకరించారని కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆరోపించారు. తమకోసం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాలని డిమాండ్ ‌కూడా చేశారు. అయితే దానికి చిత్ర బృందం ఒప్పుకోలేదు. ఎట్టకేలకు ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. మరి ఈ బయోపిక్‌ ఏ మేరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో చూద్దాం..

* కథేంటంటే..
2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుంది. అయితే, ప్రధానమంత్రి పీఠంపై ఎవరిని కుర్చోబెట్టాలా అని తర్జనభర్జనలు పడుతున్న సమయంలో ఎవరూ ఊహించని విధంగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (సుజానే బెర్నెట్‌) ఆర్థిక వేత్త అయిన మన్మోహన్‌సింగ్‌ను (అనుపమ్‌) ప్రధానిగా ప్రకటిస్తారు. దీంతో ఈ విషయం కాస్త రాజకీయంగా చర్చనీయాంశం అవుతుంది. ఒక్క రోజులో మన్మోహన్‌ పేరు మార్మోగిపోతుంది. అయితే, ప్రధాని అయిన తర్వాత మన్మోహన్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఎవరి నిర్ణయాలను అమలు చేసేవారు? ప్రధానిగా తన పాత్ర ఏ స్థాయిలో ఉండేది? ఆయనపై ఎవరెవరి ప్రభావం ఉండేది? మొదలనవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!

* ఎలా ఉందంటే..
ఇతర బయోపిక్‌లతో పోలిస్తే, మన్మోహన్‌సింగ్‌ కాస్త ప్రత్యేకంగా ఉంటుందని అందరూ భావించారు. అయితే, సంజయ్‌ బారు ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’లో ఏమైతే రాశారో అదే తెరపై చూపించారు తప్ప దానికి అదనపు హంగులు ఏవీ జోడించలేదు. సినిమా మొత్తం ఓ డాక్యుమెంటరీగా అనిపిస్తుంది. మన్మోహన్ పాత్రను బలహీనంగా చూపించారు. కుటుంబం ఆయన్ను నియంత్రించే తీరును కూడా ప్రస్తావించారు. సోనియా గాంధీ, రాహుల్‌, ప్రియాంక తదితరులు ఆయన వెనుక ఉంటూ పెత్తనం చెలాయిస్తుంటారు. బహుశా అందుకేనేమో ఈ సినిమాపై పెద్ద వివాదం ఏర్పడింది. ప్రతి విషయంలో నిజాయితీగా, కచ్చితంగా ఉండే మన్మోహన్‌ తన పార్టీలో జరుగుతున్న అవినీతిని మాత్రం ప్రశ్నించలేకపోయారు. ఈ విషయాలన్నీ అందరికీ తెలిసిందే. కానీ బ్రేకింగ్‌ సంగతుల్ని ఇందులో చర్చించే ప్రయత్నం చేయలేదనిపిస్తుంది. సినిమా నుంచి కొత్తదనం ఊహించిన ప్రేక్షకుడ్ని ఇది నిరాశకు గురి చేస్తుంది.

* ఎవరెలా చేశారంటే..
దర్శకుడు కొత్త వాడే అయినా ఎలాంటి తడబాటు లేకుండా ఓ పొలిటికల్‌ డ్రామాలా సినిమాను తీశారు. మన్మోహన్‌ పాత్రలో అనుపమ్‌ ఒదిగిపోయారు. ఆయన పాత్రను పండించేందుకు ఎంత కష్టపడ్డారో తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. సంజయ్‌ బారూగా అక్షయ్‌ ఖన్నా నటించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. రాహుల్‌ గాంధీగా అర్జున్‌ మథూర్‌ కనిపించారు. ఆయన పరిధి మేరకు నటించారు. ప్రియాంకా గాంధీగా అహానా కుమ్రా చాలా తక్కువ సమయం కనిపించారు. మన్మోహన్‌ సతీమణి పాత్రకు దివ్య సేత్‌ న్యాయం చేశారు. సోనియా గాంధీగా సుజానా బెర్నెట్‌ ఒదిగిపోయారు. బయోపిక్‌ అందునా మన్మోహన్‌ సింగ్‌ది కావడంతో ఈ సినిమా నుంచి వినోదాన్ని ఆశించలేం.

బలాలు
+ అనుపమ్‌ ఖేర్‌

బలహీనతలు

- చాలా విషయాలను చర్చించకపోవడం
- సాదాసీదాగా సాగే సన్నివేశాలు

* చివరిగా..
‘ది యాక్సిడెంటల్‌ డాక్యుమెంటరీ’


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.