అదుగో

న‌టీన‌టులు: అభిషేక్ వ‌ర్మ‌, న‌భా నటేశ్‌, ర‌విబాబు, ఉద‌య్ భాస్క‌ర్, ఆర్కే, వీరేంద‌ర్ చౌద‌రి, సాత్విక్ త‌దిత‌రులు 
సంగీతం: ప‌్రశాంత్ ఆర్ విహార్ 
ఛాయాగ్ర‌హ‌ణం: ఎన్.సుధాక‌ర్ రెడ్డి
క‌ళ‌: నారాయ‌ణ రెడ్డి
కూర్పు: బ‌ల్ల స‌త్య‌నారాయ‌ణ
పోరాటాలు: క‌ణ‌ల్ క‌ణ్ణ‌న్, విజ‌య్, స‌తీష్‌
పాట‌లు: భాస్క‌ర‌భ‌ట్ల 
మాట‌లు: ర‌విబాబు, నివాస్ 
నిర్మాత‌: డి.సురేష్‌బాబు 
క‌థ, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌కత్వం: ర‌విబాబు 
విడుద‌ల‌: 7-11-2018.

కొత్త ర‌క‌మైన వినోదానికి పెట్టింది పేరు ర‌విబాబు. పోస్ట‌ర్‌పై ఆయ‌న పేరు చూడ‌గానే ఇందులో త‌ప్ప‌నిస‌రిగా ఏదో ఉంద‌నే ఓ అంచ‌నాకి వ‌చ్చేస్తుంటారు ప్రేక్ష‌కులు. అతి త‌క్కువ‌మంది ద‌ర్శ‌కులకి ఆ త‌ర‌హా గుర్తింపు ఉంటుంది. ఎలాంటి జోన‌ర్ క‌థ‌తో సినిమా తీసినా ర‌విబాబు త‌న ప్ర‌త్యేక‌త‌ని ప్ర‌ద‌ర్శిస్తూనే ఉంటారు. తాజాగా జంతువు నేప‌థ్యంలో `అదుగో` తీశారు. ఇందులో బంటి అనే పంది పిల్ల ప్ర‌ధాన పాత్ర‌ధారి. మ‌రి పందితో ఆయ‌న ఎలాంటి విన్యాసాలు చేయించాడు? త‌న ప్ర‌త్యేక‌త‌ని ఈసారి కూడా తెర‌పై చూపించారా? ప్రేక్ష‌కుల‌కు ఏ స్థాయిలో చిత్రం వినోదాన్ని పంచింది? తెలుసుకొందాం పదండి...
క‌థ:
సిక్స్‌ప్యాక్ శ‌క్తి (రవిబాబు) కొత్త రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో భూ దందా చేస్తుంటాడు. అత‌నికి దుర్గ అనే ప్ర‌త్య‌ర్థి ఉంటాడు. ఇద్ద‌రి గొడ‌వ మ‌ధ్య అనుకోకుండా బంటి (పందిపిల్ల‌) చిక్కుకుంటుంది. భూమికి సంబంధించిన స‌మాచారం ఉన్న మైక్రోచిప్‌ని బంటి మింగేస్తుంది. దాంతో రెండు ముఠాలు బంటి కోసం వేట మొద‌లుపెడ‌తాయి. ఆ వేట హైద‌రాబాద్ చేరుతుంది. అక్క‌డ మ‌రో రెండు ముఠాలకి కూడా బంటీనే అవ‌స‌ర‌మ‌వుతుంది. దాంతో వాళ్లూ బంటి కోసం అన్వేష‌ణ మొద‌లుపెడ‌తారు. రాజీ (న‌భాన‌టేష్‌), అభిషేక్ (అభిషేక్ వ‌ర్మ) అనే ప్రేమ‌జంట చేతుల్లోకి వెళ్లిన బంటి ఇన్ని ముఠాల నుంచి ఎలా త‌ప్పించుకొంది? తిరిగి త‌న ఇంటికి ఎలా వెళ్లింద‌నేదే మిగ‌తా సినిమా.
విశ్లేష‌ణ‌:
ఒక ప్రేమ‌జంట, నాలుగు ముఠాలు, బంటీ అనే ఒక పంది పిల్ల, దాన్ని ప్రేమ‌గా పెంచుకొన్న ఓ బాలుడు, అది త‌ప్పిపోవ‌డంతో అత‌నికి సిటీలో సాయం చేసే ఓ అమ్మాయి. బంటి క‌థ మొత్తాన్ని ఫ్లాష్‌బ్యాక్‌గా చెప్పేందుకు సాయం చేసే ఇంకో రెండు పందులు. 110 నిమిషాల క‌థ‌లో ఇన్ని విష‌యాలుంటాయి. ప్ర‌తి పాత్ర‌దీ ఒక నేప‌థ్యం. దాన్ని ప‌రిచ‌యం చేస్తూ, వీట‌న్నింటినీ ముడిపెట్టి క‌థ‌ని అల్లాడు ద‌ర్శ‌కుడు. ఆద్యంతం ఛేజింగ్ స‌న్నివేశాల‌తో క‌థ ప‌రుగులు పెడుతుంటుంది. కానీ ఏ ఒక్క స‌న్నివేశం ప్రేక్ష‌కుడిలో ఆస‌క్తిని రేకెత్తించ‌క‌పోగా, మ‌రింత గంద‌ర‌గళానికి గురిచేస్తుంది. కామెడీ ప‌రంగా కూడా అంతే. న‌వ్వించేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు సిల్లీగా, జుగుప్స‌గా అనిపిస్తాయి త‌ప్ప ఫ‌లితం మాత్రం ఉండ‌దు. పిల్ల‌లు కార్టూన్ ఛానల్స్‌లో చూసే ఓ షోకి స‌రిప‌డా స‌రుకుతో సినిమా తీశారు ద‌ర్శ‌కుడు. స‌న్నివేశాల రూప‌క‌ల్ప‌న కూడా కార్టూన్‌కి త‌గ్గ‌ట్టుగానే ఉంటుంది త‌ప్ప ఎక్క‌డా సినిమా స్థాయి కనిపించ‌దు. ఎప్పుడు ఏ పాత్ర ఏం చేస్తుందో, ఎవ‌రికోసం వెదుకుతుంటుందో అర్థం కాని ప‌రిస్థితి. బోలెడ‌న్ని ఉప‌క‌థ‌లు ఉండ‌టంతో సినిమా అంతా గ‌జిబిజిగా అనిపిస్తుంది. సినిమాలో చెప్పుకోద‌గ్గ విష‌యం ఏదైనా ఉందంటే అది బంటి అనే పంది పిల్ల చేసే కాసిన్ని విన్యాసాలే. ఆ పంది పిల్ల‌ని కూడా విజువ‌ల్ ఎఫెక్ట్స్‌లో స‌హ‌జంగా చూపించిన విధానం ఆక‌ట్టుకుంటుంది. కానీ ద‌ర్శ‌కుడు కామెడీ పండించేందుక‌ని గుట్కా తిని ఉమ్మి వేసే పాత్ర‌ని, కోపాన్ని కంట్రోల్ చేయ‌డం కోసం అంటూ బూతులు తిట్టే పాత్ర‌ని సృష్టించిన తీరు ప్రేక్ష‌కుల‌కు ఏమాత్రం మింగుడుప‌డ‌దు. పిల్ల‌ల‌కి న‌చ్చేలా కొన్ని సన్నివేశాలు మిన‌హాయిస్తే సినిమాలో చెప్పుకోద‌గ్గ విష‌యాలేమీ లేవు.

న‌టీన‌టులు సాంకేతిక‌త‌:
ర‌విబాబు సిక్స్‌ప్యాక్ శ‌క్తి పాత్ర‌లో ఆక‌ట్టుకుంటాడు. ప్రేమ‌జంట‌గా అభిషేక్‌, న‌భా క‌నిపిస్తారు. న‌భా అందంగా క‌నిపించింది. కానీ ఆమె పాత్ర ప‌రిధి త‌క్కువే. ఆర్కే, విజ‌య్ సాయి... ఇలా కొద్దిమంది మిన‌హాయిస్తే అంతా కొత్త‌వాళ్లే క‌నిపిస్తారు. పాత్ర‌ల ప‌రిధి మేర‌కు అంద‌రూ బాగా న‌టించారు. కానీ కొన్ని పాత్ర‌ల్ని తీర్చిదిద్దిన విధానమే ఆక్షేప‌ణీయంగా అనిపిస్తుంది. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. విజువ‌ల్ ఎఫెక్ట్స్ సినిమాలో ఒదిగిపోయాయి. క‌ళా ద‌ర్శ‌క‌త్వ విభాగం శ్ర‌మ ప్ర‌తి ఫ్రేమ్‌లోనూ క‌నిపిస్తుంది. సుధాక‌ర్‌రెడ్డి కెమెరాప‌నిత‌నం, ప్ర‌శాంత్ విహారి సంగీతం ద‌ర్శ‌కుడి ఆలోచ‌న‌ల‌కి, క‌థ‌కి త‌గ్గ‌ట్టుగా కుదిరాయి. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఉన్నాయి. ద‌ర్శ‌కుడిగా తాను అనుకొన్న‌ది తీశారు ర‌విబాబు. కానీ ప్రేక్ష‌కుడికి కావ‌ల్సిన ఆస‌క్తి, వినోదం ఇందులో ఉందా లేదా అనేది చూసుకోలేక‌పోయారు.

 చివరగా: 
ర‌విబాబు సినిమాల్లో పాత్ర‌లు అల్ల‌రి చేస్తుంటాయి. వాటితోనే బోలెడంత కామెడీ పండేది. అయితే ఆ అల్ల‌రి ఇదివ‌ర‌కు ఆరోగ్య‌క‌రమైన స్థాయిలో ఉండేది. ఇందులో కొన్ని పాత్ర‌లు చూస్తే మాత్రం అది కాస్త శృతిమించిన‌ట్టు అనిపిస్తుంది. అయినా స‌రే ద‌ర్శ‌కుడు ఆశించిన, ప్రేక్ష‌కుడికి కావ‌ల్సిన కామెడీ మాత్రం పండ‌లేదు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.