రివ్యూ: గుణ 369
చిత్రం: గుణ 369
నటీనటులు: కార్తికేయ, అనఘ, సాయికుమార్‌, ఆదిత్య మేనన్‌, నరేష్‌, మంజు భార్గవి, హేమ, ‘రంగస్థలం’ మహేశ్‌ తదితరులు
సంగీతం: చైతన్‌ భరద్వాజ్‌
సినిమాటోగ్రఫీ: రామ్‌
నిర్మాత: అనిల్‌ కడియాల, తిరుమలరెడ్డి
దర్శకత్వం: అర్జున్‌ జంధ్యాల
బ్యానర్‌: జ్ఞాపిక ప్రొడక్షన్స్‌
విడుదల తేదీ: 02-08-2019


‘ఆర్‌ఎక్స్‌100’తో కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తికేయ. విఫల ప్రేమికుడిగా ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఇక ఏడాది ఇప్పటికే ‘హిప్పీ’గా ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదనిపించాడు. ముచ్చటగా మూడో చిత్రంగా ‘గుణ 369’ అంటూ మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యాడు. మరి కార్తికేయ ఈ చిత్రంతో మరో విజయాన్ని అందుకున్నాడా? బోయపాటి శిష్యుడైన అర్జున్‌ జంధ్యాల కార్తికేయను ఏవిధంగా చూపించాడు?

కథేంటంటే:
గుణ(కార్తికేయ) మధ్య తరగతి యువకుడు. తనకు కుటుంబం అంటే చాలా ఇష్టం. ఎవరి విషయంలోనూ తలదూర్చడు. గొడవలకు చాలా దూరం. అలాంటి అబ్బాయి గీత(అనఘ)ను ఇష్టపడతాడు. గీత కూడా గుణను ప్రేమిస్తుంది. ఒక స్నేహితుడిని కాపాడబోయి గుణ చిక్కుల్లో ఇరుక్కుంటాడు. ఒకడికి మంచి చేయడం వల్ల తనకు చెడు ఎదురవుతుంది. తన కుటుంబానికి, ప్రేమించిన అమ్మాయికి ముప్పు ఏర్పడుతుంది. ఇంతకీ గుణ అలా ఎందుకు చేశాడు? ఏ విషయంలో అది జరిగింది? తనకు ఎదురైన పరిస్థితుల వల్ల గుణ ఎలా మారాడు? అన్నది కథ.


ఎలా ఉందంటే:
పిల్లిని కూడా గదిలో బంధించి కొడితే పులిలా మారుతుంది. తమ వారికి ఏమవుతుందోనని భయపడే మధ్య తరగతి వాళ్లు గొడవలకు దూరంగా ఉంటారు. అలా గొడవలకు దూరంగా ఉన్న ఓ యువకుడు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి అదే గొడవలకు ఎదురెళ్తే, ఎలా ఉంటుందన్నది ఈ కథ. ‘ఆర్‌ఎక్స్‌ 100’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ మరోసారి విభిన్న కథను ఎంచుకునే ప్రయత్నం చేశాడు. ‘ఆర్‌ఎక్స్‌100’లాగా ఈ కథ కూడా వాస్తవిక ధోరణిలో సాగుతుంది. సమాజంలో మనకు కనిపించిన విషయాలే తెరపై కథగా మలచడానికి దర్శకుడు ప్రయత్నించాడు. కథను చాలా సున్నితంగా ప్రారంభించి మెల్లిగా అసలు విషయంలోకి వెళ్లాడు. కథానాయికతో ప్రేమ వ్యవహారాలు, పాటలు కాస్త బోరు కొట్టించినా, విశ్రాంతి సన్నివేశానికి ఓ మలుపు వస్తుంది. ఆ మలుపు ఎవరూ ఊహించనిది.

ద్వితీయార్ధం మొత్తం పగతో రగలిపోతున్న కథానాయకుడిగా ప్రయాణం కనిపిస్తుంది. తన జీవితం అగాధంలో పడిపోవడానికి కారణమైన వాళ్లపై కథానాయకుడు ఎలా పగ తీర్చుకున్నాడన్నది ప్రధానంగా సాగుతుంది. సినిమా అయిపోతుందనగా, కథకు సంబంధించిన మరో ట్విస్ట్‌ ఇచ్చాడు దర్శకుడు. అది మరింత ఆశ్చర్య పరుస్తుంది. నిజానికి ఆ మలుపే గుణకు ప్రత్యేకత తీసుకొస్తుంది. వాస్తవ సంఘటనలను తెరపై చూపిస్తున్నానని దర్శకుడు ముందే చెప్పాడు. అలా ఎందుకు చెప్పాడన్నది పతాక సన్నివేశాలు చూస్తే అర్థమవుతుంది. మొత్తానికి ఒక కమర్సియల్‌ అంశానికి సామాజిక ఇతి వృత్తంమేళవించి మాస్‌ ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యాడు.


ఎవరెలా చేశారంటే
: రెండు చిత్రాల అనుభవం మాత్రమే ఉన్న కార్తికేయ ఈసారి మరింత బలమైన, బరువున్న పాత్రను ఎంచుకున్నాడు. రెండు సినిమాలకంటే అతనిలో ఇందులో పరిణతి ఎక్కువ కనిపిస్తుంది. తొలి సగంలో భయస్తుడిగా, అల్లరి పిల్లాడిగా కనిపించిన ఈ పాత్ర, ద్వితీయార్థానికి వచ్చే సరికి తన స్వరూపాన్ని మార్చేసుకుంటుంది. పతాక సన్నివేశాల్లో కార్తికేయ నటన మరింత నచ్చుతుంది. కథానాయికగా అనఘకు ఇదే తొలి చిత్రం. తన వరకూ బాగానే చేసింది. కాకపోతే, పరిచయం ఉన్న కథానాయికను ఎంచుకుని ఉంటే ఆ పాత్ర మరింతగా పండేది. నరేష్‌, హేమలు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ‘రంగస్థలం’ మహేశ్‌కు ఈ సినిమాతో మరిన్ని మార్కులు పడతాయి. ఆ పాత్రే ఊహించని మలుపులకు కారణం అవుతుంది. ‘బుజ్జి బంగారం’ పాట విడుదలకు ముందే చేరువైంది. తెరపై మరింత జోష్‌గా కనిపిస్తుంది. ఒకట్రెండు పాటలు నిడివి పెంచటానికి తప్ప కథకు ఉపయోగపడలేదు. నేపథ్య సంగీతం, కెమెరా పనితనం ఆకట్టుకుంటాయి. బోయపాటి శిష్యుడు అర్జున్‌ జంధ్యాలకు ఇదే తొలి చిత్రం. గురువు బాటలోనే మాస్‌ అంశాలను మేళవించి ఓ సినిమా తీయగలిగాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.


బలాలు 
+ విశ్రాంతి ఘట్టం - లవ్‌ ట్రాక్‌
+ పతాక సన్నివేశాలు
+ కార్తికేయ

బలహీనతలు
- ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాలు

చివరిగా
: ఊహించని మలుపులతో ‘గుణ’


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.