రివ్యూ: కొబ్బరిమట్ట
చిత్రం: కొబ్బరిమట్ట
నటీనటులు: సంపూర్ణేష్‌బాబు, ఇషికా సింగ్‌, షకీలా, మహేశ్‌కత్తి, గాయత్రి గుప్త తదితరులు
సంగీతం: సయీద్‌ కర్మాన్‌
సినిమాటోగ్రఫీ: ముజీర్‌ మాలిక్‌
ఎడిటింగ్‌: కార్తీక శ్రీనివాస్‌
నిర్మాత: సాయి రాజేశ్‌ నీలం
దర్శకత్వం: రూపక్‌ రొనాల్డ్‌సన్‌
బ్యానర్‌: అమృత ప్రొడక్షన్స్‌
విడుదల తేదీ: 10-08-2019

సంపూర్ణేష్‌బాబు... సోషల్‌ మీడియా వల్ల గుర్తింపు తెచ్చుకుని, చిత్రసీమలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న నటుడు. ‘హృదయకాలేయం’ అనే చిత్రంతో నవ్వించాడు. ఆ తరవాత హాస్యనటుడిగా కొన్ని ప్రయత్నాలు చేశాడు. ఇప్పుడు మరోసారి కథానాయకుడిగా అవతారం ఎత్తాడు. ‘కొబ్బరిమట్ట’ సినిమాతో. ఇందులో సంపూ... మూడు పాత్రల్లో కనిపించడం, ప్రచార చిత్రాల్లో మాస్‌ హీరోగా భారీ డైలాగులు చెప్పడం ఆకట్టుకున్నాయి. దాంతో ఈసారి ఎన్ని నవ్వులు పండిస్తాడో అంటూ ఆసక్తిగా ఎదురు చూశారు హాస్య ప్రియులు. మరి సంపూ ఈసారి ఏం చేశాడు? కొబ్బరిమట్ట ఎలా ఉంది?

* కథేంటంటే..
పెదరాయుడు (సంపూర్ణేష్‌ బాబు) ఊరికి పెద దిక్కు. ఎవరికి ఏ అన్యాయం జరిగినా దానికి వ్యతిరేకంగా ఎదురు నిలబడతాడు.. నిలదీస్తాడు.. చిత్ర విచిత్రమైన తీర్పులు చెబుతాడు. తన ముగ్గురు తమ్ముళ్లంటే ప్రాణం. ముగ్గురు భార్యలు కూడా. అయితే ఓ రోజు ఆండ్రాయుడు (సంపూర్ణేష్‌బాబు) వచ్చి.. ‘నువ్వే నా తండ్రివి’ అంటూ పెదరాయుడు ముందు నిలబడతాడు. ఆండ్రాయుడు రాకతో పెదరాయుడు జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. ఇంతకీ ఈ ఆండ్రాయుడు ఎవరు? పెదరాయుడుతో తనకున్న సంబంధం ఏమిటి? ఆండ్రాయుడు వచ్చాక పెదరాయుడు జీవితంలో ఏం జరిగింది? పాపారాయుడు (సంపూ)కీ వీళ్లకూ ఉన్న సంబంధం ఏమిటి? అనేది తెరపై చూడాలి.

* ఎలా ఉందంటే..
‘హృదయకాలేయం’లానే సంపూర్ణ వినోదాత్మక చిత్రంగా మలచాలని దర్శక నిర్మాతలు ప్రయత్నించారు. అందులో అక్కడక్కడ విజయం సాధించారు కూడా. కథలో ఎలాంటి లాజిక్కులూ ఉండవు. ప్రతీ సన్నివేశం నవ్వించడానికే కాబట్టి.. ప్రేక్షకులూ సర్దుకుపోతారు. తెలుగు సినిమాలపై, అందులోని సన్నివేశాలపై, హీరోయిజాలపై ఇదో సెటైర్‌. ఓ రకంగా ‘సుడిగాడు’లో స్నూఫ్‌లు పేర్చుకుంటూ పోయినట్టు, ఇందులో కొన్ని తెలుగు సినిమా సన్నివేశాల్ని పేరడీ చేసుకుంటూ వెళ్లారు. అందులో భాగంగా వచ్చే కొన్ని సన్నివేశాలు నవ్విస్తాయి. ఇంకొన్ని చిరాకు పుట్టిస్తాయి. సంపూ ఏం చేయగలడన్నది ప్రేక్షకులకు తెలుసు. ఆ బలాల్ని దృష్టిలో ఉంచుకునే సన్నివేశాలు తయారు చేశారు.

ప్రారంభంలో సంపూ విన్యాసాలు నవ్విస్తాయి. క్రమంగా అవన్నీ బోరు కొట్టడం మొదలెడతాయి. మోతాదు మించిన హాస్యం కూడా పనికి రాదు. వ్యంగ్రాస్త్రాలు కొన్నిసార్లు హద్దులు దాటాయి. ద్వితీయార్థంలో సాగదీత సన్నివేశాలున్నాయి. ఇలాంటివి జబర్దస్త్‌లాంటి కామెడీ షోల్లో చాలానే చూసేశారు ప్రేక్షకులు. మళ్లీ వాటిని వెండి తెరపై చూడడంతో అంతగా వినోదమూ పుట్టదు. కేవలం సంపూని చూడ్డానికి థియేటర్లకు వెళ్లే వాళ్లకు టికెట్‌ రేటు గిట్టుబాటు అవ్వొచ్చు. అంతకు మించి ఆశిస్తే మాత్రం భంగపడతారు.

* ఎవరెలా చేశారంటే..
సంపూ మూడు పాత్రలు చేసినా... మూడింటిలోనూ నవ్వించడమే పనిగా పెట్టుకున్నాడు. సంపూ వేసిన వైరైటీ స్టెప్పులు ఆశ్చర్యపరుస్తాయి. విశ్రాంతి ముందు గుక్క తిప్పుకోకుండా చెప్పిన మూడున్నర నిమిషాల డైలాగ్‌ ప్రధాన ఆకర్షణ. సంపూని మినహాయిస్తే ఏ పాత్రనీ దర్శకుడు పట్టించుకోలేదు. ప్రతీ నటుడూ సంపూకి మించి ఓవరాక్షన్‌ చేయాలని ప్రయత్నించినట్టే కనిపిస్తుంది. పాటలూ వినోదం కోసమే కాబట్టి.. అందులో తప్పొప్పులు, సాహిత్య విలువల గురించి మాట్లాడడం అనవసరం. చిన్న సినిమా ఇది. బడ్జెట్‌ పరిమితులు కనిపిస్తూనే ఉంటాయి. డైలాగుల్లో వ్యంగ్యం బాగా పండింది.

బలాలు
+ సంపూ
+ కొన్ని డైలాగులు

బలహీనతలు
- కథ, కథనాలు
మిగిలిన నటీనటులు

* చివరిగా..
కొబ్బరిమట్ట.. కాలక్షేపం కోసంCopyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.