రివ్యూ: మెహబూబా
సినిమా పేరు: మెహబూబా
నటీనటులు: ఆకాశ్‌ పూరీ, నేహా శెట్టి, సయాజీ షిండే, మురళీ శర్మ తదితరులు
సంగీతం: సందీప్‌ చౌతా
కూర్పు: జునైద్‌ సిద్ధిఖి
సినీమాటోగ్రఫీ: విష్ణు శర్మ
నిర్మాణ సంస్థలు: పూరీ కనెక్ట్స్‌, పూరీ జుగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌
నిర్మాతలు: పూరీ జగన్నాథ్‌, చార్మి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పూరీ జగన్నాథ్‌
విడుదల తేదీ: 11-05-2018


బాలనటుడిగా ప్రేక్షకులకు పరిచయమయ్యారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ కుమారుడు ఆకాశ్‌ పూరీ. ఆ తర్వాత ‘ఆంధ్రాపోరీ’ చిత్రంతో కథానాయకుడిగా మారారు. కానీ ఈ సినిమా ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది. తన రెండో సినిమాతోనైనా తానేంటో నిరూపించుకోవాలని ఎంతో కష్టపడి తనని తాను నటన పరంగా, లుక్‌ పరంగా మలుచుకున్నారు. తన తండ్రి తెరకెక్కించిన ‘మెహబూబా’ చిత్రంతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ట్రైలర్‌తోనే సినిమాపై, ఆకాశ్‌పై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. మరి వారి అంచనాలకు తగ్గట్టే ఆకాశ్ మెప్పించారా? పూరీ జగన్నాథ్ చేసిన కొత్త ప్రయత్నం ఫలించిందా? చూద్దాం.

కథేంటంటే: హైదరాబాద్‌ కుర్రాడు రోషన్‌ (ఆకాశ్‌)కు చిన్నప్పటి నుంచి ఓ వింత సమస్యతో సతమతమవుతుంటాడు. అతన్ని గత జన్మ జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి. బీటెక్‌ పూర్తిచేసిన రోషన్‌ మిలిటరీలో చేరాలనుకుంటాడు. తనకి హిమాలయాలతో ఏదో బంధం ఉందని అందరితో చెబుతుంటాడు. మిలిటరీలోకి వెళ్లే క్రమంలోనే పాకిస్థాన్‌కు చెందిన అఫ్రీన్‌ (నేహా శెట్టి)ని కలుస్తాడు. హైదరాబాద్‌లో ఓ ప్రమాదం నుంచి అఫ్రీన్‌ను రక్షిస్తాడు. దాంతో రోషన్ కోసమే ఎదురుచూస్తుంటుంది అఫ్రీన్‌. అలా రోషన్‌, అఫ్రీన్‌లు కలవగానే ప్రేమలో పడతారు. ఆ తర్వాత ఇద్దరికీ గత జన్మలోనూ బంధం ఉందని తెలుసుకుంటారు. ఇంతకీ ఆ ఇద్దరి మధ్య ఉన్న గత జన్మ బంధం ఏమిటి? భారత్‌, పాక్‌కు చెందిన రోషన్‌, అఫ్రీన్‌ ఒక్కటయ్యారా? లేదా? తదితర విషయాలు తెరపై చూడాలి.

ఎలా ఉందంటే: కలిసి జీవించేందుకు జన్మజన్మలుగా తపన పడిన రెండు మనసుల కథ ఇది. పూరీ ఒక విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా ‘మెహబాబూ’ను తెరకెక్కించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పూరీ మార్క్‌, వేగం, కమర్షియల్‌ అంశాలు సినిమాలో మాయమయ్యాయి. దాంతో చాలా సన్నివేశాలు నత్తనడకన సాగుతున్నట్లు అనిపిస్తాయి. తొలి సగ భాగం వరకు కథ ఆసక్తికరంగానే సాగుతుంది. ద్వితీయార్థంలోనూ భారత్‌-పాక్‌ యుద్ధం నేపథ్యంలో సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆ తర్వాతే చెప్పడానికి కథేమీ లేకపోవడంతో సన్నివేశాలను సాగదీశారు. తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి సన్నగిల్లిపోతుంది. ప్రతి సన్నివేశం ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టే సాగుతుంది. ప్రీ క్లైమాక్స్‌లో సల్మాన్‌ ఖాన్‌ జిందాబాద్‌, షారుక్‌ ఖాన్‌ జిందాబాద్‌ అని కథానాయకుడు చెప్పే సంభాషణలు..ఆ క్రమంలో వచ్చే సన్నివేశాలు పూరీ మార్క్‌ను గుర్తుచేస్తాయి. తన శైలికి భిన్నంగా పూరీ ఒక నిజాయతీ ప్రేమకథను చూపించేందుకు యత్నించారు.

ఎవరెలా చేశారంటే: ‘నన్ను మా నాన్న పరిచయం చేయడంలేదు. నేనే నాన్నను పరిచయం చేస్తున్నాను’ అని ఆకాశ్‌ ఈ సినిమా వేడుకలో చెప్పారు. ఆ మాటలు నిజమే అనిపిస్తాయి ‘మెహబూబా’ సినిమా చూస్తే. పూరీ సినిమా తీసిన విధానం కంటే ఆయన తనయుడి నటనే సినిమాకి హైలైట్‌గా నిలిచింది. ప్రతి సన్నివేశంలోనూ చాలా కాన్ఫిడెంట్‌గా నటించాడు. నేహా శెట్టి అందం, అభినయం ఆకట్టుకుంటాయి. మురళీ శర్మ, సయాజీ షిండే వంటి ఇద్దరు ముగ్గురు నటులు మాత్రమే తెలిసిన నటులుగా కన్పిస్తారు. ఆ పాత్రలకు కూడా పెద్దగా ప్రాధాన్యం లేదు. ఈ చిత్రం పూరీ తీసిన గత సినిమాల కంటే భిన్నంగా అనిపించినా ఆయనకు మాత్రమే ప్రత్యేకం అనిపించే వేగం ఈ సినిమాలో లేకపోవడం అభిమానులను నిరాశపరుస్తుంది. కథనం పరంగా మాత్రం ఆకట్టుకున్నారు. రియల్‌ లొకేషన్లలో సినిమాను చిత్రీకరించారు. దాంతో అడుగడుగునా నిర్మాణ విలువలు కన్పిస్తాయి. ఛాయాగ్రహణం, సంగీతం బాగున్నాయి. విజువల్‌ ఎఫెక్ట్స్‌ సహజంగా తీర్చిదిద్దారు.

బలాలు:
+ ఆకాశ్‌ నటన
+ కథనం, మాటలు
+ ఛాయాగ్రహణం
+ నిర్మాణ విలువలు

బలహీనతలు:
- కథ
- ద్వితీయార్థంలో వేగం లేకపోవడం

చివరగా: జన్మజన్మల ప్రేమ కథ ‘మెహబూబా’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

సంబంధిత వ్యాసాలు
  • మెహబూబా సెన్సార్‌ పూర్తి ఆకాశ్‌పూరి, నేహాశెట్టి జంటగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెహబూబా’. పూరి కనెక్ట్స్‌ సంస్థలో నిర్మించారు. ట్రైలర్, పాటలకు మంచి ఆదరణ లభించింది. ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తికాగా ఈ చిత్రం తాజాగా సెన్సార్‌ కార్యక్రమాల్ని పూర్తిచేసుకోని యు/ఎ సర్టిఫికెట్‌ను అందుకుంది
  • 1700పైగా స్క్రీన్లలో ‘మెహబూబా’ ట్రైలర్‌ ఆకాష్‌ పూరి కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘మెహబూబా’. నేహాశెట్టి కథానాయిక. సందీప్‌ చౌతా స్వరాలు సమకూరుస్తున్నాడు. ఈ చిత్ర ట్రైలర్‌ను నేడు విడుదలైన
  • మనసుతో రాసిన కథ.. ‘మెహబూబా’ ‘‘పూరి జగన్నాథ్‌ మనసు పెట్టి ఒక కథ రాస్తే అది ఎలా ఉంటుందో ‘మెహబూబా’ సినిమా చూస్తే తెలుస్తుంది. నిజమైన ఓ మంచి ప్రేమకథ ఇది. సినిమాపై నమ్మకంతో విడుదలకి ముందే కళాశాల విద్యార్థులకి చూపించాం. ప్రతి ఒక్కరూ సినిమా మనసుకు హత్తుకొనేలా ఉందని చెబుతుంటే ఆనందంగా ఉంది’’ అన్నారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు.
  • నా ప్రాణం ఏదో అన్నది.. మెహబూబా పూరి జగన్నాథ్‌.. తక్కువ బడ్జెట్‌లో, అతి తక్కువ రోజుల్లో సినిమాను తెరకెక్కించడంలో ఆయనది అందెవేసిన చేయి. ఆయన ఎంచుకునే కథలు ఎంత వైవిధ్యంగా ఉంటాయో.. ఆ కథల్లోని కథనాయకుడి పాత్ర, సంభాషణలు కూడా అంతే విభిన్నంగా ఉంటాయి. అందుకే పూరి నుంచి సినిమా వస్తుందంటే సినీ ప్రియుల్లో ...
  • వాళ్ల గురించి ప్రీరిలీజ్‌ వేడుకలో మాట్లాడతా! ఆకాశ్‌ పూరి, నేహా శెట్టి నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘మెహబూబా’. పూరీ జగన్నాథ్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రమిది. ఇటీవలే విడుదలైన సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. దిల్‌రాజు వెంకటేశ్వర ఫిలింస్‌ ద్వారా మే 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం...
  • మెహబూబా టీజర్‌ విడుదల ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆయన కుమారుడు ఆకాశ్‌ పూరీ నటిస్తున్న చిత్రం ‘మెహబూబా.’ బెంగళూరుకు చెందిన నటి నేహాశెట్టి ఇందులో కథానాయిక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది.
© Sitara 2018.
Powered by WinRace Technologies.