రివ్యూ: మిస్టర్‌ కెకె
చిత్రం: మిస్టర్‌ కెకె
నటీనటులు: విక్రమ్‌, అక్షరా హాసన్‌, అభి హాసన్‌, లీనా, వికాస్‌, జాస్మిన్‌ తదితరులు
సంగీతం: జిబ్రాన్‌
సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్‌ ఆర్‌.గుతా
ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌.
నిర్మాత: కమల్‌హాసన్‌, ఆర్‌.రవీంద్రన్‌
దర్శకత్వం: రాజేశ్‌ సెల్వా
బ్యానర్‌: రాజ్‌ కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషన్‌
విడుదల తేదీ: 19-07-2019

విక్రమ్‌ సినిమా అంటే ఏదో కొత్తదనం ఉంటుందని అందరూ ఆశిస్తారు. అందుకు తగట్టే ఆయన గత చిత్రాలన్నీ ఉంటాయి. పాత్ర నచ్చితే, ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా దానికోసం కష్టపడటం విక్రమ్‌ తత్వం. ఆయన పడిన కష్టమంతా ‘ఐ’ సినిమాలో మనకు కనిపిస్తుంది. అయితే, ఇటీవల కాలంలో ఆయన ఎంచుకునే పాత్రలు వైవిధ్యంగా ఉంటున్నా, కథలో మాత్రం కొత్తదనం లేకపోవడంతో భారీ అంచనాలతో బాక్సాఫీస్‌కు వస్తున్న సినిమాలు చప్పగా సాగిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో అగ్ర నటుడు కమల్‌హాసన్‌ నిర్మాతగా మారి తెరకెక్కించిన చిత్రం ‘కడరమ్‌ కొండన్‌’. తెలుగులో ‘మిస్టర్‌ కెకె’ పేరుతో విడుదలైంది. మరి ఈ చిత్రం విక్రమ్‌కు విజయాన్ని అందించిందా? కొత్త విక్రమ్‌ను చూపించిందా? కమల్‌ కుమార్తె అక్షరాహాసన్‌ ఏ మేరకు ఆకట్టుకుంది?


* కథేంటంటే..
ఇది పూర్తి మలేషియాలో జరిగే కథ. వాసు(అభి హాసన్‌) అదిరా(అక్షరాహాసన్‌) భార్యభర్తలు. అదిరా నిండు గర్భిణి. కాన్పునకు దగ్గరలో ఉంటుంది. వాసు ఒక డాక్టర్. అతను పనిచేసే ఆస్పత్రిలో పేషెంట్‌గా చేరతాడు కెకె(విక్రమ్‌). అతని చుట్టూ చాలా కేసులు ఉంటాయి. మలేషియా పోలీసుల లిస్ట్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌. కెకెను తప్పించడానికి అతని వాళ్లు అదిరాను కిడ్నాప్‌ చేస్తారు. కెకెను బయటకు తీసుకొస్తేనే అదిరాను విడిచిపెడతామని వాసును హెచ్చరించడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పోలీసుల కళ్లు గప్పి కెకెను బయటకు తీసుకొస్తాడు వాసు. అక్కడి నుంచి మలేషియా పోలీసులు వారిద్దరి వెంటా పడుతుంటారు. అసలు కెకె ఎవరు? అతని వెనకున్న నేపథ్యం ఏంటి? అదిరా-వాసులు కలుసుకున్నారా? అన్నది కథ.


* ఎలా ఉందంటే..
విక్రమ్‌ సినిమాలంటే రొటీన్‌కు భిన్నంగా ప్రయోగాత్మకంగా, ఉంటాయని ఆశిస్తారు. ఈసారి విక్రమ్‌ ఒక యాక్షన్‌ థ్రిల్లర్‌ను ఎంచుకున్నాడు. ఈ మధ్య కాలంలో యాక్షన్‌ థ్రిల్లర్‌ల హవా ఎక్కువైంది. వాటిలో ఏదో ఒక కొత్తదనం చూపిస్తే తప్ప, ప్రేక్షకులను మెప్పించలేం. మిస్టర్‌ కెకె కథలో ఉన్న కొత్తదనం ఏంటో ఎంత ఆలోచించినా అర్థం కాదు. ఇదొక సగటు యాక్షన్‌ చిత్రం. కథలో మలుపులు పెద్దగా ఉండవు. కేవలం స్క్రీన్‌ప్లేనే ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు దర్శకుడు. మొత్తం దానిపైనే ఆధారపడి ఆయా సన్నివేశాలను ఆకట్టుకునేలా మలచడంలో తడబడ్డాడు.

సినిమాను చాలా నిదానంగా ప్రారంభించిన దర్శకుడు విరామం తర్వాత కూడా అసలు కథలోకి వెళ్లలేకపోయాడు. కెకె ఎవరు? అతని నేపథ్యం ఏంటి? అతను ఎందుకు అరెస్టు అయ్యాడు? అనే విషయాలను విశ్రాంతి వరకూ చెప్పలేకపోయాడు. దీంతో కథలో గందరగోళం నెలకొంటుంది. ఈ కథలో పెద్ద పెద్ద మలుపులు ఉంటాయని ఆశించిన ప్రేక్షకుడికి నిరాశే ఎదురవుతుంది. ఒక సాధారణమైన ట్విస్ట్‌తో కథను ముగిస్తాడు దర్శకుడు. అది కూడా కొండను తవ్వి ఎలుకని పట్టినట్లు ఉంటుంది‌. క్లైమాక్స్‌లో హింస కూడా అధికంగానే ఉంటుంది. కేవలం మలేషియా రోడ్లపై ఛేజింగ్‌లు, యాక్షన్‌ ఘట్టాలు ఒక్కటే ఈ సినిమాకు ఉపశమనం కలిగిస్తాయి. మిగతా విషయాల్లో సగటు చిత్రంగానే మిగిలిపోతుంది.


* ఎవరెలా చేశారంటే..
ఇది విక్రమ్‌ సినిమా అని చెప్పుకొన్నా, విశ్రాంతి వరకూ ఆయన పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. సినిమా మొత్తం విక్రమ్‌ అంతా గంభీరంగా కనిపిస్తాడు. ఈ సినిమాలో ఆయన నుంచి చూసే కొత్త కోణాలు ఏవీ ఉండవు. అక్షరాహాసన్‌ గృహిణి పాత్రలో ఆకట్టుకుంటుంది. అయితే, ఆ పాత్రకు ఉన్న ప్రాధాన్యం కూడా తక్కువే. వాసుగా అభిహాసన్‌ నటన ఆకట్టుకుంటుంది. భార్యను కాపాడుకోవడం కోసం తనకు ఏమాత్రం సంబంధంలేని కేసులో ఇరుక్కుపోయిన భర్తగా అతని పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది.

మిగిలిన నటీనటులు తెలుగు ప్రేక్షకులను తెలియని వారు. ఏ పాత్రకూ చెప్పుకోదగినంత ప్రాధాన్యం లేదు. యాక్షన్‌ దృశ్యాలు ఒక్కటే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. మలేషియాలో చిత్రీకరించడం వల్ల సినిమాకు రిచ్‌నెస్‌ వచ్చింది. నేపథ్యం సంగీతం ఆకట్టుకుంటుంది. ఒకే ఒక్క పాటకు పరిమితం కావడం కలిసొచ్చే విషయం. దర్శకుడు ఎంచుకున్న కథ చాలా సాదాసీదాగా ఉండటం కాకుండా, దాన్ని తెరకెక్కించిన విధానం కూడా రొటీన్‌గా ఉండటంతో ప్రేక్షకులకు మామూలు సినిమాలు చూస్తున్న భావనే కలుగుతుంది.


బలాలు
+ యాక్షన్‌ సన్నివేశాలు
+ నేపథ్య సంగీతం

బలహీనతలు
- రొటీన్‌ కథ, కథనాలు
- ఏ పాత్రను బలంగా తీర్చిదిద్దలేకపోవడం


* చివరిగా..
మిస్టర్‌.కెకె ఫలించని ప్రయత్నంCopyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.