రివ్యూ: ఓ బేబీ
నటీనటులు: సమంత, లక్ష్మి, రాజేంద్రప్రసాద్‌, మాస్టర్‌ తేజ, రావు రమేశ్‌, ప్రగతి, స్నిగ్ధ, జగపతిబాబు, నాగశౌర్య, ఐశ్వర్య, ఊర్వశి, ప్రియదర్శి పులికొండ తదితరులు
సంగీతం: మిక్కీ జే మేయర్‌
సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌
డైలాగులు: లక్ష్మీ భూపాల
కూర్పు: జునైద్‌ సిద్ధిఖి
నిర్మాణ సంస్థ: సురేశ్ ప్రొడక్షన్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నందినీ రెడ్డి
విడుదల తేదీ: 05-07-2019

పెళ్లి త‌ర్వాత స‌మంత ఎంచుకొంటున్న క‌థ‌ల తీరే మారిపోయింది.  ఒక‌ప్పుడు క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల క‌థానాయిక అనిపించుకొన్న ఆమె.. ఇటీవ‌ల ఆ పంథాని మార్చింది. న‌ట‌న‌కి ప్రాధాన్య‌మున్న పాత్ర‌లు... క‌థాబ‌ల‌మున్న  చిత్రాల్లో ఒదిగిపోయే ప్ర‌య‌త్నం చేస్తోంది.  సినిమా మొత్తాన్ని త‌న  భుజాల‌పై వేసుకొని న‌డిపించ‌గ‌ల సామ‌ర్థ్యం ఉంద‌ని ఆమె ఇటీవ‌ల కాలంలో చేస్తున్న చిత్రాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. అలా ఆమె ఇటీవ‌ల న‌టించిన  మ‌రో నాయికా ప్రధాన‌మైన చిత్ర‌మే `ఓ బేబీ`.  కొరియ‌న్ చిత్రం `మిస్ గ్రానీ` ఆధారంగా బి.వి.నందినిరెడ్డి తెర‌కెక్కించారు.  మ‌రి `ఓ బేబీ` ఎలా ఉంది?   స‌మంత అభిన‌యం ఎలా ఉంది?  తెలుసుకుందాం ప‌దండి.. 


* క‌థేంటంటే..
సావిత్రి అలియాస్ బేబీ (ల‌క్ష్మి) డెబ్బ‌య్యేళ్ల బామ్మ‌. చిన్న‌ప్ప‌ట్నుంచీ ఎన్నో క‌ష్టాలు ప‌డిన ఆమె త‌న బాల్య‌మిత్రుడు చంటి (రాజేంద్రప్ర‌సాద్‌)తో క‌లిసి క్యాంటీన్ న‌డుపుతుంటుంది.  ఆమెకి ప్రేమ ఎక్కువే, చాద‌స్త‌మూ ఎక్కువే. దాంతో ఇంట్లోవాళ్లు ఇబ్బందిప‌డుతుంటారు.  కోడ‌లు గుండెపోటుకి గుర‌వుతుంది. అది త‌న వ‌ల్లే అని తెలిశాక ఇంటి నుంచి వెళ్లిపోతుంది.  బామ్మ‌గా బ‌య‌టికి వెళ్లిపోయిన ఆమె పాతికేళ్ల ప‌డుచు అమ్మాయి స్వాతి (స‌మంత‌)గా  మారిపోయి తిరిగొస్తుంది. అదెలా సాధ్య‌మైంది?  బేబీ బామ్మ ప‌డుచు అమ్మాయిగా మారాక ఎలాంటి స‌మ‌స్య‌ల్ని ఎదుర్కుంది?   పోగొట్టుకొన్న వ‌య‌సు తిరిగొచ్చాక ఆమె త‌న కోసం ఏం చేసుకుంది?  కుటుంబం కోసం ఏం చేసింది? త‌దితర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే. 


* ఎలా ఉందంటే..
ఆస‌క్తి రేకెత్తించే క‌థ ఇది.  కొరియ‌న్ చిత్రం `మిస్ గ్రానీ` దీనికి మూలం.  ఇలాంటి క‌థ‌ల్ని నేటివిటీకి అనుగుణంగా తీర్చిదిద్ద‌డం క‌త్తిమీద సాములాంటి వ్య‌వ‌హారం. ద‌ర్శ‌కురాలు బి.వి.నందినిరెడ్డి  ఆ స‌వాల్‌ని విజ‌య‌వంతంగా అధిగ‌మించింది. మంచి క‌స‌ర‌త్తులు చేసి...  అచ్చ‌మైన తెలుగు సినిమాలాగే క‌థ‌, క‌థనాల్ని తీర్చిదిద్దింది.  మాన‌వీయ విలువ‌లున్న క‌థ ఇది. వృద్ధుల్ని మ‌నం ఎలా చూస్తున్నాం?  కుటుంబ‌మే స‌ర్వ‌స్వంగా భావించిన క‌ష్ట‌ప‌డిన వాళ్లు కోల్పోయిన క‌ల‌లు, ల‌క్ష్యాలు చాలా ఉంటాయ‌నే విష‌యాల్ని గుర్తు చేస్తుందీ చిత్రం. అలాగ‌ని ఇదేదో సీరియ‌స్ సినిమా కాదు. ఆద్యంతం వినోదం పండిస్తుంది. అదే స‌మ‌యంలో గుండెల్ని బ‌రువెక్కించే భావోద్వేగాలూ పుడ‌తాయి.  బామ్మ కాస్త ప‌డుచు భామ‌గా మారిపోయే వ్య‌వ‌హారం బోలెడంత ఆస‌క్తి రేకెత్తిస్తే... మారిపోయాక  ఎదురయ్యే స‌మ‌స్య‌లతో అంతే హాస్యం పండుతుంది. కాసేపు న‌వ్విస్తూ, మ‌రికాసేపు కంట త‌డి పెట్టిస్తూ సినిమా ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. స‌మంత ఎంట్రీ ఇచ్చాకే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. అప్ప‌టివ‌ర‌కు అత్తాకోడ‌ళ్ల  మెలోడ్రామ‌ని త‌ల‌పిస్తాయి స‌న్నివేశాలు.  ఆకారంలో భామ... ఆలోచ‌న‌లు మాత్రం బామ్మ అయిన‌ప్పుడు చుట్టూ వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందో, వాటి నుంచే వినోదం పండించే ప్ర‌య‌త్నం చేశారు నందినిరెడ్డి. దాంతో ఆద్యంతం న‌వ్వులు పండుతాయి. అయితే  ద్వితీయార్థంలోకి వ‌చ్చేస‌రికి భావోద్వేగాల మోతాదు ఎక్కువైంది.  క‌థ‌నం ప‌రంగా కూడా మ‌రికొన్ని క‌స‌ర‌త్తులు చేయాల్సిందేమో అనిపిస్తుంది. అయితే వృద్ధుల విష‌యంలో మ‌నం ఎలా ఆలోచిస్తున్నామో, వాళ్ల విలువ ఏమిటో చెబుతూ తీర్చిదిద్దిన స‌న్నివేశాలు ద్వితీయార్థానికి బ‌లాన్నిచ్చాయి. వినోదం, భావోద్వేగాల మేళ‌వింపుతో రూపొందిన ఓ మంచి సినిమా `ఓ బేబీ`. 

* ఎవ‌రెలా చేశారంటే..
పాత్ర‌ల‌కి త‌గ్గ న‌టీన‌టులు దొరికితే ఆ ప్ర‌భావం సినిమాపై ఎలా ఉంటుందో ఈ సినిమా చాటి చెబుతుంది. స‌మంత త‌న పాత్ర‌లో జీవించింది. ఆమె హావ‌భావాలు, అభిన‌యం, సంభాష‌ణ‌లు చెప్పిన తీరు ఆక‌ట్టుకుంటుంది. ఆమె త‌ప్ప మ‌రొక ప్ర‌త్యామ్నాయం లేర‌నేలా ఆ పాత్ర‌లో ఒదిగిపోయారు. బేబీ స్వాతిగా మారాక వ‌చ్చే తొలి స‌న్నివేశాల్లో స‌మంత అభిన‌యం చిత్రానికే హైలెట్‌. అచ్చం ల‌క్ష్మీలా న‌డుస్తూ, ఆమెలా హావ‌భావాలు ప‌లికించిన తీరు ఆక‌ట్టుకుంటుంది. ల‌క్ష్మీ  కూడా బేబీ పాత్ర‌పై త‌న‌దైన ముద్ర వేశారు. ఆరంభంలో మాత్ర‌మే ఆమె క‌నిపించినా... సినిమా మొత్తం ఉన్న భావన క‌లుగుతుందంటే ఆ పాత్రపై ఆమె ప్ర‌భావం ఎలాంటిదో అర్థం చేసుకోవ‌చ్చు. రాజేంద్ర‌ప్ర‌సాద్‌, రావు ర‌మేష్  అల‌వాటైన పాత్రల్లో క‌నిపించినా... అందులోనూ ఎంతో లోతుని చూపించారు. నాగ‌శౌర్య, ప్ర‌గ‌తి ప‌రిధి మేర‌కు  న‌టించారు. బాల‌నటుడు తేజ ఇందులో ఓకీల‌క‌పాత్రలో క‌నిపిస్తారు. జ‌గ‌ప‌తిబాబు, అడ‌విశేష్‌తో పాటు, ప‌తాక స‌న్నివేశాల్లో ఒక న‌టుడు త‌ళుక్కున మెరుస్తారు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. రిచ‌ర్డ్‌ప్ర‌సాద్ కెమెరా ప‌నిత‌నం చాలా బాగుంది. ప్ర‌తీ స‌న్నివేశాన్నీ అందంగా చూపించారు. మిక్కీ జె.మేయ‌ర్ సంగీతం ఆక‌ట్టుకుంటుంది. రెండు పాట‌లు గుర్తు పెట్టుకునేలా ఉంటాయి. నేప‌థ్య సంగీతం కూడా బాగా కుదిరింది. ల‌క్ష్మీభూపాల మాట‌లు ఎంత వినోదం పండించాయో, అంత‌గా గుండెల్ని బ‌రువెక్కిస్తాయి. సామెత‌ల్ని జోడిస్తూ  బామ్మ‌ల ఆలోచ‌న‌ల‌కి త‌గ్గ‌ట్టుగా సంభాష‌ణ‌ల్ని రాసిన విధానం మెప్పిస్తుంది. ద‌ర్శ‌కురాలిగా నందినిరెడ్డి ప్ర‌తిభ మ‌రోసారి చాటి చెబుతుందీ చిత్రం.  వినోదం, భావోద్వేగాల్ని పండించ‌డంలో ఆమెకున్న ప‌ట్టు ఈ చిత్రం మ‌రోమారు నిరూపించింది. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. 

బ‌లాలు
+ స‌మంత న‌ట‌న
+ క‌థ‌
+ వినోదం, భావోద్వేగాలు
+ మాట‌లు
పాత్రల‌కి త‌గ్గ న‌టీన‌టులు

బ‌ల‌హీన‌త‌లు
- ద్వితీయార్ధం సుదీర్ఘంగా సాగ‌డం

* చివ‌రిగా..
పొరుగు క‌థ‌లు త‌ర‌చుగా మ‌న తెర‌పైకొస్తుంటాయి. వాటిలో ఆత్మ ఉన్న‌దున్న‌ట్టుగా మ‌న సినిమాల్లోకి త‌ర్జుమా అయ్యేది కొన్నిసార్లు మాత్ర‌మే. `ఊపిరి` త‌ర్వాత...  ఆ త‌ర‌హాలో  ఇది మ‌న క‌థే అనిపించిన మ‌రో రీమేక్ సినిమా `ఓ బేబీ`. ఇందులోని క‌థ మొద‌లుకొని... పాత్ర‌లు, అభిన‌యం, వినోదం, భావోద్వేగాలు ఇలా అన్నీ కూడా `మ‌న` అనే భావ‌న‌కి గురిచేస్తాయి. కాసేపు న‌వ్విస్తూ, కాసేపు హృద‌యాల్ని మెలిపెడుతూ...  ఒక అంద‌మైన అనుభ‌వానికి గురిచేసే చిత్ర‌మిది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.