రివ్యూ:గ‌ద్దల‌కొండ గ‌ణేష్‌
సినిమా: గ‌ద్దల‌కొండ గ‌ణేష్‌
న‌టీన‌టులు: వ‌రుణ్ తేజ్‌, అధ‌ర్వ ముర‌ళి, పూజా హెగ్డే, మృణాళిని ర‌వి, స‌త్య త‌దిత‌రులు
ఛాయాగ్రహ‌ణం: ఐనాంక బోస్
పోరాటాలు: వెంక‌ట్‌
క‌ళ‌: అవినాష్ కొల్ల‌
కూర్పు: ఛోటా కె.ప్రసాద్‌
సంగీతం: మిక్కీ జె.మేయ‌ర్‌
నిర్మాత‌లు: రామ్ ఆచంట‌, గోపీ ఆచంట‌
స్క్రీన్‌ ప్లే: మ‌ధు శ్రీనివాస్‌, మిథున్ చైత‌న్య
ద‌ర్శక‌త్వం: హ‌రీష్ శంక‌ర్‌


తన శైలి సినిమాలే చేయ‌డం కాదు... ద‌ర్శ‌కుల మార్క్ సినిమాల్లోనూ తాను ఒదిగిపోవాల‌నేది వ‌రుణ్ తేజ్ ఆలోచ‌న‌. అందుకే ప్ర‌తిసారీ ఓ కొత్త ర‌క‌మైన క‌థ‌లో న‌టిస్తుంటారు. ఈసారి ఆయ‌న ప్ర‌తినాయ‌క ఛాయ‌ల‌తో కూడిన పాత్ర‌తో `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌` చేశారు. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన `జిగ‌ర్‌తాండ‌`కి రీమేక్ ఇది. `గ‌బ్బ‌ర్‌సింగ్‌` త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్ చేసిన మ‌రో రీమేక్ చిత్రమిది. `వాల్మీకి` పేరుతో సెట్స్‌పైకి వెళ్లింది. విడుద‌ల‌కి ముందు రోజే `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌`గా పేరు మార్చుకుంది. `వాల్మీకి` పేరుపై అభ్యంత‌రాలు వ్య‌క్తం కావ‌డంతో పేరు మారింది. ప్ర‌తినాయ‌క పాత్ర‌లో వ‌రుణ్‌తేజ్ న‌టించ‌డం.. ఆయ‌న గెట‌ప్పు, హావ‌భావాలు కొత్త‌గా ఉండ‌టం...  తొలిసారి వ‌రుణ్‌తేజ్‌తో హ‌రీష్ సినిమా తీయ‌డం... ఆక‌ట్టుకున్న ప్ర‌చార చిత్రాలు సినిమాపై అంచ‌నాల్ని పెంచేశాయి. మ‌రి అందుకు త‌గ్గ‌ట్టుగానే సినిమా ఉందో లేదో తెలుసుకుందాం ప‌దండి...

క‌థ:
ద‌ర్శ‌కుడు కావాల‌నేది అభిలాష్ (అధ‌ర్వ‌) ఆశ‌యం. అందుకోసం చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌నిచేస్తుంటాడు. ఎన్నో అవ‌మానాల్ని ఎదుర్కుంటాడు. అత‌ని త‌ప‌నని చూసి ద‌ర్శ‌కుడిగా అవ‌కాశం ఇస్తాడు ఓ నిర్మాత‌. నా సినిమాలో విల‌నే హీరో కావాల‌ని చెప్పుకునే అభిలాష్ త‌న తొలి చిత్రం కోసం ఓ గ్యాంగ్‌స్ట‌ర్ క‌థ‌ని రాయాల‌ని సంకల్పిస్తాడు. అందుకోసం గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ అలియాస్ గ‌ని (వ‌రుణ్‌తేజ్‌)ని టార్గెట్‌గా చేసుకుంటాడు. అత‌ని జీవితం గురించి తెలుసుకునేందుకు గ‌ద్ద‌ల‌కొండ‌కి వెళ‌తాడు. అక్క‌డ త‌న చిన్న‌నాటి స్నేహితుడైన చింత‌పండు కొండ‌మ‌ల్లి (స‌త్య‌)తో క‌లిసి గ్యాంగ్‌స్ట‌ర్ గ‌ణేష్ జీవితం గురించి తెలుసుకునే ప్ర‌య‌త్నం మొద‌లుపెడ‌తాడు. ఈ క్ర‌మంలో గ‌ణేష్ గురించి అభికి ఎలాంటి విష‌యాలు తెలిశాయి? ఆయ‌న గురించి రాసుకొన్న క‌థ‌లో హీరో ఎవ‌రు? ఆ సినిమా విడుద‌లైయ్యాక గ‌ణేష్ జీవితం ఎలా మారింది? త‌దిత‌ర విష‌యాల‌తో మిగ‌తా సినిమా సాగుతుంది.
విశ్లేషణ:
సొంతంగా క‌థ రాసుకొని సినిమా తీయ‌డంలో ఎన్ని స‌వాళ్లుంటాయో.. రీమేక్ క‌థ‌ని తెర‌కెక్కించ‌డంలోనూ అన్నే స‌వాళ్లుంటాయి. ఇప్ప‌టికే `గ‌బ్బ‌ర్‌సింగ్‌`తో అనుభ‌వాన్ని సొంతం చేసుకున్నాడు హ‌రీష్‌శంక‌ర్‌.  అయితే ఆ సినిమాకి బోలెడ‌న్ని మార్పులు చేసిన ఆయ‌న.. ఈసారి మాత్రం ఎక్కువ‌గా మార్పులు చేయ‌కుండా పాత్రీక‌ర‌ణ‌ల‌పైనే దృష్టిపెట్టారు. నేటివిటీకి త‌గ్గ‌ట్టుగా కొన్ని మార్పులు... వ‌రుణ్‌తేజ్‌కి త‌గ్గ‌ట్టుగా ఆయ‌న పాత్రని తీర్చిదిద్ది య‌ధాత‌థంగా `జిగ‌ర్‌తాండ‌` క‌థ‌ని చెప్పాడు. ఆ ప్ర‌య‌త్నం సినిమాకి కలిసొచ్చింది. గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌గా వ‌రుణ్‌తేజ్ విజృంభ‌ణ ఒక‌వైపు... వాణిజ్యాంశాల‌తో కూడిన క‌థ, క‌థ‌నాలు మ‌రోవైపు వెర‌సి ఆద్యంతం ఆక‌ట్టుకునేలా సాగింది సినిమా. ఆరంభ స‌న్నివేశాలు ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ చేసే దందాలు, శ‌త్రువులు వేసే ఎత్తుల‌కి పైఎత్తులు వేయ‌డం, ఆయ‌న  జీవితం గురించి కొండ‌మ‌ల్లితో క‌లిసి అభి తెలుసుకొనే ప్ర‌య‌త్నంతో ప్ర‌థ‌మార్థం సాగుతుంది. స‌న్నివేశాల్లో భాగంగానే హాస్యం జోడించ‌డంతో సినిమా స‌ర‌దాగా సాగుతుంది. విరామం స‌మ‌యంలో వ‌చ్చే మ‌లుపు ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. ద్వితీయార్థంలోనే అస‌లు క‌థ ఉంటుంది. క‌థ‌, క‌థ‌నాల‌తో పాటు...  సంద‌ర్భోచిత హాస్యం, భావోద్వేగాలకి కూడా చోటిచ్చారు. గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ క‌థ‌లో క‌థానాయ‌కుడు ఎవ‌ర‌నేది ఖ‌రార‌య్యే సంద‌ర్భం... సినిమాకోసం ట్రైనింగ్ తీసుకొనే ప్ర‌క్రియ‌... ఆ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. గ‌ణేష్‌, శ్రీదేవి (పూజాహెగ్డే)ల ఫ్లాష్‌బ్యాక్ కూడా చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. వాళ్లిద్ద‌రి ప్రేమ‌క‌థ‌తో పాటు... ఎల్లువొచ్చి గోదార‌మ్మ పాట ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తాయి. ప‌తాక స‌న్నివేశాలు కూడా ఆక‌ట్టుకునేలా తీర్చిదిద్దారు. నితిన్‌, సుకుమార్ అతిథి పాత్ర‌ల్లో మెరుస్తారు. అయితే అంత‌కుముందు వ‌చ్చే ప్రి క్లైమాక్స్ స‌న్నివేశాలు మాత్రం సాగ‌దీత‌లా అనిపిస్తాయి.


న‌టీన‌టులు... సాంకేతిక‌త:
వ‌రుణ్‌తేజ్ న‌ట‌న సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌గా ఆయ‌న ఒదిగిపోయారు. ప్ర‌త్యేక‌మైన ఆ గెట‌ప్పు, హావ‌భావాలు చాలా బాగా కుదిరాయి. ఫ్లాష్‌బ్యాక్‌లో వ‌చ్చే స‌న్నివేశాల్లో చిరంజీవిని గుర్తు చేస్తారు. తెలంగాణ యాస‌లో సంభాష‌ణ‌లు చెప్పిన విధానం కూడా మెప్పిస్తుంది. పూజాహెగ్డే క‌నిపించేది కొన్ని స‌న్నివేశాల్లోనే అయినా... ఆమె త‌న అందంతో ఆక‌ట్టుకుంటుంది. ఎల్లువొచ్చి గోదార‌మ్మ... రీమిక్స్ పాటలో వ‌రుణ్‌, పూజా చేసిన సంద‌డి ఆక‌ట్టుకుంటుంది.  అధ‌ర్వ, మృణాళిని ర‌వి పాత్ర‌లు కూడా ఆక‌ట్టుకుంటాయి. ద‌ర్శ‌కుడిగా ఎద‌గాల‌నే త‌ప‌న ఉన్న యువ‌కుడి పాత్ర‌లో అధ‌ర్వ మెప్పిస్తాడు.  స‌త్య‌, బ్ర‌హ్మాజీ, త‌నికెళ్ల భ‌ర‌ణి, అన్న‌పూర్ణ‌మ్మ, ర‌చ్చ‌ర‌వి, శ‌త్రు త‌దిత‌రుల పాత్ర‌లు కూడా ఆక‌ట్టుకుంటాయి. డింపుల్ హ‌యాతి చేసిన ప్ర‌త్యేక‌గీతం, ఆమె అందం  సూప‌ర్‌హిట్టు అనిపించేలా ఉంది. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. ఛాయాగ్రాహ‌కుడు ఐనాంక బోస్  గ్యాంగ్‌స్ట‌ర్ సినిమాకి త‌గ్గ‌ట్టుగా ప్ర‌త్యేక‌మైన క‌లరింగ్‌, మూడ్‌తో త‌న కెమెరా ప‌నిత‌నాన్ని ప్ర‌ద‌ర్శించారు. మిక్కీ జె.మేయ‌ర్ నేప‌థ్య సంగీతం మెప్పిస్తుంది.  ఎడిటింగ్ ప‌రంగా మాత్రం చాలా చోట్ల కత్తెర‌కి ప‌నిచెప్పాల్సింది. 14 రీల్స్ ప్ల‌స్  సంస్థ నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి.  ద‌ర్శ‌కుడిగా హ‌రీష్‌శంక‌ర్ ప‌నితీరు మెప్పిస్తుంది. ర‌చ‌న‌లో ఆయ‌న‌కున్న బ‌లం మ‌రోసారి ఈ సినిమాతో రుజువైంది. `ఇదివ‌ర‌కు సుఖంగా బ‌త‌కాల‌నుకొనేవాళ్లు.. ఇప్పుడు సుఖంగా చస్తే చాల‌నుకొంటున్నారు`, `మ‌న చేతుల్లో ఉత్త గీత‌లే ఉంట‌యి.. రాత‌లు ఉండ‌యి`లాంటి సంభాష‌ణ‌లు చ‌ప్ప‌ట్లు కొట్టిస్తాయి. మాస్ ప్రేక్ష‌కుల‌కు త‌గ్గ‌ట్టుగా హ‌రీష్ శంక‌ర్ త‌న మార్క్ మార్పులు చేయ‌డం సినిమాకి క‌లిసొచ్చింది.

చివ‌రిగా...
అక్క‌డ‌క్క‌డా సాగ‌దీత‌గా అనిపించే స‌న్నివేశాలు మిన‌హా... స‌మ‌తూక‌మైన క‌థ‌, పాత్ర‌లతో  ఆద్యంతం వినోదం పంచే సినిమా `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌`. మాస్ ప్రేక్ష‌కుల‌కు కావ‌ల్సిన అంశాలన్నీ పుష్క‌లంగా ఉన్నాయి. ఈ క‌థ‌లో సినిమా గొప్ప‌త‌నం గురించి చెప్పిన విష‌యాలు కూడా అల‌రిస్తాయి. ఓ కొత్త నేప‌థ్యంలో సాగే స‌రికొత్త గ్యాంగ్‌స్ట‌ర్ సినిమా ఇది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.