రివ్యూ: వినయ విధేయ రామ
రివ్యూ: వినయ విధేయ రామ
చిత్రం: వినయ విధేయ రామ
నటీనటులు: రామ్‌చరణ్‌, కియారా అడ్వాణీ, వివేక్‌ ఒబెరాయ్‌, ప్రశాంత్‌, ఆర్యన్‌రాజేష్‌, స్నేహ, మధుమిత, రవి వర్మ, హిమజ, హరీష్‌ ఉత్తమన్‌, మహేష్‌ మంజ్రేకర్‌, మధునందన్‌ తదితరులు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్‌
సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ, ఆర్థర్‌ ఎ.విల్సన్‌
ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు
నిర్మాత: డీవీవీ దానయ్య
దర్శకత్వం: బోయపాటి శ్రీను
సంస్థ: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌
విడుదల 11-01-2019


రామ్‌చ‌ర‌ణ్ రియ‌లిస్టిక్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో `రంగ‌స్థ‌లం` చూపించింది. ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌ల్లో న‌టించ‌డం కూడా ఆయ‌న‌కి కొట్టిన‌పిండే.  బోయ‌పాటి శ్రీను సినిమాల్లో అయితే  క‌మ‌ర్షియ‌ల్ అంశాలు మెండుగా ఉంటాయి. అవి అభిమానుల్ని మ‌రింతగా మెప్పిస్తుంటాయి. అందుకే ఆయ‌న చిత్రాల్లో న‌టించ‌డానికి అగ్ర క‌థానాయ‌కులు ఆస‌క్తి చూపుతుంటారు. మాస్ క‌థానాయ‌కుడిగా, మాస్ ద‌ర్శ‌కుడిగా ప్రేక్ష‌కుల‌పై త‌మ‌దైన ముద్ర వేసిన రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి క‌ల‌యిక‌లో సినిమా అన‌గానే అంచ‌నాలు మొద‌లైపోయాయి. ఆ చిత్రం సంక్రాంతి సంద‌డిలో భాగంగా విడుద‌ల‌వడం... ముందే ప్ర‌చార చిత్రాలు ఆస‌క్తి రేకెత్తించ‌డంతో  సినిమాకి ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఏర్ప‌డింది. మ‌రి చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం ప‌దండి...

* క‌థేంటంటే...
రామ (రామ్‌చ‌ర‌ణ్‌)కి త‌న న‌లుగురు అన్న‌య్య‌లే ప్ర‌పంచం. వాళ్ల‌కి ఏం జ‌రిగినా త‌ట్టుకోలేడు. రామ  పెద్ద‌న్న‌య్య భువ‌న్‌కుమార్ (ప్ర‌శాంత్‌) రాష్ర్ట ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. విశాఖ ఉప ఎన్నిక‌ల్లో భాగంగా విధులు నిర్వ‌ర్తిస్తున్న‌ప్పుడు ప్ర‌తిప‌క్ష నాయ‌కుడైన పందెం ప‌ర‌శురామ్ (ముఖేష్ రుషి)తో వైరం ఏర్ప‌డుతుంది.  దాంతో పందెం ప‌ర‌శురామ్ భువ‌న్‌కుమార్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. అత‌న్ని రామ ఎలా ఎదుర్కొని త‌న కుటుంబాన్ని కాపాడుకొన్నాడు? బిహార్‌కి చెందిన రాజాభాయ్ (వివేక్ ఒబెరాయ్‌)తో రామ కుటుంబానికి శత్రుత్వం ఏర్ప‌డ్డాక ఏం జ‌రిగింది? అక్క‌డ ప్ర‌భుత్వాన్నే గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న రాజాభాయ్ అరాచ‌కాన్ని రామ్ ఎలా తిప్పికొట్టాడన్న‌ది తెర‌పైనే చూడాలి.


* ఎలా ఉందంటే..
ఈ చిత్రం రెండు ఛాయాల్లో సాగుతుంది. ఓ వైపు పూర్తి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌గా సాగితే, మరోవైపు త‌న అన్న‌కు, కుటుంబానికి జ‌రిగిన అన్యాయంపై ఒక త‌మ్ముడు చేసే పోరాటం ఇందులో కనిపిస్తుంది. బోయ‌పాటి చిత్రాల్లో స‌హ‌జంగా యాక్ష‌న్ మోతాదు ఎక్కువ‌గా ఉంటుంది. అదే స‌మ‌యంలో కుటుంబ బంధాలు, అనుబంధాల‌ను చూపిస్తారు. ఈసారి కూడా అదే ఫార్ములాను ఆయ‌న ఎంచుకున్నారు. అయితే, ఈ సినిమా కోసం అవి రెండూ ఇంకాస్త పెరిగాయి. ఒక కుటుంబంలో అన్నావ‌దిన‌లు, వారి పిల్ల‌ల మ‌ధ్య ఎలాంటి వాతావ‌ర‌ణం ఉంటుందో అదంతా తెర‌పై చాలా అందంగా, రిచ్‌గా చూపించారు. ఆయా స‌న్నివేశాల‌న్నీ ఒక హిందీ సినిమా చూసిన ఫీలింగ్ క‌లుగుతుంది. ప్ర‌తి ఫ్రేమ్‌లోనూ ప‌ది, ప‌దిహేను మంది క‌న‌ప‌డ‌తారు. ఇక యాక్ష‌న్ ఎపిసోడ్ల‌కు వ‌చ్చేస‌రికి మ‌రో స్థాయిలో చూపించే ప్ర‌య‌త్నం చేశారు బోయ‌పాటి. అటు ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కు, ఇటు మాస్ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా ఉండాల‌న్న‌ది బోయ‌పాటి ప్ర‌య‌త్నంగా క‌నిపిస్తుంది. కియారా అడ్వాణీతో కొన్ని స‌న్నివేశాలు, ఆఫీస్‌లో జ‌రిగే ఎపిసోడ్ల‌లో ఎంట‌ర్‌టైన్‌మెంట్ అల‌రిస్తుంది. అయితే, ఈ యాక్ష‌న్ ఎపిసోడ్ల మూలంగా క‌థ బాగా న‌లిగిపోయింది. కొన్ని యాక్ష‌న్ సీక్వెన్స్ మ‌ధ్య క‌థ‌ను పేర్చుకుంటూ వెళ్లాడేమో అనిపిస్తుంది. బోయ‌పాటి శైలిలోనే క‌థ ప్రారంభ‌మై చాలా మాసీగా సాగుతుంది. హీరోయిజం ఎలివేట్ చేసే స‌న్నివేశాలు ప‌తాక స్థాయిలో ఉంటాయి. యాక్ష‌న్ సీక్వెన్స్ ముందు వ‌చ్చే స‌న్నివేశాల్లో భావోద్వేగాలు బాగా పండించాడు. విరామం వ‌ర‌కూ ఈ సినిమాలో క‌థే ఉండదు. కానీ, దాని ముందు వ‌చ్చే స‌న్నివేశాలు మాస్‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటాయి.


* ఎవ‌రెలా చేశారంటే..
బోయ‌పాటి సినిమాల్లో యాక్ష‌న్ మోతాదు కాస్త ఎక్కువ‌గానే ఉంటుంది. ఈ సినిమాలో ఆ డోసు మ‌రింత పెరిగింది. దాని మ‌ధ్య‌లో  క‌థే  న‌లిగిపోయింది. అస‌లు ద్వితీయార్థం వ‌ర‌కు సినిమా క‌థ‌లోకే వెళ్ల‌దు. బోయ‌పాటి మార్క్ కుటుంబ నేప‌థ్యంతో తొలి స‌గ‌భాగం వ‌ర‌కు స‌ర‌దాగా కాల‌క్షేప‌మ‌వుతుంది.  అప్ప‌ట్నుంచైనా క‌థ చెప్పారా అంటే అది కూడా జ‌ర‌గ‌లేదు. అస‌లు ఈ సినిమాలో చెప్పుకోత‌గ్గ క‌థ కూడా లేదు.  దాంతో ద‌ర్శ‌కుడు యాక్ష‌న్ ఘ‌ట్టాల్ని, పాట‌ల్ని పేర్చుకుంటూ వెళ్లారు. అవ‌న్నీ కూడా అస‌హ‌జంగా సాగ‌డంతో ఏ ద‌శ‌లోనూ సినిమా ఆస‌క్తి రేకెత్తించ‌దు. రాజాభాయ్‌, రామ్‌ల మ‌ధ్య యుద్ధం, విధ్వంస‌మే ఆసాంతం సాగుతుంటుంది. ఆ యుద్ధం వెన‌క భావోద్వేగాలైనా పండాయా అంటే లేదు. ప్ర‌తి స‌న్నివేశం డ్ర‌మ‌టిక్‌గా సాగుతుంటుంది. ఉన్నంత‌లో ప్ర‌థ‌మార్థంలో పెళ్లి చూపులు, పందెం ప‌ర‌శురామ్‌తో గొడ‌వ ఎపిసోడ్ మాత్ర‌మే ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తాయి. అక్క‌డే కాస్త వినోదం పండింది. మిగిలిన స‌న్నివేశాల‌న్నీ కూడా మితిమీరిన  హింస‌, ర‌క్త‌పాతం చుట్టూనే సాగుతాయి. ప్ర‌తి స‌న్నివేశం హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా ఉంటుంది.  అభిమానుల్ని దృష్టిలో ఉంచుకొనే సినిమా తీసిన‌ట్టు అనిపిస్తుంది. ద్వితీయార్థంలో ప్రి క్లైమాక్స్‌కి ముందు వ‌చ్చే యాక్ష‌న్ ఘ‌ట్టాల్లో అయితే త‌ల‌లు ఎగిరెగిరి ప‌డుతుంటాయి.  ఒక్క క‌థానాయ‌కుడు వంద‌ల మందిని అంతం చేస్తూనే ఉంటాడు. రియ‌లిస్టిక్ సినిమాల హ‌వా న‌డుస్తున్న ఈ స‌మ‌యంలో ఇలాంటి స‌న్నివేశాలు ప్రేక్ష‌కుడికి మింగుడుప‌డ‌టం అంత సుల‌భం కాదు.  ఈ క‌థ రామ్‌చ‌ర‌ణ్‌లోని ఫైట‌ర్‌, డ్యాన్స‌ర్‌ని మ‌రోమారు తెర‌పై బాగా చూపిస్తుంది.  
 * నటీన‌టులు.. సాంకేతిక‌త‌
రామ్‌చ‌ర‌ణ్ ద‌ర్శ‌కుల ఆలోచ‌న‌ల్లో ఒదిగిపోతుంటారని మ‌రోమారు రుజువు చేసిన చిత్ర‌మిది. రంగ‌స్థ‌లంలో ఎంత స‌హ‌జంగా న‌టించారో... ఈ సినిమాలో అంత ఎగ్రెసివ్‌గా క‌నిపించారు. ఆయ‌న చేసిన పోరాట ఘ‌ట్టాలే ఈ సినిమాకి హైలెట్‌. తొలి స‌గ‌భాగం సినిమాలో కుటుంబ అనుబంధాల్ని బాగా పండించాడు చ‌ర‌ణ్‌. ద్వితీయార్థంలో త‌న యాక్ష‌న్ అవ‌తారాన్ని చూపించారు. డ్యాన్సుల్లోనూ ఆయ‌న ప్ర‌తిభ క‌నిపిస్తుంది. కియారా అడ్వాణీది చెప్పుకోద‌గ్గ పాత్రేమీ కాదు.  కానీ ఉన్నంత‌లో అందంగా క‌నిపిస్తుంది. ఆమె డ్యాన్స్ కూడా మెప్పిస్తుంది. వివేక్ ఒబెరాయ్ ప్ర‌తినాయ‌క పాత్ర‌లో చ‌క్క‌గా న‌టించాడు. హీరోయిజం ఎలివేట్ కావ‌డానికి వివేక్ చేసిన విల‌నిజం ప్ర‌ధాన కార‌ణం. ప్ర‌శాంత్‌, స్నేహ‌లు అన్నా వ‌దిన‌లుగా కీల‌క‌మైన పాత్ర‌లు పోషించారు. మ‌హిళా సంఘం నాయకురాలిగా, క‌థానాయిక త‌ల్లిగా హేమ, క‌థానాయిక తండ్రిగా పృథ్వీ న‌వ్విస్తారు. ఆర్య‌న్ రాజేష్‌, ముఖేష్ రుషి, హ‌రీష్ ఉత్త‌మ‌న్ త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. ప్ర‌కాష్  క‌ళ‌, ఆర్ధ‌ర్ ఎ.విల్స‌న్‌, రిషి పంజాబీ కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం ప‌ర్వాలేద‌నిపిస్తుంది. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. క‌థ‌కుడిగా, ద‌ర్శ‌కుడిగా బోయ‌పాటి శ్రీను ప‌నిత‌నం అంతంగా మెప్పించ‌దు. సంభాష‌ణ‌లు ప‌ర్వాలేద‌నిపించినా... క‌థ‌, క‌థ‌నాల ప‌రంగా పెద్ద‌గా ప్ర‌భావం చూపించలేక‌పోయారు.  

బ‌లాలు

+ యాక్ష‌న్ ఎపిసోడ్లు
+ రామ్‌చ‌ర‌ణ్ స్టెప్పులు
+ మాస్ ఎలిమెంట్స్‌

బ‌ల‌హీన‌త‌లు
+ మితిమీరిన హింస‌
+ క‌థ‌లో బ‌లం లేక‌పోవ‌డం

* చివ‌రిగా..
వాణిజ్యాంశాల‌తో సినిమా తీయ‌డం అవ‌స‌ర‌మే కానీ...  అవి క‌థ‌, క‌థ‌నాల్ని కూడా డామినేట్ చేసే స్థాయిలో ఉండ‌కూడ‌దు. హీరోయిజం కోస‌మ‌నీ, అభిమానుల్ని మెప్పించ‌డం కోస‌మ‌నీ క‌థ‌ని విడిచి సాము చేసిన ప్ర‌య‌త్నం ఈ సినిమాలో స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ప్ర‌థ‌మార్థంలో కొన్ని వినోదాత్మ‌క సన్నివేశాలు, హీరోయిజం... ద్వితీయార్థంలో  యాక్ష‌న్ ఘ‌ట్టాలతో కాల‌క్షేపం చేయించే ఒక స‌గ‌టు క‌మ‌ర్షియ‌ల్ చిత్ర‌మిది. 

సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.