* మాయల కుర్రాడు... మనసున్న వాడు!
ఓ కుర్రాడు వెండితెరపై ఒకే పాత్రను 10 ఏళ్ల పాటు పోషించాడు... అదే పాత్రతో 8 సూపర్ హిట్ చిత్రాలు చేశాడు... అతడెవరో తెలుసా? డేనియల్ రాడ్‌క్లిఫ్. అతడి అసలు పేరు కన్నా అతడు పోషించిన పాత్ర పేరుతోనే అతడు అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. ఆ పాత్రే... ‘హ్యారీపాటర్’. డేనియల్ జాకబ్ రాడ్క్లిఫ్గా 1989 జులై 23న పుట్టిన ఇతడు ‘హ్యారీపాటర్’ కన్నా ముందుగానే వెండితెరకు పరిచయమయ్యాడు. అంతకన్నా ముందు టీవీల్లోను, నాటకాల్లోనూ మంచి బాల నటుడిగా పేరు పొందాడు. అమ్మా, నాన్నా ఇద్దరూ కూడా వారి చిన్నతనంలోనే నటులుగా ఉండడంతో డేనియల్‌కి ఐదేళ్లకే నటించాలనే కోరిక పుట్టింది. పదేళ్లకల్లా బీబీసీ వాళ్లు తీసిన టీవీ చిత్రం ‘డేవిడ్ కాపర్ఫీల్డ్’లో నటించాడు. సినిమా నటుడిగా 2001లో వచ్చిన ‘ద టైలర్ ఆఫ్ పనామా’లో కనిపించాడు. పదకొండేళ్ల వయసులో ‘హ్యారీపాటర్ అండ్ ద ఫిలాసఫర్స్ స్టోన్’తో మొదలు పెట్టి 2011లో వచ్చిన ‘హ్యారీపాటర్ అండ్ ద డెత్లీ హాలోస్2’ చిత్రం వరకు మొత్తం ఎనిమిది చిత్రాల్లో నటించాడు. మొదటి సినిమాకే అతడు ఏడంకెల పారితోషికాన్ని అందుకున్నాడు. తరువాత అత్యధిక పారితోషికం అందుకున్న బాల నటుడిగా గుర్తింపు పొందాడు. హాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల యువ నటుడిగా రికార్డు సృష్టించాడు. అతడు నటించిన సినిమాలన్నీ కలిసి 780 మిలియన్ డాలర్లు వసూలు చేశాయి. ఓ పక్క సినిమాలతో పాటు వేదికలపై నాటకాలు వేశాడు. హ్యారీపాటర్ సినిమాల తర్వాత ‘ద ఉమన్ ఇన్ బ్లాక్’ (2012), ‘కిల్ యువర్ డార్లింగ్స్’ (2013), ‘విక్టర్ ఫ్రాంకెన్‌స్టీన్’ (2015), ‘నౌ యు సీమీ 2’, ‘ఇంపెరియమ్’ (2016) చిత్రాల్లో యువనటుడిగా ఆకట్టుకున్నాడు. మంచి మనసున్నవాడిగా ఎన్నో సేవాసంస్థలకు భారీ విరాళాలు అందించాడు. పిల్లలకు, యువకులకు వైద్యసేవలందించే కార్యక్రమాలకు ఆర్థిక సాయం చేశాడు. మొదట్లో తాగుడుకు అలవాటైనా, అది వ్యసనంగా మారకుండా బయటపడ్డాడు. ప్రస్తుతం ‘ప్లేమోబిల్: ది మూవీ’, ‘ఎస్కేప్ ఫ్రమ్ ఫ్రీటోరియా’ అనే చిత్రాల్లో నటిస్తున్నారు. ‘జాకబ్ గెర్షన్’ అనే కలంపేరుతో ఎన్నో కవితలు రాశాడు.
|
* గురువుకి తగ్గ శిష్యుడు
కోడి రామకృష్ణ (పుట్టిన రోజు)

శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ. తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో చిత్రాల్ని తెరకెక్కించి పలు విజయాల్ని సొంతం చేసుకొన్నారు. తెలుగులో 150కిపైగా చిత్రాలు తీసి గిన్నిస్ రికార్డుని సొంతం చేసుకొన్న దర్శకదిగ్గజం దాసరి నారాయణరావు శిష్యుడే కోడి రామకృష్ణ. వంద చిత్రాల మైలురాయిని అందుకొని గురువుకి తగ్గ శిష్యుడు అనిపించుకొన్నారు. తెలుగులో వందకిపైగా చిత్రాలు తెరకెక్కించిన నలుగురు దర్శకులు దర్శకుల్లో కోడి రామకృష్ణ ఒకరు కావడం విశేషం. పాలకొల్లులో నరసింహ మూర్తి, చిట్టెమ్మ దంపతులకి జన్మించిన ఆయన ప్రాథమిక విద్యని పాలకొల్లులోనే పూర్తి చేశారు. కళాశాలలో చదువుతున్న సమయంలో పెయింటింగ్ వృత్తిని ఎంచుకొన్నారు. పగలంతా చదువుకొంటూ, రాత్రిళ్లు అజంతా పెయింటింగ్స్ అనే కమర్షియల్ పెయింటింగ్ షాప్‌ని నిర్వహించేవారు. ఆ తర్వాత సినిమాలపై మక్కువతో ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే తండ్రి ‘మన వంశంలో డిగ్రీ వరకు చదువుకొన్నవాళ్లు లేరు. నువ్వు డిగ్రీ పూర్తి చేయాల’ని చెప్పడంతో అప్పట్నుంచి చదువుపైనే దృష్టిపెట్టారు. చిన్నప్పట్నుంచీ కోడి రామకృష్ణకి నాటకాలపై మక్కువ. దాంతో చదువుకొనే రోజుల్లోనే నాటకాల్లో కీలక పాత్రలు పోషిస్తూ పేరు తెచ్చుకొన్నారు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘తాత మనవడు’ చూశాక, దర్శకుడిగా పనిచేస్తే ఈయన దగ్గరే పని చేయాలని నిర్ణయించుకొన్నారట. ఆ సినిమా అర్ధ శతదినోత్సవం పాలకొల్లులో జరుగుతుండడంతో, అక్కడే దాసరి నారాయణరావుని కలవాలని నిర్ణయించుకొన్నారు. అయితే ఊహించని రీతిలో ఆ వేడుకలో గొడవలు చోటు చేసుకోవడం, ఆ గొడవల్లో కోడి రామకృష్ణ స్నేహితులూ ఉండటంతో.. కార్యక్రమం తర్వాత చిత్ర నిర్మాత కె.రాఘవకీ, దర్శకుడు దాసరి నారాయణరావుకీ అందరి తరఫునా క్షమాపణలు చెప్పారు కోడి రామకృష్ణ. అదే సందర్భంలోనే తాను మీ దగ్గర పనిచేయాలని ఉందనే కోరికని కూడా దాసరి ముందు బయటపెట్టారు. ‘డిగ్రీ పూర్తి చేసి రా, అప్పుడు చూద్దాం’ అని ఆయన చెప్పడంతో, ఆ మాట ప్రకారమే పట్టా అందుకొన్నాక ఒక ఉత్తరం రాశారు. వెంటనే బయల్దేరమంటూ దాసరి నుంచి టెలిగ్రామ్ అందడంతో కోడి రామకృష్ణ మద్రాసు రైలెక్కారు. ‘ఎవరికి వారే యమునా తీరే’, ‘స్వర్గం నరకం’, ‘మనుషుల్లో దేవుడు’ అనే చిత్రాలకి సహాయ దర్శకుడిగా పనిచేసే అవకాశం ఇచ్చారు దాసరి. ఎలాగైనా తన గురువుని పరిచయం చేసిన నిర్మాత కె.రాఘవ చేతులమీదుగానే, తానూ పరిచయం కావాలని నిర్ణయించుకొన్న కోడి రామకృష్ణ ‘తూర్పు పడమర’ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఆ తర్వాత తాను అనుకొన్నట్టుగానే కె.రాఘవ నిర్మించిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’తో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత నుంచి వెనుదిరిగి చూడలేదు. ‘శత్రువు’, ‘లాఠీచార్జ్’, ‘రిక్షావోడు’, ‘ముద్దుల మేనల్లుడు’, ‘ముద్దుల మావయ్య’, ‘ముద్దుల కృష్ణయ్య’ ‘మువ్వ గోపాలుడు’, ‘మావూరి మహారాజు’, ‘మన్నెంలో మొనగాడు’, ‘భారత్ బంద్’, ‘మంగమ్మ గారి మనవడు’, ‘పోలీస్ లాకప్’, ‘పుట్టింటికి రా చెల్లి’, ‘పెళ్ళికానుక’... ఇలా ఆయన్నుంచి మరపురాని చిత్రాలెన్నో వచ్చాయి. ‘అమ్మోరు’, ‘దేవి’, ‘దేవుళ్లు’, ‘దేవీపుత్రుడు’ చిత్రాలతో సాంకేతికకంగా కోడి రామకృష్ణ ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటాయో చాటి చెప్పాయి. వాటిలో అద్భుతమైన గ్రాఫిక్స్‌తో ఆయన ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేశారు. తొలినాళ్లలో కోడి రామకృష్ణ నటుడిగా కూడా ప్రయత్నాలు చేశారట. ఆ మక్కువని వదిలిపెట్టని ఆయనకి మద్రాసులో అడుగుపెట్టిన తొలి రోజే అనుకోకుండా ఆయనతో ‘స్వర్గం నరకం’లో ఓ చిన్న పాత్ర చేయించారట. ఆ తర్వాత ‘రాధమ్మ పెళ్లి’, ‘ఎవరికి వారే యమునా తీరే’, ‘చదువు సంస్కారం’ చిత్రాల్లో నటించారు. కథానాయకుడిగా ‘మా ఇంటికి రండి’ అనే చిత్రంలో కూడా నటించారు. అయితే ఆ చిత్రం విజయవంతం కాలేదు. మంచి దర్శకుడిగా, రచయితగా, నటుడిగా గుర్తింపుని తెచ్చుకొన్నారు కోడి రామకృష్ణ. పలు నంది పురస్కారాలతో పాటు, రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని కూడా స్వీకరించారు. జులై 23 కోడి రామకృష్ణ పుట్టినరోజు. (ప్రత్యేక వార్త కోసం క్లిక్ చేయండి...)
|
* బహుముఖమైన ప్రతిభ
(హిమేష్ రేషమ్మియా పుట్టినరోజు-1973)
 ప్రతిభలో సవ్యసాచి, విజయమే ఆయన చిరునామా. నటుడిగా, నిర్మాతగా, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, కథారచయితగా విజయాన్ని అందుకున్న వ్యక్తి హిమేష్ రేషమ్మియా. ‘ఝలక్ దిఖ్లాజా’..‘ఆషిక్ బనాయా ఆప్నే’ అంటూ తన గానంతో అభిమానుల్ని ఊర్రూతలూగించాడు. భారతీయ సంగీతానికి వెస్టన్ర్బీట్ను జోడించి అభిమానుల మనసు గెలిచి, సంగీతాన్ని కొత్తపుంతలు తొక్కించాడు. నెదర్లాండ్‌లోని ఆమ్స్టర్ డ్యామ్‌లోని ‘వెంబ్లీ ఎరీనాలో హింకెన్’ మ్యూజిక్ హాల్లో ప్రదర్శననిచ్చిన మొదటి భారతీయుడు హిమేశ్. ప్రేమకథా చిత్రం ‘ఆప్కా సురూర్Â’తో నటుడిగా అరంగేట్రం చేశాడు. బాలీవుడ్ చిత్రం ‘ది ఎక్స్పోజ్’తో నిర్మాతగా మారాడు. పలుగీతాలకు ‘ఉత్తమ సంగీత దర్శకుడు’గా ఫిలింఫేర్, స్టార్ స్కీన్ర్, ఇఫా, జీసినీ, అవార్డులను అందుకున్నాడు. ‘కిలాడి 786’ చిత్రానికి ‘ఉత్తమ సహాయ నటుడు’గా దాదాఫాల్కే అవార్డును అందుకున్నారు. ‘జమీన్,’ ‘అక్సర్’, ‘బనారస్’, ‘హమ్కో దీవానా కర్ గయే’, ‘చుప్కే చుప్కే’ వంటి చిత్రాలు గాయకుడిగా గుర్తింపు తెచ్చాయి. వీటిలో ‘ఆషిక్ బనాయా ఆప్నే’కు ఎంటీవీ, జీసినీ, సీఎన్ఎన్-ఐబీఎన్, ఇఫా అవార్డులు దక్కాయి. ‘తేరా సురూర్’, ‘సనమ్ తేరీ కసమ్’, ‘కిక్’ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలోని గీతాలు ఫిలింఫేర్ అవార్డుకు నామినేటయ్యాయి. పాప్‌స్టార్ మైఖేల్ జాక్సన్ మరణంపై ఫ్రెంచ్ దర్శకుడు క్రిస్టోఫర్ లినైర్ రూపొందించిన ‘ఎస్టార్ ఈజ్ కిల్డ్’ చిత్రంలో హిమేష్ ఓపాత్రలో నటించాడు. ఈచిత్రం ద్వారా అంతర్జాతీయ గుర్తింపును దక్కించుకొన్నాడు. బుల్లితెర కార్యక్రమాల్లో నిర్వహించిన పాటల పోటీల్లో న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. సంగీత కార్యక్రమాల్లో పాల్గొనే బృందాలకు శిక్షకుడిగా అవార్డులు పొంది విజయం సాధించాడు. హెచ్ఆర్ మ్యూజిక్ కంపెనీని స్థాపించి పలు సంగీత ఆల్బమ్‌లు రూపొందించాడు. 2018లో సోనియాకపూర్ను వివాహం చేసుకొన్నాడు. 1973 జులై 23న జన్మించిన హిమేష్ రేషమ్మియా 46వ పుట్టినరోజు నేడు.
|
* ‘సింగం’ సూర్య
(పుట్టిన రోజు-1975)

తెలుగులోనూ బలమైన మార్కెట్‌ని సొంతం చేసుకొన్న తమిళ కథానాయకుడు సూర్య. దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకొనే కథానాయకుల్లో ఒకరిగా... బలమైన అభిమాన గణమున్న కథానాయకుల్లో ఒకరిగా సూర్య గుర్తింపు పొందారు. నటుడిగానే కాకుండా, నిర్మాతగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా కూడా ఆయనకి మంచి గుర్తింపు ఉంది. ప్రముఖ నటుడు శివకుమార్, లక్ష్మి దంపతులకి తొలి సంతానంగా 1975 జులై 23న చెన్నైలో జన్మించారు సూర్య. కోయంబత్తూరులో పెరిగారు. సూర్యకి తమ్ముడు కార్తి, చెల్లెలు బృందా శివకుమార్ ఉన్నారు. మద్రాసులోని సెయింట్ బేడీ స్కూల్, లయోలా కాలేజీలో విద్యాభ్యాసం చేశారు. చదువయ్యాక ఎనిమిది నెలల పాటు దుస్తుల ఎగుమతి కంపెనీలో పనిచేశారు. అయితే ఆ కంపెనీలో తాను నటుడు శివకుమార్ తనయుడు అనే విషయాన్ని సూర్య ఎప్పుడూ చెప్పలేదట. ఆ తర్వాత ఆ కంపెనీ ఓనరే స్వయంగా తెలుసుకొని ఆశ్చర్యపోయారట. తొలుత సినిమాలపై అంతగా ఆసక్తి లేని సూర్యకి ‘ఆశై’ సినిమాలో అవకాశం వచ్చినా తిరస్కరించారు. 1997లో ‘నెరుక్కు నెర్’ అనే చిత్రంతో పరిచయమయ్యారు. మణిరత్నం నిర్మించిన చిత్రమిది. ఆ తర్వాత ‘కాదలే నిమ్మది’, ‘సందిప్పొమ’, ‘పెరియన్న’, ‘పూవెల్లమ్ కెట్టుప్పర్’ తదితర చిత్రాల్లో నటించారు. ప్రముఖ మలయాళ దర్శకుడు సిద్ధిక్ తెరకెక్కించిన ‘ఫ్రెండ్స్’తోనూ, బాల దర్శకత్వం వహించిన ‘నందా’తోనూ సూర్య సినీ ప్రయాణం మలుపు తిరిగింది. ‘నందా’లో నటనకిగానూ ఉత్తమ నటుడిగా పలు పురస్కారాలు అందుకొన్నారు. గౌతమ్ మేనన్ దర్శకత్వం వహించిన ‘కాక కాక’ చిత్రం సూర్యకి ఘన విజయాన్ని అందించింది. ఆ చిత్రం తెలుగులో ‘ఘర్షణ’గా రీమేకై విజయం సాధించింది. బాల దర్శకత్వం వహించిన ‘పితామగన్’ కూడా తమిళంతో పాటు, తెలుగులోనూ అనువాదమై సూర్యకి మంచి పేరు తీసుకొచ్చింది. 2005లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘గజిని’తో సూర్య సినీ ప్రయాణమే మారిపోయింది. ఆ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారాయన. అప్పట్నుంచి దాదాపుగా సూర్య నటించిన ప్రతి చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘సింగమ్’ చిత్రాలతోనూ తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించారు సూర్య. గౌతమ్ మేనన్ దర్శకత్వం వహించిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రంలో 16యేళ్ల యువకుడిగా, 65 యేళ్ల వృద్ధుడిగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ‘వీడొక్కడే’, ‘బ్రదర్స్’ తర్వాత మూడోసారి కె.వి.ఆనంద్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు సూర్య. ‘కాక్కా కాక్కా’ చిత్రంలో తన సరసన నటించిన కథానాయిక జ్యోతికని ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు సూర్య. ఆయనకి ఇద్దరు పిల్లలు. తన భార్య జ్యోతిక రీ ఎంట్రీ చేసిన ‘36 వయదినిలే’ చిత్రం కోసం సూర్య నిర్మాతగా మారారు. ఆ తరువాత ‘పసంగ2’, ‘24’, ‘మగలిర్ మట్టుమ్’, ‘కడైకుట్టి సింగమ్’ చిత్రాల్ని నిర్మించారు. తమ్ముడు కార్తి కథానాయకుడిగా ‘కడైకుట్టి సింగమ్’ తెలుగులో ‘చినబాబు’ పేరుతో విడుదలైంది. ప్రస్తుతం సూర్య ‘కాప్పన్’, ‘సురారై పొట్ట్రు’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకి తెలుగమ్మాయి సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాక ఆయన పేరు సూర్యగా మారింది.
|
* నవ్వుల రేడు మెహమూద్
(వర్థంతి - 2004)
(ప్రత్యేక వార్త కోసం క్లిక్ చేయండి...)
|