జూన్‌ 12.. (సినీ చరిత్రలో ఈరోజు)

* యాక్షన్‌ స్టార్‌

(గోపీచంద్‌ పుట్టిన రోజు)


గోపీచంద్‌.. తెలుగులో ప్రస్తుతం మంచి మాస్‌ ఇమేజ్‌ ఉన్న కథానాయకుల్లో గోపీచంద్‌ ఒకరు. ప్రముఖ దర్శకుడు టి.కృష్ణ తనయుడైన గోపీచంద్‌ ‘తొలివలపు’ చిత్రంతో తెరప్రవేశం చేశారు. ఆ తర్వాత ‘జయం’, ‘నిజం’, ‘వర్షం’ చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించి విజయాల్ని అందుకొన్నారు. ‘యజ్ఞం’, ‘రణం’ చిత్రాలతో మళ్లీ కథానాయకుడిగా ప్రేక్షకుల్ని అలరించారు. ఆ రెండు చిత్రాలు ఘన విజయం సాధించడంతోపాటు, గోపీచంద్‌కి మాస్‌ ఇమేజ్‌ని తెచ్చిపెట్టాయి. యాక్షన్‌ కథల్లో ఒదిగిపోయే నటుడిగా ఆయనకి మంచి గుర్తింపు ఉంది. అదే సమయంలో వినోదాత్మక కథల్లోనూ మెప్పించగలనని కొన్ని చిత్రాలతో నిరూపించారు. ‘ఒక్కడున్నాడు’, ‘లక్ష్యం’, ‘శౌర్యం’, ‘గోలిమార్‌’, ‘సాహసం’, ‘లౌక్యం’, ‘జిల్‌’ తదితర చిత్రాలు గోపీచంద్‌కి మంచి పేచ్చిపెట్టాయి. ప్రస్తుతం ‘పంతం’లో నటిస్తున్న గోపీచంద్‌ పుట్టినరోజు ఈరోజు.

* అందాల నటి... అద్భుత చిత్రం!


ప్రపంచంలోని సినీ అభిమానులను విపరీతంగా ఆకర్షించి, గొప్ప హాలీవుడ్‌ సినిమాల్లో ఒకటిగా ప్రాచుర్యం పొందిన ‘క్లియోపాత్రా’ సినిమా తొలిసారిగా 1963లో న్యూయార్క్‌లో ప్రదర్శితమైంది. ఇందులో క్లియోపాత్రాగా సంచలన నటి ఎలిజబెత్‌ టేలర్‌ నటించడం విశేషం. సినిమా చరిత్రలో అప్పటి వరకు వచ్చిన సినిమాల్లోకెల్లా అత్యధిక వ్యయంతో నిర్మితమైన చిత్రంగా ‘క్లియోపాత్రా’ పేరొందింది. జోసెఫ్‌ మాన్‌కీవిజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈజిప్టు రాణి కథను తెరపైకి తెచ్చింది. దాదాపు 44 మిలియన్‌ డాలర్లతో తీసిన ఈ సినిమా 57.7 మిలియన్‌ డాలర్లు ఆర్జించింది. అయినా అత్యధిక వ్యయం వల్ల, చిత్రీకరణ చాలా కాలం సాగడం వల్ల నష్టాలు తప్పలేదు. అయితే నాలుగు ఆస్కార్‌ అవార్డులు గెలుచుకుంది. గొప్ప సినిమాల్లో ఒకటిగా పేరుతెచ్చుకుంది. చిత్రంలో ప్రధాన పాత్ర ధరించిన ఎలిజబెత్‌ టేలర్‌ అప్పటికి అత్యధిక పారితోషికంగా ఒక మిలియన్‌ డాలర్లను అందుకుంది. సినిమాలో తన సహనటుడు రిచర్డ్‌ బర్టన్‌తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది.

(ప్రత్యేక కథనం కోసం క్లిక్‌ చేయండి...)

* అమెరికా, రష్యాల యుద్ధాన్ని

తప్పించిన జేమ్స్‌బాండ్‌ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను ఉర్రూతలూగించే జేమ్స్‌బాండ్‌ సినిమాల్లో అయిదవది ‘యు ఓన్లీ లివ్‌ ట్వైస్‌’ (1967). బాండ్‌ పాత్రను సృష్టించిన రచయిత ఇయాన్‌ ఫ్లెమింగ్‌ 1964లో రాసిన నవల ఆధారంగా తీసిన ఈ సినిమాలో బాండ్‌గా సీన్‌ కానరీ నటించాడు. అమెరికా, రష్యా వ్యోమగాములు ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌక అనూహ్యంగా కక్ష్య నుంచి అదృశ్యమైపోతుంది. రెండు దేశాలూ ఒకటినొకటి అనుమానించి ఆరోపణలు మొదలు పెడతాయి. ఇది రాజకీయ ఘర్షణకు దారి తీస్తుండడంతో జేమ్స్‌బాండ్‌ రంగంలోకి దిగుతాడు. రెండు అగ్రరాజ్యాల చిచ్చు పెట్టి తద్వారా ప్రపంచ ఆధిపత్యాన్ని సాధించాలనే ఎత్తుగడతో అంతరిక్ష నౌకను మాయం చేసిన దుండగులను జపాన్‌ ప్రాంతంలోని మారుమూల దీవిలో కనుగొని బాండ్‌ వాళ్ల ఆటనెలా కట్టించాడనేదే సినిమా కథ. ఈ చిత్రాన్ని 10.3 మిలియన్‌ డాలర్ల ఖర్చుతో తీస్తే, ప్రపంచవ్యాప్తంగా 111 మిలియన్‌ డాలర్లు ఆర్జించింది.

మరిన్ని విశేషాలు...
- ఈ సినిమా కోసం వేసిన అగ్నిపర్వతం సెట్‌ ఖరీదు అంతకు ముందు వచ్చిన ‘డాక్టర్‌ నో’ జేమ్స్‌బాండ్‌ సినిమా బడ్జెట్‌తో సమానం కావడం విశేషం. ఈ సెట్‌ మూడు మైళ్ల దూరం నుంచి కూడా కనిపించేంత పెద్దది. దీని నిర్మాణం కోసం 700 మెట్రిక్‌ టన్నుల స్టీలును, 200 మైళ్ల పొడవుండే స్టీలు గొట్టాలను, 200 మెట్రిక్‌ టన్నుల ప్లాస్టర్‌ను వాడారు. అప్పట్లోనే ఈ సెట్‌ నిర్మాణానికి మిలియన్‌ డాలర్లకు పైగా ఖర్చయింది.

- జేమ్స్‌బాండ్‌ సినిమాల్లో బాండ్‌ కారు నడపని సినిమా ఇదొక్కటే.

- దీనికి రెండు నెలల తర్వాత ‘క్యాసినో రాయల్‌’ విడుదలై ఒకే ఏడాది రెండు బాండ్‌ సినిమాలు వచ్చిన రికార్డును సృష్టించాయి. తిరిగి ఇలా 1983లో కానీ జరగలేదు. ఆ ఏడాది ‘ఆక్టోపస్సీ’, ‘నెవర్‌ సే నెవర్‌ ఎగైన్‌’ సినిమాలు విడుదలయ్యాయి.

* నిధి కోసం అన్వేషణ


ఓ గొప్ప దర్శకుడు, ఓ సంచలన నిర్మాత, ఓ గొప్ప నటుడు కలిసిన సినిమాగా ‘రైడర్స్‌ ఆఫ్‌ ద లాస్ట్‌ ఆర్క్‌’ సినిమాను చెప్పుకోవచ్చు. ‘స్టార్‌వార్స్‌’ లాంటి సినిమాను అందించిన జార్జిలూకాస్‌ నిర్మాణంలో, ‘జాస్‌’, ‘ఇటి’ లాంటి సినిమాలను రూపొందించిన స్పీల్‌బర్గ్‌ దర్శకత్వంలో, ఆరు దశాబ్దాల పాటు హాలీవుడ్‌ నటుడిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన హారిసన్‌ ఫోర్డ్‌ కథానాయకుడిగా వచ్చిన ఈ సినిమా ‘ఇండియానా జోన్స్‌’ ట్రయాలజీలో మొదటిది. నిధి కోసం సాగించే అన్వేషించే కథతో ప్రపంచ గొప్ప సినిమాల్లో ఒకటిగా పేరొందిన ఇది అయిదు ఆస్కార్‌ అవార్డులు సాధించింది. 18 మిలియన్‌ డాలర్లతో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 384 మిలియన్‌ డాలర్లు రాబట్టింది.

* మారువేషాలు వేసే

రోబోల కథ!ఆకారాలు మార్చుకునే రోబోలు... వాటి మధ్య యుద్ధాలు... ఈ నేపథ్యంలో వచ్చిన సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా పిల్లల్ని, పెద్దల్ని కూడా అలరించాయి. ఆ సినిమాలే ‘ట్రాన్స్‌ఫార్మర్స్‌’. వేరే గ్రహాల నుంచి రోబోలు వచ్చి మన భూమి మీద పడడం, వాటికి వేర్వేరు ఆకారాల్లోకి మారే శక్తులు ఉండడం, అవి మన కార్లు, వాహనాల రూపంలోకి మారిపోవడం, అవసరమైనప్పుడు రోబోల్లాగా ఆకారం మార్చుకోవడం... ఇలా చెబితే ఈ సినిమాల కథ ఏంటో ఎవరికీ అర్థం కాదు. ఈ గ్రహాంతర మరమనుషుల కథతో ఒకటి కాదు, ఏకంగా అయిదు సినిమాలు వచ్చి అలరించాయి. వాటిలో మొదటిదైన ‘ట్రాన్స్‌ఫార్మర్స్‌’ 2007లో విడుదలై విజయవంతమైంది. ఆటోబోట్స్, డిసెప్టికన్స్‌ అనే రెండు రకాల రోబోల మధ్య యుద్ధానికి సంబంధించిన కథ ఇది. ఈ సినిమాను 150 డాలర్ల వ్యయంతో తీస్తే, 709.7 మిలియన్‌ డాలర్లను వసూలు చేసింది. ఈ సినిమా విజయంతో నాలుగు సీక్వెల్స్, ఒక ప్రీక్వెల్‌ వచ్చాయి. ‘రివెంజ్‌ ఆఫ్‌ ద ఫాలెన్‌’ (2009), ‘డార్క్‌ ఆఫ్‌ ద మూన్‌’ (2011), ‘ఏజ్‌ ఆఫ్‌ ఎక్స్‌టింక్షన్‌’ (2014), ‘ద లాస్ట్‌ నైట్‌’ (2017), ‘బంబుల్‌బీ’ (2018) పేర్లతో వచ్చిన ఈ సినిమాలన్నీ కలిసి ప్రపంచ వ్యాప్తంగా 4.38 బిలియన్‌ డాలర్లు ఆర్జించాయి.

* బొమ్మలకు ప్రాణం వస్తే?


పిల్లలు ఆడుకునే బొమ్మలకు ప్రాణం వస్తే? అవి మనుషుల్లాగా మాట్లాడుకుంటే? నేను గొప్పంటే నేను గొప్పని వాదించుకుంటే? చివరికి అన్నీ కలిసి తారతమ్యాలు మరిచిపోయి సాహసాలు చేస్తే? ఈ ఊహలకు రూపమే ‘టాయ్‌స్టోరీ’ సినిమాలు. వీటిలో తొలి సినిమా 1995లో విడుదలైంది. అది విజయవంతమవడంతో 1999, 2010ల్లో దానికి సీక్వెల్స్‌ వచ్చాయి. ఈ మూడూ కలిసి 320 మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి, ఏకంగా 1.9 బిలియన్‌ డాలర్లను వసూలు చేసి సంచలనం సృష్టించాయి. వీటిలో మూడోది 2010లో ఇదే రోజు విడుదలై అంతకు ముందు సినిమాల కంటే ఎక్కువగా అలరించింది. దీని నిర్మాణానికి 200 మిలియన్‌ డాలర్లయితే, ఇదొక్కటే 1.067 బిలియన్‌ డాలర్లు వసూలు చేయడం విశేషం. రెండు ఆస్కార్లు కూడా అందుకుంది. ఈ సినిమాల పరంపరలో నాలుగోది 2019 జూన్‌ 21న విడుదల కానుంది.  * శ్రీశ్రీ కవితా సుందరి


మహాకవి శ్రీశ్రీ ఓ కవితలో ‘అటు చూస్తే నార్మా షేరర్‌... ఇటు చూస్తే కాంచన మాల...’ అంటూ ఏ సినిమా చూడాలో తేల్చుకోలేని మధ్యతరగతి వ్యక్తి గురించి రాశారు. అలా ఆయన కవితలో చోటు చేసుకున్న అందాల నటి నార్మాషేరర్‌. హాలీవుడ్‌లో 1925 నుంచి 1942 వరకు మరపురాని చిత్రాల్లో తళుక్కుమన్న అందం, అభినయం ఉన్న నటిగా పేరొందింది. 1930లో ‘ద డైవోర్సీ’ సినిమాకు ఉత్తమ నటిగా ఆస్కార్‌ అందుకుంది. ‘రోమియో జూలియట్‌’ (1936), ‘మేరీ ఆంటోనెట్‌’ (1938) చిత్రాల్లో నటన ద్వారా ప్రపంచ సినీ అభిమానులకు ఆకర్షించింది. కెనడాలో 1902 ఆగస్టు 11న పుట్టిన నార్మాషేరర్, తొమ్మిదేళ్ల వయసులోనే ‘నేను సినిమాల్లో నటిస్తాను’ అని ప్రకటించడం విశేషం. అమ్మ సరేనని ప్రోత్సహించినా సందేహించింది. ఎందుకంటే అప్పటికి నార్మా రూపం ఏమంత ఆకర్ణణీయంగా లేదు. సన్నగా పీలగా ఊచకాళ్లతో ఎగుభుజాలతో ఉండేది. పైగా కొద్దిగా మెల్లకన్ను. తర్వాత తండ్రికి వ్యాపారంలో నష్టాలు రావడంతో విలాసవంతమైన జీవితంలోంచి మధ్యతరగతిలోకి వచ్చి పడి డిప్రెషన్‌కి గురైంది. అయినా సినిమా కల వెంటాడింది. ఎక్స్‌ట్రా వేషాల కోసం ఆడిషన్స్‌కి వెళ్లింది. నటిగా బాగా కనిపించడానికి గంటల తరబడి అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్‌ చేసేది. శరీరాకృతిలో లోపాలు దిద్దుకోడానికి వ్యాయామాలు చేసింది. అలాంటి నేపథ్యంలోంచి అనుకున్నది సాధించడమే కాకుండా తారాపథానికి ఎదగడం ఆమెకే సాధ్యమైంది. నిర్మాతలు వెంటపడే అందాల తారగా పేరు తెచ్చుకున్న ఆమె 1983 జూన్‌ 12న తన 80 ఏళ్ల వయసులో మరణించింది.

* విలక్షణ నటుడు


తొలి సినిమాకే ఆస్కార్‌ నామినేషన్‌ పొందిన నటుడు... తొలి ఐదేళ్లలోనే నాలుగు నామినేషన్లు పొందిన హీరో... అతడే గ్రెగరీపెక్‌. వినూత్నమైన స్టైల్‌తో, ఆకట్టుకునే రూపంతో, చక్కని అభినయంతో నాలుగు దశాబ్దాల పాటు ప్రపంచ సినీ అభిమానులకు ఆరాధ్యుడుగా మారిన నటుడితడు. ‘టు కిల్‌ ఏ మాకింగ్‌ బర్డ్‌’ (1962) చిత్రంలో నటనకు ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అందుకున్నాడు. మొదటి సినిమా ‘డేస్‌ ఆఫ్‌ గ్లోరీ’ (1944)కే అకాడమీ నామినేషన్‌ అందుకున్నాడు. సినిమాల్లో డూప్‌లను అంగీకరించకుండా తన ఫైట్స్‌ తానే చేసేవాడు. ‘ద కీస్‌ ఆఫ్‌ ద కింగ్‌డమ్‌’ (1944), ‘ద ఈర్లింగ్‌’ (1946), ‘జెంటిల్‌మన్స్‌ ఎగ్రిమెంట్‌’ (1947), ‘ట్వెల్వోక్లాక్‌ హై’ (1949), ‘స్పెల్‌బౌండ్‌’ (1945), ‘ద గన్‌ఫైటర్‌’ (1950), ‘ద గన్స్‌ ఆఫ్‌ నవరోన్‌’ (1961), ‘ద ఓమెన్‌’ (1976)లాంటి ఎన్నో చిత్రాల ద్వారా ప్రపంచ ప్రేక్షకులను అలరించాడు. కాలిఫోర్నియాలో 1916 ఏప్రిల్‌ 5న పుట్టిన గ్రెగరీపెక్, చిన్నతనంలోనే నటన పట్ల అభిరుచిని పెంచుకున్నాడు. నాటకాల ద్వారా గుర్తింపు తెచ్చుకుని ‘డేస్‌ ఆఫ్‌ గ్లోరీ’ (1944)తో సినీ ప్రస్థానం మొదలుపెట్టిన ఇతడు అంచెలంచెలుగా ఎదిగాడు. అమెరికా అధ్యక్షుడి ద్వారా ‘ప్రెసిడెన్షియల్‌ మెడల్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌’ అవార్డు అందుకున్నాడు. హాలీవుడ్‌ క్లాసిక్‌ సినిమాల్లో గొప్ప నటుడిగా అమెరికన్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ గుర్తించింది. గ్రెగరీ పెక్‌ తన 87వ ఏట 2003 జూన్‌ 12న మరణించాడు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.