జూన్‌ 17 (సినీ చరిత్రలో ఈరోజు)...

* వినోద రంగంలో రాణి..


ఆరు దశాబ్దాల కళా వ్యాసంగం... గాయనిగా, గీత రచయిత్రిగా, నటిగా, నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞ... రెండు ఆస్కార్‌ అవార్డులు... పది గ్రామీ అవార్డులు... జీవిత కాల సాఫల్య పురస్కారం... ఇవన్నీ కలిస్తే బార్బరా జోన్‌ స్ట్రీశాండ్‌. వినోదరంగంలో అత్యంత సృజనశీలిగా ఈమె అందుకున్న అవార్డులు ఎన్నెన్నో. ఈమె సంగీత విభావరిని తొలిసారిగా ఇదే రోజు లైవ్‌లో ప్రసారం చేస్తే ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది వీక్షించారు. ‘ఫన్నీ గర్ల్‌’ సినిమా ద్వారా ఉత్తమ నటిగా ఆస్కార్, గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులు అందుకుంది. ‘ది ఓల్‌ అండ్‌ ద పుస్సీ క్యాట్‌’, ‘ద వే వుయ్‌ వర్‌’, ‘ఎ స్టార్‌ ఈజ్‌ బార్న్‌’ (దీనికి రెండో ఆస్కార్‌ వచ్చింది) లాంటి సినిమాల ద్వారా మంచి నటిగా గుర్తింపు సాధించింది. ప్రపంచంలో తొలిసారిగా ఓ సినిమాకు రచయితగా, నిర్మాతగా, దర్శకురాలిగా, నటిగా బాధ్యతలు నిర్వహించిన మహిళగా గుర్తింపు పొందడంతో పాటు ఆ చిత్రం ఆస్కార్, గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులలో ఉత్తమ చిత్రంగా నిలవడం విశేషం. ఉత్తమ దర్శకురాలిగా గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు అందుకున్న ఏకైక మహిళగా ఆమెదే రికార్డు. ఆమె విడుదల చేసిన ఆల్బమ్‌లు ప్రపంచ వ్యాప్తంగా 15 కోట్లు అమ్ముడుపోయాయి. ‘టాప్‌ టెన్‌’ ఆల్బమ్స్‌ రికార్డులు 34 సాధించిన మహిళా గాయని కూడా ఆమే.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.