తుషార్ కపూర్.. హుషారైన పాత్రలకు పెట్టింది పేరు. తెలుగు రీమేక్‌లతో బాలీవుడ్ బాక్సీఫీస్ వద్ద జోరు చూపించాడు. కొంటెదనం నిండిన పాత్రలతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు. అడల్ట్ కామెడీ చిత్రాలతో యువతరాన్ని ఆకర్షించాడు. వైవిధ్యమైన పాత్రలతో సినీ ప్రయాణాన్ని సాగిస్తూ మీడియం రేంజు హీరోగా బాలీవుడ్లో కొనసాగుతున్నాడు. ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత జితేంద్ర నట వారసత్వంతో వెండితెరపై మెరిశాడు తుషార్ కపూర్. యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ నుంచి డిగ్రీ పూర్తి చేసిన తుషార్.. నటుడిగా మారడానికి ముందు కొన్నాళ్ల పాటు డేవిడ్ ధావన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. తొలిచిత్రం ‘ముఝే కుచ్ కెహనా’ (2001)తోనే బాక్సాఫీస వద్ద భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇది పవన్‌కల్యాణ్ నటించిన హిట్ మూవీ ‘తొలిప్రేమ’కు హిందీ రీమేక్. ఇందులో కరణ్‌గా తుషార్ కనబర్చిన నటనకు.. ఉత్తమ నటుడిగా (డెబ్యూ) తొలి ఫిలింఫేర్ పురస్కారం లభించింది. ఈ చిత్ర విజయమిచ్చిన స్ఫూర్తితో.. ఆ తరువాత కూడా వరుసగా తెలుగు రీమేక్లతోనే ప్రేక్షకుల్ని అలరించాడు. ఈ క్రమంలో ‘క్యా దిల్ నే కహ’ (స్వయంవరం), ‘జీనా సిర్ఫ్ మేరే లియే’ (మనసంతా నువ్వే), ‘యే దిల్’ (నువ్వు - నేను) వంటి చిత్రాలతో బాలీవుడ్ సినీప్రియులకు దగ్గరయ్యాడు. తుషార్ కపూర్‌కు అడల్డ్ కామెడీ, రొమాంటిక్ చిత్రాల కథానాయకుడిగా యువతరంలో మంచి క్రేజ్ ఉంది. ఈ జోనర్లలో అతను చేసిన ‘గోల్మాల్’, ‘గోల్మాల్ ఎగైన్’, ‘మస్తీ జాదే’, ‘డర్టీ పిక్చర్స్’, ‘గోల్మాల్ 3’ వంటి చిత్రాలన్నీ బాక్సీఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ముఖ్యంగా ‘మస్తీ జాదే’ చిత్రంతో బాలీవుడ్లో అడల్ట్ కామెడీ చిత్రాలకు మంచి ఊపు తెచ్చాడు. కేవలం నటుడిగానే కాక వ్యక్తిగత జీవితంతోనూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాడు తుషార్ కపూర్. ఐవీఎఫ్, సరోగసి విధానంతో పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు తండ్రిగా మారి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇలా పెళ్లి కాకుండానే తండ్రైన తొలి భారతీయ నటుడు తుషారే. తన కొడుకుకు లక్ష్య అని పేరు పెట్టుకున్నాడు. ప్రస్తుతం నటుడిగా రాణిస్తూనే తన సోదరి ఏక్తా కపూర్‌తో కలిసి బాలాజీ టెలీ ఫిలింస్, బాలాజీ మోషన్ పిక్చర్స్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. భారతీయ చిత్రసీమలో ఇంతటి ప్రత్యేక గుర్తింపు ఉన్న తుషార్.. జితేంద్ర, శోభా కపూర్ దంపతులకు 1976 నవంబరు 20న ముంబయిలో జన్మించాడు.
(ప్రత్యేక వార్త కోసం క్లిక్ చేయండి)