సెప్టెంబర్‌ 12. (సినీ చరిత్రలో ఈరోజు)

* భరతనాట్యం... నటన... జంతుప్రేమ!
(అమల పుట్టిన రోజు- 1968)


దక్షిణాది భాషలతోపాటు.. హిందీలోనూ నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొన్న నటి అమల అక్కినేని. భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించిన ఆమె తొలినాళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శనలతో అభిమానుల్ని సంపాదించుకొన్నారు. ఆ తర్వాత నటిగా మారారు. ప్రస్తుతం జంతు సంక్షేమ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అమల తండ్రి బెంగాలీ నేవీ అధికారి. తల్లి ఐరిష్‌ జాతీయురాలు. ఈ దంపతులిద్దరికీ 1968 సెప్టెంబరు 12న కోల్‌కత్తాలో అమల జన్మించారు. భరతనాట్యంలో డిగ్రీ పట్టా అందుకొన్న అమల, అనుకోకుండా ప్రముఖ దర్శకుడు టి.రాజేందర్‌ దృష్టిలో పడి... ఆయన ప్రోద్భలంతోనే సినీ రంగ ప్రవేశం చేశారు. తమిళంలో నటించిన తొలి చిత్రం ‘మైథిలి ఎన్నై కాథలి’ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా ఆమెకి అవకాశాలు వెల్లువెత్తాయి. తమిళంతో పాటు, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో నటించే అవకాశాలు అందుకొన్నారు. నాగార్జునతో కలిసి తెలుగులో ‘కిరాయి దాదా’, ‘చినబాబు’, ‘శివ’, ‘ప్రేమ యుద్ధం’, ‘నిర్ణయం’ తదితర చిత్రాల్లో నటించి మంచి జోడీగా ప్రేక్షకుల మనసు దోచుకొన్నారు. సినీ ప్రయాణంలోనే ఇద్దరి మనసులు కలిశాయి. ఆ తర్వాత పెళ్లి చేసుకొన్నారు. పెళ్లి తర్వాత సినిమాలకి దూరమైన అమల మళ్లీ 2012లో ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ చిత్రంతో అమ్మ పాత్రలో నటించి ప్రేక్షకులతో కంట తడి పెట్టించారు. ఆ తర్వాత ‘మనం’లోనూ ఓ చిన్న పాత్రలో మెరిశారు. హిందీ, మలయాళం భాషల్లోనూ సెకండ్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా సినిమాలు చేశారు. నాగార్జున, అమలకి జన్మించిన అఖిల్‌ అక్కినేని ప్రస్తుతం కథానాయకుడిగా కొనసాగుతున్నారు. జంతు ప్రేమికురాలైన అమల బ్లూ క్రాస్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ అనే స్వచ్ఛంద సేవా సంస్థని నెలకొల్పారు. జంతు సేవా, సంరక్షణ కార్యక్రమాల్ని చేపడుతున్నారు.


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* అగ్రనిర్మాత!
(ఎస్‌. గోపాల్‌రెడ్డి వర్థంతి-2008)

‘మంగమ్మగారి మనవడు’, ‘ముద్దుల మావయ్య’, ‘మువ్వ గోపాలుడు’, ‘ముద్దుల కృష్ణయ్య’, ‘మాతో పెట్టుకోకు’... తదితర విజయవంతమైన చిత్రాలు తీసిన అగ్ర నిర్మాతగా పరిశ్రమలో పేరు తెచ్చుకొన్నారు ఎస్‌.గోపాల్‌రెడ్డి. భార్గవ్‌ ఆర్ట్స్‌ పేరుతో నిర్మాణ సంస్థని ప్రారంభించిన ఆయన ఎన్నో నాణ్యమైన చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఘన విజయాల్ని సొంతం చేసుకొన్నారు. భార్గవ్‌ ఆర్ట్స్‌ నుంచి వస్తున్న సినిమా అనగానే ప్రేక్షకులు ప్రత్యేకమైన అంచనాలతో ఎదురు చూసేవారు. అదీ ఆయన సంస్థకున్న విలువ, గుర్తింపు. నెల్లూరు జిల్లా, నాయుడు పేటలోని ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు ఎస్‌.గోపాల్‌రెడ్డి. సినిమాలపై ఆసక్తితో 1975లో మద్రాసు ప్రయాణమయ్యారు. కొంతమంది మిత్రులతో కలిసి సినిమా రంగంపై దృష్టిపెట్టిన ఆయన తొలుత రెండు అనువాద చిత్రాలతో అదృష్టాన్ని పరీక్షించుకొన్నారు. అవి లాభాల్ని అందించకపోవడంతో ‘మనిషికో చరిత్ర’ అనే చిత్రాన్ని నిర్మించారు. కొత్త సంస్థ నుంచి వచ్చిన ఆ సినిమాపై మొదట్లో సందేహాలు వ్యక్తమైనప్పటికీ, విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఆ తర్వాత ‘ముక్కుపుడక’, ‘మంగమ్మగారి మనవడు’... ఇలా వరుసగా సినిమాలు తీస్తూ విజయాల్ని అందుకొన్నారు. తన సినీ ప్రయాణంలో ఎక్కువగా బాలకృష్ణతోనే తీశారు గోపాల్‌రెడ్డి. బాలకృష్ణతో మరో సినిమా నిర్మించాలనే ప్రయత్నంలో ఉండగానే 2008లో అనారోగ్యంతో మృతిచెందారు. ఈరోజు ఆయన వర్ధంతి.  

* అటు విమర్శలు... ఇటు ప్రశంసలు!


ఓ సినిమా విడుదలవగానే ఫ్లాప్‌ అయి, ఆ తర్వాత పేరు తెచ్చుకోవడం సాధారణమే. కానీ తీవ్ర విమర్శలకు లోనైన ఓ సినిమా, కొన్నేళ్ల తర్వాత చాలా గొప్ప సినిమాగా గుర్తింపు తెచ్చుకోవడం మాత్రం అరుదైన విషయమే. అలాంటి అరుదైన చిత్రమే ‘బ్లూ వెల్వెట్‌’. 1986 సెప్టెంబర్‌ 12న విడుదలైన ఈ సినిమా మితిమీరిన శృంగారం, హింసలతో కూడి ఉందనే విమర్శలు తలెత్తాయి. నేరం, పరిశోధన, మిస్టరీ, మానసిక భయానక అంశాలతో నిండిన ఈ సినిమాకు డేవిడ్‌ లించ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా స్క్రిప్ట్‌ను 1970 నుంచి పదేళ్ల పాటు ఎన్నో స్టూడియోలకు సమర్పించినా ఎవరూ తీయడానికి ముందుకు రాలేదు. చివరకు ఓ ఇటాలియన్‌ నిర్మాత అంగీకారంతో సినిమా తెరకెక్కింది. విడుదలవగానే అనేక విమర్శలు చుట్టుముట్టాయి. అయితే కొన్నేళ్ల తర్వాత అనూహ్యంగా ఓ గొప్ప సినిమాగా పేరొందింది. బీబీసీ పత్రిక ‘గ్రేటెస్ట్‌ అమెరికన్‌ సినిమా’గా పేర్కొంది. 2008లో అమెరికాలోని గొప్ప మిస్టరీ సినిమాల్లో ఒకటిగా పేరు పొందడం విశేషం.
...............................................................................................................................................................

జైకిషన్‌ గీతాలు... జయకేతనాలు! (వర్ధంతి - 1971)


(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* వేగానికి మారుపేరు!  


ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ సినిమాలను తల్చుకోగానే గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు ‘పాల్‌ వాకర్‌’. ఆ చిత్రాలతో దేశదేశాల్లో అభిమానులను సంపాదించుకున్న ఈ నటుడు వీధుల్లో రేసింగ్‌ చేసే బ్రియాన్‌ ఓకానర్‌ పాత్రలో వేగానికి మారుపేరుగా గుర్తింపు పొందాడు. ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ పేరుతో 2001 నుంచి వరసగా వచ్చిన ఆరు సినిమాల్లో నటించాడు. అయితే 2013లో ‘ఫ్యూరియస్‌ 7’ సినిమాలో నటిస్తూ అనూహ్యమైన ప్రమాదానికి గురై నవంబర్ 30న మరణించి అభిమానులకు విషాదాన్ని మిగిల్చాడు. 1973 సెప్టెంబర్‌ 12న కాలిఫోర్నియాలో పుట్టిన పాల్‌ వాకర్, టీవీల ద్వారా సినిమాల్లోకి వచ్చి మొదట్లో ‘షీ ఈజ్‌ ఆల్‌దట్‌’, ‘వార్సిటీ బ్లూస్‌’, ‘జోయ్‌ రైడ్‌’, ‘టైమ్‌లైన్‌’, ‘రన్నింగ్‌ స్కేర్‌డ్‌’ ‘ఫాస్ట్ ఫైవ్‌’, ‘వెహికిల్స్ 19‘లాంటి సినిమాలు చేశాడు. 


* పాటలు పాడుతూ సినిమాల్లోకి!


ఏడేళ్లకే పాటలు పాడుతూ ఆకట్టుకున్న ఓ అమ్మాయి, గాయనిగా పేరుతెచ్చుకుని సినమాల్లో నటిగా మారి ‘ఆస్కార్‌’ అవార్డు పొందడం అరుదైన విషయమే. ఆ అమ్మాయే జెన్నిఫర్‌ హడ్సన్‌. గాయనీగాయకుల వేదికగా పేరొందిన ‘అమెరికన్‌ ఐడల్‌’ పోటీల్లో ఏడవ స్థానంలో నిలిచి, ఎలిమినేషన్‌ తర్వాత సినిమా అవకాశాలు పొంది, వెండితెరపై నటిగా రాణించింది. 1981 సెప్టెంబర్‌ 12న షికాగోలో పుట్టిన జెన్నిఫర్‌ హడ్సన్‌ ‘డ్రీమ్‌గర్ల్స్‌’ (2006) సినిమాకు ఉత్తమ సహాయనటిగా ఆస్కార్‌ అందుకుంది. అలాగే గోల్డెన్‌గ్లోబ్, బాఫ్తా, స్కీన్ర్‌ యాక్టర్స్‌ గిల్డ్‌ అవార్డులను కూడా సాధించింది. ‘సెక్స్‌ అండ్‌ ద సిటీ’, ‘ద సీక్రెట్‌ లైఫ్‌ ఆఫ్‌ బీస్‌’, ‘బ్లాక్‌ నేటివిటీ’ సినిమాల ద్వారా గుర్తింపు పొందింది. ఆ తరువాత 2014 ఆండ్రీవ్‌ లెవిటాస్‌ దర్శకత్వంలో వచ్చిన ‘లుల్లాబై’ చిత్రంలో నర్సి క్యారీగా నటించింది. 2015లో ‘చి-రాక్‌’, 2016లో ‘సింగ్‌’ చిత్రానికి డబ్బింగ్‌ చెప్పింది. ప్రస్తుతం టామ్‌ హూపర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘క్యాట్‌’ గ్రిజబెల్లాగా నటిస్తుంది. గాయనిగా గ్రామీ అవార్డు సాధించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా స్నేహితురాలిగా గుర్తింపు పొంది వైట్‌హౌస్‌లో ప్రదర్శన ఇచ్చింది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.