నవంబర్‌ 9.. (సినీ చరిత్రలో ఈరోజు)

వెండితెరపై వెలిగిన అందం!


‘ఇంతవరకు ఇలాంటి అందమైన అమ్మాయిని సినిమాల్లో చూడలేదు’ అన్నారందరూ!
‘ఎంత అందమైన అమ్మాయైతే మాత్రం, ఛీ.. ఛీ.. ఇదేం పని?’ అని ఈసడించుకున్నారు చాలామంది!
అటు ప్రశంసల్ని, ఇటు విమర్శల్ని కూడా చూసిన ఆ తార మాత్రం నటనకే పరిమితం కాలేదు. ఓ పరిశోధకురాలిగా కూడా పేరు తెచ్చుకుంది. ఆమె హాలీవుడ్‌ పేరు హెడీ లామర్‌. ఆస్ట్రియాలో పుట్టింది మాత్రం హెడ్విగ్‌ ఎవా కీస్లర్‌గా. పదిహేడేళ్లకే ఆస్ట్రియన్‌ సినిమాల్లో తెరంగేట్రం చేసింది కానీ ఉన్నట్టుండి ఆమె పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోవడానికి కారణమైన సినిమా మాత్రం ‘ఎక్‌స్టసీ’(1933). ఓ చలన చిత్రంలో తొలిసారి నగ్నత్వాన్ని చూపించిన సినిమా అది. అందులో లామర్‌ నగ్నంగా నటించడం ఆ కాలంలో పెద్ద సంచలనమైపోయింది. ఓ ధనికుడైన వృద్ధుడిని పెళ్లి చేసుకుని అసంతృప్తితో విడాకులిచ్చి మరో యువకుడికి చేరువైన అమ్మాయి పాత్రలో ఆమె నటన సాహసోపేతంగా ఉందని కొందరంటే, కొన్ని దేశాలు మాత్రం ఆ సినిమానే నిషేధించాయి. నిజ జీవితంలో కూడా భర్త నుంచి రహస్యంగా పారిపోయి ప్యారిస్‌ చేరుకున్న ఈమెను ఓ ప్రయాణంలో హాలీవుడ్‌ చిత్ర నిర్మాత సంస్థ ఎమ్‌జీఎమ్‌ అధినేత చూసి సినిమా ఒప్పందం కుదుర్చుకున్నాడు. అలా హాలీవుడ్‌ తారగా మారిన లామర్‌ అందాన్ని చూసిన ప్రేక్షకులు మాత్రం మురిసిపోయారు. రెండు దశాబ్దాల పాటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ‘శ్యామ్‌సన్‌ అండ్‌ డిలైలా’ (1949) సహా ‘అల్‌గియర్స్‌’ (1938), ‘బూమ్‌టౌన్‌’, ‘ఐ టేక్‌ దిస్‌ ఉమన్‌’, ‘కామ్రేడ్‌ ఎక్స్‌’, ‘కమ్, లివ్‌ విత్‌ మి’ లాంటి సినిమాల్లో అందాల రాశిగా పేరు పొందింది. సినిమాలతోనే ఆగిపోకుండా సైనికులు రహస్యంగా సందేశాలు ఇచ్చుకునే పరికరానికి సంబంధించిన పేటెంట్‌ పొందింది. ఈ సాంకేతిక ఆలోచన ఇప్పుడు మొబైల్‌ ఫోన్లలో వైఫై సౌకర్యానికి దగ్గరగా ఉండడం విశేషం. ‘సీక్రెట్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్‌’గా ఈమె పేటెంట్‌ తీసుకున్న ఆలోచన, రెండో ప్రపంచ యుద్ధంలో మిసైల్స్‌కి సంకేతాలు ఆపే శత్రు సైనికుల ఆటలు కట్టించేలా ఉపయోగపడుతుందని ఈమె ప్రకటించింది. ఈ పరిశోధన ద్వారా అందమే కాదు, అపారమైన తెలివితేటలు కూడా గల అమ్మాయిగా గుర్తింపు పొందింది లామర్‌.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.