జనవరి 11.. (సినీ చరిత్రలో ఈరోజు)

* కుటుంబ సందేశం ‘తోడికోడళ్లు’...ఉమ్మడి కుటుంబంలో తలెత్తే చిన్న చిన్న తగాదాలకు ఈర్ష్యాద్వేషాలు తోడైతే ఎలాంటి దారుణ పరిణామాలు సంభవిస్తాయో చెబుతూ, ఏనాటికీ ఆప్యాయతాభిమానాలను మరిచిపోరాదని చెప్పే ‘తోడికోడళ్లు’ సినిమా, తెలుగు నాట విజయ ఢంకా మోగించింది. బెంగాలీ నవల ‘నిష్కృతి’ ఆధారంగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించిన ఈ సినిమాకు ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, ఎస్వీ రంగారావు, జగ్గయ్య, రేలంగి, సూర్యకాంతం, కన్నాంబలాంటి మహామహుల నటనా వైదుష్యాన్ని సినిమాలో చూడవచ్చు. ‘అన్నపూర్ణా’ బ్యానర్‌పై దుక్కిపాటి మధుసూదన రావు నిర్మాణ సారధ్యంలో వచ్చిన ఈ సినిమాలో సంగీత దర్శకుడు మాస్టర్‌ వేణు స్వరపరిచిన పాటలు, ఆచార్య ఆత్రేయ మాటలు ప్రజాదరణ పొందాయి. ఈ సినిమా 1957 జనవరి 11న విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందింది.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* విజయాల దర్శకుడు!
(వి.మధుసూదనరావు వర్థంతి-2012)


సినిమాల్లోకి వచ్చాక ఆ దర్శకుడి ఇంటిపేరు మారిపోయింది. ఆయన పేరు ‘వీరమాచనేని మధుసూదన రావు’ అయితే, అందరూ మాత్రం ‘విక్టరీ మధుసూదన రావు’ అనడం మొదలు పెట్టారు. అలా ఎందుకు జరిగిందనే సందేహం వస్తే ఆయన సినిమాలు చూడాలి. చూశాక ఇక సందేహమే ఉండదు. కృష్ణా జిల్లాలో 1923 జూన్‌ 14న పుట్టిన మధుసూదనరావు, తెలుగు సినీ రంగంపై విజయవంతమైన ముద్రనే వేశారు. దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా ఆయన ఎలాంటి ప్రభావం చూపారో, ‘జమీందార్‌’, ‘అంతస్తులు’, ‘ఆరాధన’, ‘ఆత్మబలం’, ‘గుడిగంటలు’, ‘వీరాభిమన్యు’, ‘ఆత్మీయులు’, ‘కృష్ణవేణి’, ‘మనుషులు మారాలి’, ‘భక్త తుకారాం’, ‘జేబుదొంగ’, ‘చక్రవాకం’, ‘మల్లెపూవు’ లాంటి సినిమాలే చెబుతాయి. ‘అంతస్తులు’ సినిమాకి జాతీయ అవార్డు, జీవిత కాల సాఫల్యతకు రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్న మధుసూదనరావు, 2012 జనవరి 11న తన 89వ ఏట హైదరాబాద్‌లో మరణించారు.

(ప్రత్యేక వార్త కోసం క్లిక్‌ చేయండి...)

* సృజనాత్మక దర్శకుడు
(సుకుమార్‌ పుట్టిన రోజు-1970)తొలి చిత్రంతోనే తన ప్రత్యేతకని చాటుకొన్న దర్శకుడు సుకుమార్‌. పూర్వాశ్రమంలో లెక్కల మాస్టర్‌ అయిన సుకుమార్‌ తెరకెక్కించే చిత్రాల్లో కూడా ఆ ప్రభావం కనిపిస్తూనే ఉంటుంది. పజిల్‌ని తలపిస్తూ సాగే కథ, కథనాలు ప్రేక్షకులకు తీయటి అనుభూతిని పంచుతుంటాయి. అయితే అలాంటి చిక్కుముడులేవీ లేకుండానూ తాను సినిమాలు తీయగలనని ‘రంగస్థలం’తో నిరూపించారాయన. సృజనాత్మక దర్శకుడిగా పేరు తెచ్చుకొన్నారు. తీసింది తక్కువ సినిమాలే అయినా... ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ అగ్ర దర్శకుడిగా కొనసాగుతున్నారు సుకుమార్‌. ఆయన తూర్పు గోదావరి జిల్లా, రాజోలుకి సమీపంలోని మట్టపాడులో తిరుపతిరావు నాయుడు, వీరవేణి దంపతులకి 1970 జనవరి 11న జన్మించారు. చిన్నప్పట్నుంచే పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకున్న ఆయన ఊళ్లో ఉన్న గ్రంథాలయంలోని పుస్తకాలన్నింటినీ చదివేశారు. పాఠశాలలోనే కవితలు రాయడం అలవాటు చేసుకొన్నారు. గణితంపై పట్టు పెంచుకొన్న ఆయన చదువుకొంటూనే రాజోలులో ట్యూషన్లు చెప్పేవారు. కాకినాడలో ఓ పెద్ద కళాశాలలో అధ్యాపకుడిగా ఉద్యోగం పొందిన ఆయన ఆ తర్వాత సినిమాలపై మక్కువతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మొదట్లో ఎడిటర్‌ మోహన్‌ దగ్గర శిష్యరికం చేసిన ఆయన 2004లో ‘ఆర్య’తో దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని అందుకొన్న ఆయన ఆ తర్వాత రామ్‌తో ‘జగడం’ చేశారు. ఆ చిత్రం పరాజయాన్ని చవిచూసినా సుకుమార్‌కి దర్శకుడిగా మంచి పేరే వచ్చింది. ‘ఆర్య2’తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన సుకుమార్‌ ‘100%లవ్‌’తో ఘన విజయాన్ని సొంతం చేసుకొన్నారు. మహేష్‌బాబుతో ‘1 నేనొక్కడినే’ తీసే అవకాశాన్ని అందుకొన్నారు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ చిత్రం పరాజయాన్ని చవిచూసింది. ‘నాన్నకు ప్రేమతో’, ‘రంగస్థలం’ చిత్రాలతో వరుస విజయాలు అందుకొన్న సుకుమార్, ప్రస్తుతం మహేష్‌బాబుతో సినిమా కోసం కథని సిద్ధం చేస్తున్నారు. సుకుమార్‌ నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. సుకుమార్‌ రైటింగ్స్‌ పేరుతో నిర్మాణ సంస్థని ప్రారంభించిన ఆయన అందులోనే తన స్నేహితులతో కలిసి ‘కుమారి 21 ఎఫ్‌’, ‘దర్శకుడు’ చిత్రాల్ని నిర్మించారు. సుకుమార్‌కి భార్య తబితతోపాటు, అమ్మాయి సుకృతివేణి, అబ్బాయి సుక్రాంత్‌ ఉన్నారు. ఈ రోజు సుకుమార్‌ పుట్టినరోజు.

* వి‘జయ’వంతమైన ప్రస్థానం
(బి. జయ జయంతి-1964)


తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకులుగా రాణించిన మహిళలు అరుదు. విజయనిర్మల తర్వాత ఆ పరంపరని కొనసాగిస్తూ వరుసగా సినిమాలు తీసి, విజయాల్ని అందుకొన్న దర్శకురాలు బి.జయ. మహిళా దర్శకులు అనగానే సెంటిమెంట్‌ కథలు, లేదంటే మహిళా పక్షపాతంతో కూడిన కథలే ఎక్కువగా గుర్తుకొస్తాయి. కానీ ఆ హద్దుల్ని దాటుకొని ఫక్తు వాణిజ్య ప్రధానమైన సినిమాలు చేసి శెభాష్‌ అనిపించుకొన్నారు బి.జయ. ఆమె తీసిన ‘చంటిగాడు’, ‘ప్రేమికులు’, ‘గుండమ్మగారి మనవడు’, ‘సవాల్‌’, ‘లవ్‌లీ’, ‘వైశాఖం’ చిత్రాలు ఇంటిల్లిపాదినీ అలరించాయి. జయ ఆరో తరగతి నుంచే రచనా వ్యాసంగం మొదలుపెట్టారు. విజయవాడ మాంటిసోరీ పాఠశాలలో చదువుతుండగానే ‘మనుషుల్లో రకాలు’ అనే కవిత రాసి పేరు తెచ్చుకొన్నారు. ఆ తర్వాతా ఆమె వేసిన వందకిపైగా క్యారికేచర్లు, కార్టూన్లూ తెలుగు, తమిళ, ఆంగ్ల భాషలకి చెందిన పలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. యాభైకి పైగా కథలతోపాటు, కొన్ని నవలలు, ధారావాహికలు రాసి పేరు తెచ్చుకొన్నారు. వనిత పత్రికలో ప్రచురితమైన ‘ఆనందో బ్రహ్మ’ కథకిగానూ జాతీయ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. అలాగే ఆ కథని పద్నాలుగు భాషల్లో అనువదించింది అకాడమీ. ‘స్పర్శ’ కథకి సంక్రాంతి పురస్కారం లభించింది. ‘నీతి’ అనే కథతో చక్రపాణి పురస్కారం అందుకొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని సిద్ధాంతంలో 1964 జనవరి 11న జన్మించిన జయ.. తండ్రి ఉద్యోగం వల్ల కాకినాడ, విజయవాడ, చెన్నైలో విద్యాభ్యాసం కొనసాగించారు. చెన్నై విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్‌ లిటరేచర్‌లో ఎమ్‌.ఎ చేసిన ఆమె, అక్కడ్నుంచే జర్నలిజంలో డిప్లొమా చేశారు. అన్నామలై విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీలో ఎమ్‌.ఎ పట్టా అందుకొన్నారు. 1986 నుంచి ఆంధ్రజ్యోతిలో పాత్రికేయురాలిగా ప్రయాణం మొదలుపెట్టారు. అక్కడ పనిచేస్తూనే పాత్రికేయుడు, నిర్మాత అయిన బి.ఎ.రాజుని వివాహం చేసుకొన్నారు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్, జ్యోతిచిత్ర పత్రికల్లోనూ పనిచేసిన ఆమె తన భర్తతో కలిసి సూపర్‌హిట్‌ పత్రికని స్థాపించారు. 1995 నుంచి మరణించేవరకు ఆ పత్రికకి ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌గా పనిచేశారు. రచనా వ్యాసంగంపై ఉన్న పట్టుతో మెగాఫోన్‌ పట్టారు బి.జయ. ‘చంటిగాడు’ తీసి తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకొన్నారు. ఆ తర్వాత ‘ప్రేమికులు’, ‘గుండమ్మగారి మనవడు’, ‘సవాల్‌’, ‘లవ్‌లీ’ తీసి విజయాల్ని అందుకొన్నారు. చివరిగా ‘వైశాఖం’ తీసి విజయాన్ని అందుకొన్నారు. భర్త బి.ఎ.రాజు నిర్మించిన ‘ప్రేమలో పావని కల్యాణ్‌’ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా, ‘చంటిగాడు’ చిత్రానికి పంపిణీదారులుగా కూడా పనిచేశారు. రచయిత్రిగానే కాకుండా, దర్శకురాలిగా కూడా పలు పురస్కారాలు సొంతం చేసుకొన్న బి.జయ 30 ఆగస్టు 2018న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఆమెకి ఇద్దరు కుమారులున్నారు. రెండో కుమారుడు శివ కుమార్‌ తన తల్లి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ‘వర్కౌట్‌ అయ్యింది’ చిత్రంతో మెగాఫోన్‌ చేతపట్టారు. త్వరలోనే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రోజు బి.జయ జయంతి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.