హాలీవుడ్‌ నటుడి ‘బాహుబలి 3’ కోరిక!

తెలుగు చిత్రసీమ ఖ్యాతిని ‘బాహుబలి’ చిత్రాలతో విశ్వవ్యాప్తం చేశారు దర్శకుడు రాజమౌళి. ఈ ప్రాంతీయ దృశ్య కావ్యాలకు అంతర్జాతీయంగా లభించిన ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రాలు ప్రపంచ బాక్సాఫీస్‌ ముందు దాదాపు రూ.2వేల కోట్ల పై చిలుకు వసూళ్లు సాధించి రికార్డు సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే జక్కన్న ‘బాహుబలి 3’ కూడా తీస్తే బాగుంటుందని సినీ ప్రియులు ఆశించారు. అయితే తాజాగా ఓ హాలీవుడ్‌ నటుడు చేసిన వ్యాఖ్యలతో ఈ చిత్ర సీక్వెల్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. ‘అవెంజర్స్‌: ది ఎండ్‌ గేమ్‌’లో ప్యూరీ పాత్రను పోషించిన జాక్సన్‌ శ్యాముల్‌ యూట్యూబ్‌కు తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ‘‘మీరు భారత్‌కు వెళ్తారా’’ అని ప్రశ్నించగా.. ‘‘నాకు పని కల్పిస్తే తప్పకుండా వెళ్తా’’ అని ఆయన బదులిచ్చారు. అనంతరం ‘‘బాలీవుడ్‌లో పనిచేస్తారా?’’ అని అడగ్గా.. ‘‘బాహుబలి 3’ కోసం పనిచేయాలనుంద’’ని మనసులో మాట బయటపెట్టారు. దీంతో మరోసారి ‘బాహుబలి’ వార్తల్లో నిలిచింది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.