జానీ డెప్‌...కర్ణుడి చావూ!

‘ఆయన నటించే పాత్రల స్వభావమే కాదు, ఆయన స్వభావమూ అంతే! అచ్చంగా దోపిడీ దొంగ’ అంటూ తీవ్రమైన అభియోగాలు చేస్తున్నారు జానీ డెప్‌ దగ్గర ఇంతకాలమూ పనిచేసిన బాడీగార్డ్స్‌ కొందరు. ‘ఆయన మాకు జీతాలు ఎగగొట్టాడు’ అంటూ వారు కోర్టుకెక్కారు. జానీ డెప్‌కు కనీసం 650 మిలియన్‌ డాలర్ల ఆస్తి ఉందని అంచనా. మరి, బాడీ గార్డులకు కూడా ఇవ్వలేని దీన పరిస్థితి ఆయనకు ఎందుకు వచ్చిందని చాలామంది ఆరా తీశారు. ఆయన వ్యసనాల వల్ల ఆస్తి అంతా హారతి కర్పూరంలా హరించుపోయిందని తెలుస్తోంది. ఫాస్టకార్స్‌, ఫాస్ట్‌ జెట్‌ ప్లేన్స్‌, విల్లాస్‌, యాచెన్‌ (విలాసవంతమైన పడవలు), సొంత ద్వీపాలు (పసిఫిక్‌ ఐల్యాండ్స్‌), వైన్స్‌ (మద్యం), మహిళలు, ఇవన్నీ ఆయన ఖరీదైన వ్యసనాలే! ఆయన ఎందుకు, ఎవరి కోసం, ఎంత ఖర్చు పెడతాడో దేవుడు కూడా చెప్పలేడని అంటుంటారు. ‘21 జంప్‌ స్ట్రీట్‌’, ‘చాకొలెట్‌’, ‘వాటీజ్‌ ఈటింగ్‌ గిల్బర్ట్‌ గ్రేప్‌?’ వంటి సినిమాలతోబాటు ‘పైరేట్స్‌’ సిరీస్‌లో నటించిన ఆయనపై ఆరోపణలు, చెడు వార్తలూ ప్రబలేకొద్ది, ఆయన సినిమాలు తగ్గుతూ వచ్చాయి. కర్ణుడి చావుకు పదివేల కారణాలు అన్నట్లుగా, జానీ డెప్‌ పతనానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిలో, ఇప్పుడు నిర్మాణంలో ఉన్న డిస్నీవారి ఆరో ‘పైరేట్స్‌’ సినిమా ఏమైనా ఆయన్ను కాపాడితే కాపాడాలి...అంతే! లేకపోతే, ఆయన గతి అధోగతేనని హాలీవుడ్‌ కోడై కూస్తోంది!


© Sitara 2018.
Powered by WinRace Technologies.