‘అవెంజర్స్’ చిత్రాల్లోని థార్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్ హెమ్స్ వర్త్. ప్రస్తుతం ఈ హాలీవుడ్ స్టార్ ‘మెన్ ఇన్ బ్లాక్: ఇంటర్నేషనల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జూన్ 14న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. తన కూతురుకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం పంచుకున్నాడు. హేమ్స్ తన తనయకు ఇండియా అని పేరు పెట్టుకున్నట్లు గతంలోనే ఓసారి ప్రకటించారు. కానీ, ఈ పేరే పెట్టడానికి గల కారణమేంటో చెప్పలేదు. అయితే తాజాగా ఓ మీడియా ప్రతినిధి ఈ విషయంపై ప్రశ్నించగా.. ఆసక్తికరమైన సమాధానమిచ్చారు. ‘‘నా భార్య ఎల్సా వృత్తిరిత్యా చాలా కాలం ఇండియాలో గడిపింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఆ దేశంతో ఓ ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు తన మనసుకు ఎంతో దగ్గరయ్యాయి. నాకు కూడా భారత్‌పై ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఇండియాలో ఎప్పుడైనా ఔట్ డోర్ షూటింగ్ చేయడమంటే చాలా ఇష్టం. అలా చిత్రీకరణ జరిపే సమయంలో చుట్టుపక్కల వాళ్లు వేలాదిగా తరలి వచ్చి మా షూటింగ్ చూడటం, ఆ సమయంలో వారు నన్ను గుర్తుపట్టి థార్ అని పిలుస్తుండటం చాలా ఉద్వేగభరితంగా అనిపించేది. ఇలా మా ఇద్దరికీ ఆ దేశంపై ప్రత్యేక అభిమానం ఉండటం వల్లే మా కూతురుకు ఇండియా అనే పేరు పెట్టుకున్నాం’’ అని హేమ్స్ చెప్పుకొచ్చాడు.
