‘అవెంజర్స్‌’ వల్లే ‘అవతార్‌ 2’పై నమ్మకం ఏర్పడింది..

‘అవతార్‌’కు సీక్వెల్‌గా ‘అవతార్‌ 2’ని తెరకెక్కించే పనిలో ఉన్నారు దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌. ఈ సినిమా విజయంపై తను దీమాగా ఉండటానికి కారణం ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ అంటున్నారు కామెరూన్‌. ‘అవతార్‌’ రికార్డును 2.796 బిలియన్‌ డాలర్ల వసూళ్లు సాధించి ‘అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌’ బద్దలుకొట్టడం, ఆ సందర్భంగా ‘అవెంజర్స్‌’ చిత్రబృందాన్ని జేమ్స్‌ కామెరూన్‌ ప్రశంసించిన విషయం తెలిసిందే. తాజాగా జేమ్స్‌కామెరూన్‌ మాట్లాడుతూ ‘‘అవెంజర్స్‌’ చిత్రం నాలో ఎంతో నమ్మకాన్ని నింపింది. థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలనే కోరిక ప్రేక్షకుల్లో ఇంకా అలా బతికే ఉందనే ఆ సినిమా సాధించిన వసూళ్లతో నిరూపితమైంది. ‘అవతర్‌ 2’, ‘అవతార్‌ 3’కు సంబంధించి నాకున్న ఆందోళనంతా మార్కెట్‌ గురించే. చుట్టూ తెలియనివాళ్ల మధ్య చీకటి గదిలో కూర్చొని ఏదో చూడాలనే ఆశ ప్రేక్షకుల్లో ఇంకా అలానే ఉందని అవెంజర్స్‌ వసూళ్లతో అర్థమైంది. ‘అవెంజర్స్‌’ లాగే ‘అవతార్‌ 2’, ‘అవతార్‌ 3’ చిత్రాలు భారీ విజయం సాధించొచ్చు. లేదంటే ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. కానీ మా ప్రయత్నం అయితే వందశాతం చేస్తాం. వినోదం కోసం సినిమాకు ప్రత్నామ్నాయంగా ఎన్నొచ్చినా సినిమా పట్ల ప్రేక్షకాదరణ తగ్గకపోవడం మాత్రం సంతోషించదగ్గ విషయం’’అని చెప్పారు. ‘అవతార్‌ 2’ని 2021 డిసెంబరు 17న, ‘అవతార్‌ 3’ని 2023 డిసెంబరు 22న విడుదల చేయనున్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.