‘అవతార్‌’ టైటిల్స్‌పై కామెరూన్‌ క్లారిటీ!!
                                 

ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ సృష్టించిన అనేక అపురూప చిత్రాల్లో ‘అవతార్‌’ సినిమా మరింత ప్రత్యేకమైనది. 2009లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ దృశ్యకావ్యం సినీప్రియులందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. ఈ సినిమాతో అద్భుత సాంకేతిక మాయాజాలాన్ని, ‘పండోరా’ అనే ఓ విచిత్ర గ్రహాన్ని, సరికొత్త జంతుజాలాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు కామెరూన్‌. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా 2.78 బిలియన్‌ డాలర్ల వసూళ్లు రాబట్టారు. ఓ చక్కని చందమామ కథలా ప్రేక్షకలోకాన్ని అలరించిన ఈ సినిమాకు ఇప్పుడు ‘అవతార్‌ 2’, ‘అవతార్‌ 3’, ‘అవతార్‌ 4’ల రూపంలో సీక్వెల్‌లు రాబోతున్నాయి. వీటిలో ‘అవతార్‌ 2’ ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకోగా.. ‘అవతార్‌ 2, 3’ నిర్మాణ దశలో ఉన్నాయి. వీటి తర్వాత ‘అవతార్‌ 5’ కూడా పట్టాలెక్కుతుంది. ఇదిలా ఉండగా.. ఆ మధ్య ఈ సీక్వెల్స్‌కు సంబంధించిన టైటిళ్లు లీక్‌ అయ్యాయి. ఈ సీక్వెల్స్‌కు వరుసగా ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’, ‘అవతార్‌: ది సీడ్‌ బేరర్‌’, ‘అవతార్‌: ది తుల్కున్‌ రైడర్‌’, ‘అవతార్‌: ది క్వస్ట్‌ ఫర్‌ ఈవా’ పేర్లను ఖరారు చేసినట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ అంశంపై స్పందించారు కామెరూన్‌. ‘‘మేము అవే పేర్లు ఖరారు చేస్తున్నామని కానీ, చేయట్లేదని కానీ నేను చెప్పట్లేదు. మా బృందంతో చర్చల సందర్భంగా కొన్ని టైటిల్స్‌ అనుకున్నాం. కానీ, వేటిపైనా మేం తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్నవాటిలో కొన్ని అసంబద్ధంగా, నవ్వుతెప్పించే విధంగా ఉన్నాయి. రెండో సీక్వెల్‌ను 2020 డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రాన్ని డిస్నీ, ఫాక్స్‌ సంస్థలు సంయుక్తంగా విడుదల చేయబోతున్నాయి.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.