హాలీవుడ్‌లో ఝాన్సీ లక్ష్మీబాయ్‌ జీవితకథ

వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్‌ జీవితకథతో ఇప్పటికే బాలీవుడ్‌లో ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హాలీవుడ్‌లోనూ ఝాన్సీ లక్ష్మీబాయ్‌ కథ తెరకెక్కుతోంది. ఓ భారతీయ మహిళ ప్రధాన పాత్రతో హాలీవుడ్‌లో తొలిసారిగా తీస్తున్న సినిమా ఇది. ‘ది వారియర్‌ క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ పేరుతో ఆంగ్లం, మరాఠీ భాషల్లో ఈ చిత్రం రాబోతోంది. భారతీయ మూలాలున్న అమెరికన్‌ నటి దేవికా భిషె ప్రధాన పాత్రలో నటించింది. ఈమె గతంలో శ్రీనివాస రామానుజన్‌ బయోపిక్‌ ‘ది మ్యాన్‌ హూ న్యూ ఇన్ఫినిటీ’లో రామానుజన్‌ భార్యగా నటించింది. భరతనాట్య కళాకారిణి స్వాతి భిషె ‘ది వారియర్‌ క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’కి దర్శకత్వం వహిస్తోంది. ఈ చిత్రం గురించి దేవిక మాట్లాడుతూ ‘‘భారతీయ వీరనారి ధైర్యసాహసాలను ప్రపంచ ప్రేక్షకులకు చూపించబోతున్నాం. నా పాత్ర కోసం గుర్రపు స్వారీ నేర్చుకున్నాను. భారత్‌కు ప్రత్యేకంగా వచ్చి ప్రముఖ కలరిపయట్టు గురువు గోపకుమార్‌ గురుక్కల్‌ దగ్గర యుద్ధవిద్యలు సాధన చేశాను. మరాఠీలో సంభాషణలు చెప్పడానికి కూడా చాలా కసరత్తు చేశాను’’ అని చెప్పారు. ఈనెల 29న ఈ చిత్రం విడుదలవుతోంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.