మామూలు అమ్మాయి యువరాణి అయితే?

అమాయకురాలు... బిడియస్తురాలు... సాధారణ మధ్య తరగతి కుటుంబం... నలుగురిలో మాట్లాడాలంటేనే భయం... అలాంటి ఓ అమ్మాయికి హఠాత్తుగా తను ఓ దేశపు యువరాణి అని తెలిస్తే? తన చుట్టూ ప్రపంచం ఎలా మారిపోయింది? తనను తాను ఎలా మార్చుకుంది? ఇవన్నీ కలిస్తే ‘ద ప్రిన్సెస్‌ డయరీస్‌’ (2001) సినిమా. వాల్ట్‌డిస్నీ సంస్థ, అమెరికా రచయిత్రి మెగ్‌ క్యాబట్‌ రాసిన నవల ఆధారంగా తీసిన ఈ సినిమా అనూహ్యమైన విజయం సాధించింది. కేవలం 26 మిలియన్‌ డాలర్ల వ్యయంతో తీసిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 165.3 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. హాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకున్న నటి, గాయని అన్నే హాథ్‌వే నటించిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. ఈ సినిమాతో ఆమె జాతకమే మారిపోయింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ద ప్రిన్సెస్‌ డయరీస్‌2: రాయల్‌ ఎంగేజ్‌మెంట్‌’ (2004) సినిమా కూడా విజయవంతమైంది.


కథలోకి వస్తే... హైస్కూలు విద్యార్థిని మియా, ఒంటరిగా ఉండే తన తల్లితో ఓ పాడుపడిన షెడ్డులో నివాసం ఉంటుంది. ఎవరితోనూ కలవడానికి ఇష్టపడని ఆమె ఓ అబ్బాయి అంటే ఇష్ట పడుతుంది. ఆ సమయంలో ఆమె నాన్నమ్మ ఆమెకో రహస్యం చెబుతుంది. ఆమె యూరప్‌ దేశం జెనోవియా యువరాణి అనేదే ఆ రహస్యం. ఆపై ఆమెను యువరాణిగా ఎలా మసలుకోవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నవ్వాలో, ఎలా నడవాలో తర్ఫీదు ఇవ్వడం మొదలు పెడుతుంది. ఈ లోగా ఈ వార్త మీడియాకు తెలుస్తుంది. రాత్రికి రాత్రి ఆమె సెలబ్రిటీ అయిపోతుంది. జెనోవియాలో తన తండ్రి చనిపోవడంతో, ఆయన ఆఖరి కోరిక మేరకు ఆ దేశపు యువరాణిగా వెళ్లాల్సి వస్తుంది. కానీ అకస్మాత్తుగా తన జీవితంలో ఏర్పడిన మార్పు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తన ప్రేమను కూడా వదులుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. ఈ నేపథ్యంలో ఆమె ఏం చేసింది? తన వారసత్వాన్ని వదులుకుందా? మామూలు జీవితాన్నే కోరుకుందా? అనేదే కథ. వినోదాత్మకంగా తీసిన ఈ సినిమా యువతను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు ఎన్నో పురస్కారాలు అందుకుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.