
అమెరికా కామిక్ పుస్తకాల్లో మానవాతీత శక్తులున్న సూపర్‌హీరోలు చాలా మంది పుట్టుకొచ్చారు. వాళ్లంతా ఆ తర్వాత టీవీల్లో జొరబడి సందడి చేశారు. ఆపై వెండితెరపైకి దూకి వసూళ్ల వర్షం కురిపించారు. సూపర్‌మ్యాన్, స్పైడర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్, ఐరన్‌మ్యాన్, బర్డ్మ్యాన్లాంటి విచిత్ర శక్తుల, వింత రూపాల హీరోలే వీళ్లంతా. వీరిలో కావాలనుకున్నప్పుడల్లా గబ్బిలం ఆకారంతో గగన విహారం చేస్తూ అద్భుత శక్తులతో అక్రమార్కుల పని పట్టే బ్యాట్‌మ్యాన్ ఆధారంగా హాలీవుడ్లో సీక్వెల్ సినిమాలు సందడి చేశాయి. ఇవన్నీ వందల కోట్ల డాలర్లను కురిపించి విజయవంతమయ్యాయి. అలా తొలిసారిగా వచ్చిన బ్యాట్‌మ్యాన్ సినిమా 1989 విడుదలై కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకుని ఈ కథలను వీడియోలుగా విడుదల చేస్తే అవి కూడా అమ్మకాల్లో రికార్డు సృష్టించాయి.