పెద్దింటి అబ్బాయి... పేదింటి అమ్మాయి
తీసింది 30 మిలియన్‌ డాలర్ల ఖర్చుతో...

వసూలు చేసింది 238.5 మిలియన్‌ డాలర్లు!

దీనికి సాయం ప్రశంసలు... పురస్కారాలు!

‘క్రేజీ రిచ్‌ ఆసియన్స్‌’ (2018) సినిమా సాధించిన విశేషాలివి.


ఓ సాధారణ మధ్య తరగతి అమ్మాయి, ఓ భాగ్యవంతుడితో ప్రేమలో పడడం, అందుకు ఏర్పడిన అవాంతరాలతో అన్ని భాషల్లోనూ అనేక సినిమాలు వచ్చాయి. అలాంటి సినిమానే ఇది. అమెరికా రచయిత కెవిన్‌ క్వాన్‌ 2013లో రాసిన నవల ఆధారంగా తీసిన ఈ సినిమాకు జోన్‌ ఎమ్‌. చు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో మరో విశేషం ఉంది. అదేంటంటే, సినిమా నటీనటుల్లో అత్యధికులు ఆసియాకు చెందిన వారే.

కథలోకి తొంగి చూస్తే... న్యూయార్క్‌లో ప్రొఫెసర్‌గా పనిచేసే ఓ అమ్మాయి, సింగపూర్‌కి చెందిన ఓ అబ్బాయితో చదువుకునే రోజుల్లో ప్రేమలో పడుతుంది. ఆపై ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు అనుకోకుండా మరో స్నేహితురాలి పెళ్లి కోసం సింగపూర్‌ వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్లాక, తను ప్రేమించిన అబ్బాయి అక్కడ చాలా సంపన్నవంతమైన కుటుంబానికి చెందిన వాడని, సమాజంలో పైస్థాయికి చెందిన వాడని తెలుస్తుంది. అబ్బాయి ఆమెను తన తల్లికి పరిచయం చేస్తాడు. ఆమెకు తన కొడుకు ఈ అమ్మాయిని చేసుకోవడం ఇష్టం ఉండదు. తన కొడుకును మర్చిపొమ్మని హెచ్చరిస్తుంది. ఆమె తిరిగి న్యూయార్క్‌ ప్రయాణమవుతుంటే ఆ అబ్బాయి వచ్చి, ఆమె కోసం కుటుంబాన్నే వదులుకుంటానని చెబుతాడు. ఇలాంటి సన్నివేశాల మధ్య అనేక మలుపులతో రొమాంటిక్‌ కామెడీగా కథ నడుస్తుంది. ఈ సినిమా విజయవంతం కావడంతో దీనికి కొనసాగింపుగా ‘చైనా రిచ్‌ గర్ల్‌ఫ్రెండ్‌’, ‘రిచ్‌ పీపుల్‌ ప్రోబ్లెమ్స్‌’ అనే సినిమాలను రూపొందిస్తున్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.