16 పాటల హాలీవుడ్‌ సినిమా

బహుశా ఏ సినిమాకీ అంత ఎడిటింగ్‌ చేసి ఉండరు. కేవలం 94 నిమిషాల సినిమా కోసం ఏకంగా 90 గంటల ఫుటేజిని పరిశీలించి ఎడిట్‌ చేశారు. ఇది దాదాపు 10 లక్షల అడుగుల ఫిల్మ్‌కి సమానం! ఇలాంటి అరుదైన విశేషం ఉన్న సినిమా ‘డివైన్‌ మ్యాడ్‌నెస్‌’ (1980). ఈ సినిమాలో మరో విశేషం ఏమిటంటే ఇందులో ఏకంగా 16 పాటలు ఉన్నాయి. ఈ విశేషాలు అర్థం కావాలంటే ఆ సినిమా గురించి తెలుసుకోవాలి. అమెరికాలో బెట్టీ మిడ్లర్‌ అనే గాయని గురించి తెలియని వారుండరు. గాయనిగా, గీత రచయిత్రిగా, నటిగా, కమేడియన్‌గా, సినీ నిర్మాతగా బహుముఖంగా ప్రాచుర్యం పొందిన ఆమె ప్రస్థానం సంచలనాత్మకమే. అయిదు దశాబ్దాల పాటు వినోద రంగాన్ని శాసించిన ఆమె ఆల్బమ్‌లు, పాటలు ప్రపంచవ్యాప్తంగా 3 కోట్లు అమ్ముడయ్యాయంటే ఆమె ప్రతిభ ఎలాంటిదో అర్థమవుతుంది. ఆమె ఎక్కడ ప్రదర్శనలు ఇచ్చినా లక్షలాది మంది హాజరై ఉర్రూతలూగిపోయేవారు. అలాంటి గాయని కాలిఫోర్నియాలోని ఓ వేదికపై వరసగా నాలుగు రోజుల పాటు ఇచ్చిన ప్రదర్శనలను చిత్రీకరించి, ఆ ఫుటేజిని ఎడిట్‌ చేసి విడుదల చేసిన సినిమానే ‘ద డివైన్‌ మ్యాడ్‌నెస్‌’. ఓ గాయని ప్రదర్శనలను క్రోడీకరించి ఓ సినిమాగా విడుదల చేయడమే అరుదైన విషయం అనకుంటే, ఆ సినిమా విజయవంతంగా ఆడి మంచి వసూళ్లు సాధించడం మరో విశేషం.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.