హత్య కేసు పరిశోధనలో ప్రేమ
ఓ అందమైన యువతి హత్య కేసు పరిశోధనకు వచ్చిన డిటెక్టివ్‌ ఆమెతోనే ప్రేమలో పడడం సాధ్యమేనా? సాధ్యమే... అది సినిమా అయినప్పుడు. పైగా హాలీవుడ్‌ సినిమా అయినప్పుడు. ఇంకా అనేక మలుపులతో కూడిన థ్రిల్లర్‌ సినిమా అయినప్పుడు. అలాంటి సినిమానే ‘లారా’ (1944). ఇది ఆస్కార్‌ అవార్డు అందుకోవడంతో పాటు ‘మేటి పది మిస్టరీ సినిమాలు’ జాబితాలోను, ‘100 సినిమాలు... 100 థ్రిలర్లు’ జాబితాలోను స్థానం సంపాదించింది. అమెరికా రచయిత్రి వేరా కాస్పరీ రాసిన నవల ఆధారంగా తీసిన ఈ సినిమాకు ఒట్టో లుడ్విగ్‌ ప్రెమింగర్‌ దర్శకత్వం వహించాడు. ఒకప్పుడు గొప్ప అందాల తారగా ప్రాచుర్యం పొందిన జీన్‌ టియర్నీ ప్రధాన పాత్రలో నటిస్తే, ఆమె హత్య కేసును పరిశోధించే డిటెక్టివ్‌గా డానా ఆండ్రూస్‌ నటించాడు.


‘లారా’ అనే ఓ అందమైన యువతి హత్యతో సినిమా మొదలవుతుంది. ఆమెను ఎవరు హత్య చేశారో తెలుసుకోడానికి డిటెక్టివ్‌ ఆమె సన్నిహితులను కలిసి మాట్లాడుతుంటాడు. వారిలో చాలా మంది ఆమెను ప్రేమిస్తూనో, ఆరాధిస్తూనో, ఇష్టపడుతూనో ఉన్నారని అర్థం అవుతుంది. ఆమె గురించి తెలుసుకున్న కొద్దీ ఆమె పట్ల అభిమానాన్ని పెంచుకుంటాడు డిటెక్టివ్‌. అయితే ఆమె నిజంగా చనిపోలేదని అతడు కనుగొంటాడు. ఎవరో చనిపోతే ఆమె చనిపోయినట్లు చిత్రించారని తెలుసుకుంటాడు. కేసు మరింత జటిలమవుతుంది. కొన్ని ఆధారాలతో లారానే అరెస్ట్‌ చేసినా, ఆ తర్వాత ఆమె అమాయకురాలని తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే కథ. చివరికి ఆమెను నిజంగా చంపడానికి తెగించిన హంతకుడిని ఆఖరి నిముషంలో పట్టుకోవడంతో సినిమా ముగుస్తుంది. అడుగడుగునా మలుపులతో తీసిన ఈ సినిమా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.