సినిమాలో సినిమా

సినిమా తారల జీవితాలే ఆధారంగా అల్లుకున్న కథలు కొత్తేమీ కాదు. సినిమాలో సినిమాగా ఇలాంటి కథలు అన్ని భాషల్లోనూ వచ్చాయి. ఈ తరహా సినిమాలకు హాలీవుడ్‌ ఎప్పుడో నాంది పలికింది. అలాంటి వాటిలో ఒకటే ‘సన్‌సెట్‌ బౌలెవార్డ్‌’ (1950) సినిమా. అవకాశాలు లేని ఓ స్క్రీన్‌ప్లే రచయిత, సినీరంగం నుంచి కనుమరుగైపోయినా ఆ భ్రమల నుంచి బయట పడని ఓ అందాల తారల కథగా ఇది కనిపిస్తుంది. ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా, 11 ఆస్కార్‌ అవార్డులకు నామినేషన్స్‌ పొంది మూడు అవార్డులను గెల్చుకుంది. హాలీవుడ్‌ సినీ రంగంలో పరిస్థితులకు అద్దం పట్టేలా తీసిన ఈ సినిమా వంద మేటి అమెరికన్‌ చిత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. దాదాపు 1.75 మిలియన్‌ డాలర్లతో తీసిన ఇది, 5 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. ఈ సినిమాలో హాలీవుడ్‌ ప్రముఖులు వాళ్ల పాత్రల్లో వాళ్లే నటించడం విశేషం. ప్రముఖ దర్శకుడు సిసిల్‌ బి. డెమిల్లే, నటి హెడ్డా హోపర్, నటులు హెచ్‌.బి. వార్నర్, హెన్రీ విల్‌కాక్సన్‌ తమ నిజపాత్రల్లోనే కనిపిస్తారు. మూకీ చిత్రాల్లో తారలుగా వెలుగొంది, ఆ తర్వాత తెరమరుగైన కొందరి జీవితాల ఆధారంగా ఈ కథను అల్లుకున్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.