క్రైం థ్రిల్లర్‌కు ఆస్కార్ల పంట!

మాదక ద్రవ్యాల రవాణా ప్రపంచమంతటా ఉన్న సమస్యే. ఈ సమస్య నేపథ్యంలో ఎన్నో సినిమాలు కథలు అల్లుకున్నాయి. అలా వచ్చి విజయవంతమైన సినిమానే ‘ద ఫ్రెంచ్‌ కనెక్షన్‌’. దేశదేశాల్లో అల్లుకుపోయిన మాదక ద్రవ్యాల ముఠాలు ఎలా పనిచేస్తాయి, ఈ విషయంలో పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తుందనే విషయాలను విశ్లేషిస్తూ వాస్తవిక సంఘటనల ఆధారంగా రాబిన్‌ మూర్స్‌ అనే రచయిత రాసిన నవల ‘ద ఫెంచ్‌ కనెక్షన్‌: ఎ ట్రూ ఎకౌంట్‌ ఆఫ్‌ కాప్స్, నార్కొటిక్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ కాన్స్పిరెన్సీ’ ఆధారంగా విలియం ఫ్రెడ్‌కిన్‌ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా 1971 అక్టోబర్‌ 7న విడుదలై 2.2 మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి 75 మిలియన్‌ డాలర్లను వసూలు చేయడంతో పాటు అయిదు ఆస్కార్‌ అవార్డులను, రెండు బాఫ్తా అవార్డులు, మరో 12 అంతర్జాతీయ పురస్కారాలను గెలుచుకుంది. గొప్ప అమెరికా చిత్రాల్లో ఒకటిగా పేరు పొందింది. 32 మిలియన్‌ డాలర్ల విలువైన హెరాయిన్‌ అనే మత్తు పదార్థాన్ని అమెరికా తరలించడానికి అంతర్జాతీయ ముఠా చేసే ప్రయత్నాలను న్యూయార్క్‌ పోలీసులు ఎలా ఎదుర్కొన్నారనేదే కథ. సినీ చరిత్రలోనే అత్యద్భుతంగా చిత్రీకరించిన ‘కార్‌ ఛేజింగ్‌’ సన్నివేశం ఈ సినిమాలో ఉండడం విశేషం.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.