డ్రగ్స్‌ తీసుకోని ఎప్పుడూ కోపంగా ఉంటారట!!

కొన్నిసార్లు తెరపై పాత్ర ప్రభావం నిజ జీవితంపైనా ప్రభావితం చేస్తుంటుంది. అప్పట్లో తెరపై సూర్యకాంతం గయ్యాలితనం చూసి బయట కూడా ఆమె అలానే ఉంటుందేమో అని భయపడే వారట జనం. రాజనాలను తెరపై కరుడుగట్టిన విలన్‌గా చూసి ఆయన బయట కనిపిస్తే మహిళలు పరుగులు తీసేవారట. అయితే ఇలా తెరపై నటనను చూసి నిజ జీవితంలోనూ నటులు అలానే ప్రవర్తిసుంటారని పొరబడటం అడవి శేష్‌ జీవితంలోనూ ఓసారి జరిగిందట. ఆయన పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన ‘పంజా’లో ఓ ప్రతినాయక పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. అందులో డ్రగ్స్‌కు బానిసైన విలన్‌గా శేష్‌ నటన ప్రతి ఒక్కరినీ కట్టిపడేసింది. ఆ సినిమాలో ఆయన నటనను చూసి కొందరైతే తనకు నిజంగానే డ్రగ్స్‌ అలవాటుందని నమ్మేశారట. తాజాగా ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్నారు అడవి శేష్‌. ‘‘ఒకరోజు ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చి ‘సర్‌ మీకు కథ చెప్పాలనుకుంటున్నా’ అన్నాడు. సరే చెప్పండి అన్నా. ‘మీరేం అనుకోరు కదా, బాగానే ఉన్నారు కదా’ అన్నాడు. పర్లేదు బాగానే ఉన్నా చెప్పండి అన్నా. తను మళ్లీ రెండు మూడు సార్లు అలాగే అడిగాడు. దీంతో ఎందుకు మీరు అలా అడుగుతున్నారు అని అడిగేశా. దానికి ఆయన ‘మీరు బాగా డ్రగ్స్‌ తీసుకుంటారట. ఎప్పుడూ కోపంగా ఉంటారట కదా. ‘పంజా’లోనూ చూశాం’ అని అన్నాడు. దానికి నేను అవాక్కయ్యా. నాకు కనీసం సిగరెట్‌ కూడా అలవాటు లేదు. నేను ఆ చిత్రంలో కేవలం అలా నటించానంతే అని చెప్పా’’ అని ఆనాటి సంఘటన గుర్తుచేసుకోని నవ్వుకున్నారు శేష్‌. 


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.