బన్నీ ఇంటికి కోటి.. టబు ఇల్లేమో 4కోట్లు!!

థానాయకుడు ఎప్పుడైనా ఖరీదైన ఇంట్లో ఉంటాడు.. సహాయ నటులేమో మామూలు ఇళ్లలో జీవిస్తుంటారు. కానీ, ఇప్పుడు బన్నీ - టబుల ఇళ్లను చూస్తే మాత్రం ఈ మాట అటు వేసుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌ రూ.1 కోటి విలువ చేసే ఇంట్లో జీవిస్తుంటే.. సీనియర్‌ నటి టబు మాత్రం రూ.4 కోట్ల ఇంట్లో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తుందట. అయితే ఇదంతా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం కోసం చేసిన ఏర్పాటే లేండి. ప్రస్తుతం ఈ మాటల మాంత్రికుడి దర్శకత్వంలో బన్నీ తన 19వ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే కదా. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో సీనియర్‌ హీరోయిన్‌ టబు కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ చిత్రంలో ఆమె ఓ ధనవంతురాలైన మహిళగా కనిపించబోతుందట. అందుకే ఆమె కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో రూ.4 కోట్ల ఖర్చుతో ఓ ఖరీదైన బంగ్లాను సెట్‌ వేయిస్తున్నారట. విదేశాల్లో చూసిన ఓ ఖరీదైన భవంతిని స్ఫూర్తిగా తీసుకోని దీన్ని నిర్మిస్తున్నారట. ఇక ఈ చిత్రంలోని స్టైలిష్‌ స్టార్‌ ఇంటి కోసం రూ.1 కోటి ఖర్చుతో హైదరాబాద్‌లోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ సెట్‌ నిర్మించారట. అంతేకాదు ఈ చిన్న ఇంట్లో ఉండే స్టైలిష్‌ ఫర్నీచర్, తంజావూర్‌ నుంచి తెప్పించిన దేవుళ్ల ఫొటోల కోసమే దాదాపు రూ.30లక్షలు ఖర్చు చేశారట. మరి త్రివిక్రమ్‌ చిత్రం అంటే ఈ మాత్రం లేకపోతే ఎట్టా చెప్పండి. ఆయన గత చిత్రాలు ‘అరవింద సమేత’, ‘అఆ’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాల్లో ఇంత కంటే భారీ ఖరీదైన ఇళ్లనే చూపించారు. ఇప్పుడిదే కోవలో తన అభిరుచికి తగ్గట్లుగా మరికొన్ని ఇళ్లు నిర్మించుకుంటూ పోతున్నారు మాటల మాంత్రికుడు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.