మెహమాటాలకు పోవడం ఎందుకూ..

కెరీర్‌ ఆరంభంలో ఎవరికైనా ఎలాంటి పాత్రలు ఎంచుకోవాలో అర్థం కాదు. వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటే ఏమైపోతుందో అనుకుని, ప్రతి సినిమా ఒప్పుకుంటూ వెళ్తారు. అలాంటప్పుడే ఎదురుదెబ్బలు తగులుతాయి. కానీ అనుపమ పరమేశ్వరన్‌ ప్రతి అడుగూ ఆచి తూచి వేస్తోంది. తనకు సరిపోయే కథల్నీ, పాత్రల్నీ ఎంచుకుంటూ విజయాల్ని అందుకుంటోంది. ‘‘నేనూ చాలా విషయాల్లో గందరగోళానికి గురవుతుంటాను. అలాంటప్పుడే కొన్ని తప్పులు చేస్తుంటాం. కానీ సినిమా దగ్గరకు వస్తే మాత్రం నేను చాలా పక్కాగా ఆలోచిస్తుంటా. మొహమాటాలకు పోయి సినిమాల్ని ఒప్పుకుంటే కెరీర్‌లో చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఆ తరవాత ‘ఈ సినిమా ఎందుకు చేశాను’ అని నేను బాధపడుతూ కూర్చోవాలి. తప్పో, ఒప్పో ఇష్టమైన పాత్రల్లో నటిస్తూ వెళ్లాలి. అలాంటప్పుడు ఫలితం ఏదైనా సరే, స్వీకరించడానికి సిద్ధమైపోతాం. ఎవరో చెప్పారని, ఇంకెవరో బాధపడతారని గుడ్డిగా సినిమాల్ని ఒప్పుకుంటే అది నాకూ మంచిది కాదు, సినిమాకీ మంచిది కాదు’’ అని చెప్పింది అనుపమ.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.