కేరళలో సంచలనంగా ఓ కొత్త చిత్రం!!

త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తున్న ‘అరవింద సమేత’ చిత్రానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రోజుకు ఆరు షోలు వేసుకోవడానికి అనుమతిస్తేనే ఆశ్చర్యకరంగా చూశారు సినీప్రియులు. అలాంటిది ఓ చిత్రానికి విరామం లేకుండా 24 గంటలు ప్రదర్శించుకునే అవకాశమిస్తే ఎలా ఉంటుందది. ఇప్పుడలాంటి విశేషానికే వేదికవుతోంది కేరళ రాష్ట్రం. మలయాళ ‘ప్రేమమ్‌’ చిత్రంతో సినీప్రియుల హృదయాలు గెలుచుకున్నాడు నివీన్‌ పౌలీ. ఇప్పుడీ యువహీరో ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘కాయంకులం కొచున్ని’. ‘లీడర్‌’ ఫేం ప్రియా ఆనంద్‌ కథానాయికగా నటిస్తోంది. రోషన్‌ ఆండ్రూష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో లెజండరీ హీరో మోహన్‌లాల్‌ కూడా ఓ కీలకపాత్రలో నటించారు. ఈ చిత్రం 11వ తేదీన ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఓ సరికొత్త కథతో రూపొందిన భారీ చారిత్రక చిత్రమిది. కేరళ సినీచరిత్రలో మునుపెన్నడూ చూడని విధంగా అత్యధిక థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఏకంగా 300 వందల స్క్రీన్‌లలో తొలి రోజే వెయ్యికి పైగా షోలు వేసేందుకు సిద్ధమవుతోంది ఈ చిత్ర బృందం. మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ సినిమా సైతం ఇంతటి స్థాయిలో విడుదలవలేదంటే అతిశయోక్తి కాదు. ఈ చిత్రాన్ని విరామం లేకుండా 24 గంటల పాటు ప్రదర్శించుకోవడానికి కేరళ ప్రభుత్వం తాజాగా అనుమతి ఇచ్చింది. భారతీయ చిత్రసీమలో ఇప్పటివరకు ఏ చిత్రానికి ఇలాంటి అనుమతి లభించలేదు. 11వ తేదీ తెల్లవారుజాము నుంచే ఈ షోలు మొదలవబోతున్నాయి. ఇప్పుడీ సినిమా కోసం మలయాళ సినీ ప్రియులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


© Sitara 2018.
Powered by WinRace Technologies.