బాలయ్య వద్దంటే తీసేవాడిని కాదేమో!!

విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్ర ప్రచారపర్వాన్ని తనదైన శైలిలో జోరుగా నడిపిస్తున్నారు వర్మ. ఏం మాట్లాడితే.. ఎలా మాట్లాడితే తన సినిమాకు అనుకున్న స్థాయిలో హైప్‌ వస్తుందన్నది ఆలోచించి మరీ ప్రతి అడుగునూ జాగ్రత్తగా వేస్తున్నాడు. ఇందులో భాగంగానే చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూల్లో పలు ప్రశ్నలకు తనదైన శైలిలో ఆసక్తికర సమాధానాలు చెప్తున్నాడు వర్మ. తాజాగా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య - క్రిష్‌ల ఎన్టీఆర్‌ బయోపిక్‌ గురించి కొన్ని ఆసక్తికర కబుర్లను పంచుకున్నాడు. ‘‘ఎన్టీఆర్‌ బయోపిక్‌’ రెండు భాగాలను నేను చూశా. అప్పుడలా జరిగింది, ఇలా జరిగింది అని తాపీగా ముచ్చట్లు చెప్పుకున్నట్లుగా అనిపించింది. ముఖ్యంగా అందులో వాస్తవికత లోపించింది. అందుకే ఆ సినిమా నాకు నచ్చలేదు. నేను కనుక బాలకృష్ణతో కలిసి ఆ సినిమా తీసి ఉంటే రెండు భాగాల్ని కలిపి అరగంటకో గంటకో కుదించేసేవాడిని. లక్ష్మీ పార్వతి ఎపిసోడ్‌కు ప్రాధాన్యమిచ్చేవాడిని. అయితే దీనికి నిర్మాత బాలయ్యే నిర్మాత కాబట్టి ఆ ఎపిసోడ్‌ వద్దనేవారు. అప్పుడు నేను కూడా దాన్ని తీసి ఉండేవాడిని కాదేమో’’ అని చెప్పుకొచ్చాడు వర్మ. ఈ సందర్భంగానే తనని బాలయ్య ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ కోసం సంప్రదించిన విషయాన్ని బయటపెట్టారు. కానీ, తానెందుకు ఆ సినిమాను వదులుకున్నదీ చెప్పలేదు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.