హ్యాట్రిక్‌ కలయికకు.. టైటిల్‌ అదిరేలా!!

‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’.. అవసరాల శ్రీనివాస్‌ - నాగ శౌర్యల కలయికలో వచ్చిన ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్‌ ముందు చక్కటి విజయాలను అందుకున్నాయి. ఈ నేపథ్యంలో వీరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుందనగానే చిత్రసీమ వర్గాలతో పాటు సినీప్రియుల్లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాకు ఓ ఆసక్తికర టైటిల్‌ను ఖరారు చేసినట్లు ఫిలిం వర్గాల నుంచి సమాచారం అందుతోంది. తన గత చిత్రాల తరహాలోనే అవసరాల దీనికి ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’ అనే అచ్చ తెలుగు టైటిల్‌ను ఎంచుకున్నాడట. అంతేకాదు పేరుకు తగ్గట్లుగానే ఈ సినిమా ఓ సరికొత్త ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీతో రూపుదిద్దుకోనుందని తెలుస్తోంది. ఇక ఇందులో శౌర్యకు జోడీగా మాళవిక నాయర్‌ నటించబోతోంది. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.